యూపీఎస్సీ శతాబ్దపు ప్రతిభా ప్రస్థానం

by Ravi |   (  Updated:2025-10-01 00:00:30  IST  )

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మన దేశంలో అత్యున్నత స్థాయి సర్వీస్ ఉద్యోగాల నియామక సంస్థ. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్‌ వాలిస్

యూపీఎస్సీ శతాబ్దపు ప్రతిభా ప్రస్థానం
X

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మన దేశంలో అత్యున్నత స్థాయి సర్వీస్ ఉద్యోగాల నియామక సంస్థ. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్‌ వాలిస్ భారతదేశంలో సివిల్ సర్వీసెస్‌ను ప్రవేశపెట్టారు. 1854లో లార్డ్ మెకాలే కమిటీ సివిల్ సర్వీసెస్ నియామకాలను పోటీ పరీక్షల ద్వారా భర్తీ చేయాలని సూచించింది. పర్యవసానంగా 1926 అక్టోబర్ 1వ తేదీన ‘ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్’ను ఏర్పాటు చేసింది. 1950లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315-323 వరకు ఉన్న నిబంధనల ప్రకారం యూపీఎస్సీ రాజ్యాంగబద్ధమైన, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా స్థాపించబడింది. యూపీఎస్సీ నాటి నుంచి నేటికీ ప్రజా పరిపాలనలో సుస్థిరత, నిబద్ధత, నైపుణ్యం కలిగిన అధికారులను అందించే వేదిక అయ్యింది. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు సేవలకు గాను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, కేంద్ర సర్వీసులు, డిఫెన్స్ సర్వీసెస్ కోసం వివిధ పరీక్షలు నిర్వహిస్తోంది.

యూపీఎస్సీ పరీక్షా విధానం..

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షను రెండు దశలలో నిర్వహిస్తుంది. ప్రాథమిక పరీక్ష ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో జనరల్ స్టడీస్ 200 మార్కులు, CSAT 200 మార్కులు ఉంటాయి. ఇందులో కనీసం 33% మార్కులు సాధించాలి. రెండవ దశ ప్రధాన పరీక్ష (మెయిన్స్) డిస్క్రిప్టివ్ విధానంలో జరుగుతుంది. మొత్తం మార్కులు మెరిట్ పరిగణనలోకి వచ్చే పేపర్లు 1750. ఇంటర్వ్యూ మార్కులు 275 ఉంటాయి. తుది ఫలితాలను మొత్తం 2025 మార్కులు, ర్యాంకులు ఈ ఆధారంగా నిర్ణయిస్తారు.

సుదీర్ఘ ప్రతిభా ప్రస్థానం..

అయితే ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఈ పరీక్ష భారత యువతకు ఒక సవాల్, అవకాశం రెండింటినీ ఇస్తుంది. ఒకప్పుడు బ్రిటన్‌కు వలసవాద దేశంగా ఉన్న భారతదేశం నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే నాలుగో స్థానానికి చేరడంలోనూ శాస్త్ర, సాంకేతిక, రాజకీయ అం శాల్లో ఎదిగి అదే బ్రిటన్‌ను పాలించి ప్రపంచ చరిత్రలో తనదైన ముద్ర వేసుకుంది. పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, పరిశ్రమల స్థాపనలో సివిల్ సర్వెంట్ల చరిత్ర, పాత్ర ఎంతో గణనీయమైనది. ఈ సుదీర్ఘ శత వసంతాల సివిల్ సర్వీస్ ప్రయాణం మెకాలే కమిటీ (1854) నుంచి మొదలుకొని డీఎస్ కొట్టారి కమిటీ (1974), సతీశ్ చంద్ర కమిటీ (1988), సురేంద్రనాథ్, బి.ఎన్ యుగంధర్ కమిటీ (2003), పీసీ హోతా (2004) ఖన్నన్ (2010) మరెన్నో కమిటీలు సివిల్ సర్వీసెస్ పరీక్షల విధానంలో కాలానుగుణంగా నిర్మాణాత్మకమైన మార్పులను తీసుకువస్తున్నాయి.

అభయహస్తం & ప్రతిభా సేతు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై 20, 2024న ప్రారంభించిన ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం ద్వారా తెలంగాణకు చెందిన యూపీఎస్సీ‌లో సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులై, మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు ₹1 లక్ష ఆర్థిక సహాయం అంది స్తోంది. సింగరేణి వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలలో భాగంగా ఇలాంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, రెసిడెన్షియల్ వసతులను అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 జూన్ నెలలో ‘ప్రతిభా సేతు పథకం’ను ప్రారంభించింది. యూపీఎస్సీ రాత పరీక్ష, ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచినప్పటికీ తుది ఎంపికలో నిలబడని అభ్యర్థులకు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రతిభా సేతు ప్రధాన ఉద్దేశ్యం. ఇది అభ్యర్థుల కృషిని వృథా కాకుండా చేయడానికి, వారి ప్రతిభను సద్వినియోగం చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా మారింది.

కాఠిన్యత కారణంగా విమర్శలు..

పాఠశాలల్లో స్థాయిలో విద్యార్థులకి సివిల్ సర్వీసెస్ సిలబస్‌ను పాఠ్య ప్రణాళికలో అంతర్భాగంగా పొందుపరచడం, ప్రభుత్వం మరిన్ని ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు వలన పేద, మధ్యతరగతి విద్యార్థులు సివిల్ సర్వీస్ సాధించే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుం ది. యూపీఎస్సీ ప్రతిష్టాత్మకమైన పరీక్ష అయినప్పటికీ, దాని కఠినత, సుదీర్ఘత, అసమానతలు, పోటీ కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతీ అభ్యర్థి దృఢ సంకల్పంతో, నైతికతతో, సామాజిక బాధ్యతతో పనిచేస్తే, యూపీఎస్సీ ద్వారా దేశ అభివృద్ధి, సామాజిక సమతా, ప్రజాసంక్షే మ, ప్రజాస్వామ్య లక్ష్యాలు నెరవేరుతాయి.

-మంతెన శ్రీనివాస రాజు

94938 80551

Next Story