తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి!

by Ravi |   (  Updated:2025-08-29 01:16:15  IST  )

తెలుగు రాష్ట్రాల ముందు ఒక అరుదైన అవకాశం వచ్చి ఉంది. దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉప రాష్ట్రపతి పదవికి

తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి!
X

తెలుగు రాష్ట్రాల ముందు ఒక అరుదైన అవకాశం వచ్చి ఉంది. దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉప రాష్ట్రపతి పదవికి సుప్రసిద్ధ తెలుగు న్యాయమూర్తి ఇండియా కూటమి తరపున పోటీ చేయనున్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో, సామరస్య వాతావరణంలో పాలన చేస్తున్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా ఆయన అభ్యర్థిత్వాన్ని మనసా వాచా సమర్థించాల్సినా అవసరం ఎంతైనా ఉంది.

పీవీ నరసింహారావు తర్వాత తెలుగువాడిగా జాతీయ స్థాయిలో అనన్య సాధ్యమైన ఆదరాభిమానాలు కలిగి ఉన్నవారు చంద్రబాబు నాయుడు. వచ్చే 2028 నాటి అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ నుంచి కూడా పోటీ చేయదలు‌స్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ తెలుగువారి భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.

సరైన నిర్ణయం తీసుకోవాలి!

1982 మార్చి 29న మహానటుడు ఎన్టీ రామారావు సారథ్యంలో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పౌరుషాన్ని నిలబెట్టి ప్రపంచానికి చాటి చెప్పాలనే లక్ష్యంతో ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఇప్పుడు తెలుగు వాడైన ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నారు. రాజనీతిజ్ఞుడు, విజ్ఞుడు అయిన నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని, తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలుగు రాష్ట్రాల్లోని మేధావులు, ఆలోచనాపరులు ఆశిస్తున్నారు. తెలుగు‌దేశం పార్టీ గత చరిత్రను పరిశీలిస్తే తెలుగు జాతి గౌరవం ఉన్నతి కోసం వారు ఎంత దూరమైనా పోతారనే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.

ఈ సామరస్యతే ఇప్పుడు అవసరం!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన ప్పటికీ ఉమ్మడి తెలుగువారు అన్న దమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలనీ, తమ తమ ప్రాంతాల ప్రభుత్వాలతో ఉన్న అధినాయకులు ఆలోచనలను, భావాలను ఇచ్చి పుచ్చుకోవాలనీ, తద్వారా ఇరు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో కొనసాగాలని ప్రజలు భావిస్తున్నారు. అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్యలను సహృద్భావ వాతావరణంలో సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.

విలక్షణ న్యాయమూర్తికి మద్దతివ్వాలి!

ప్రస్తుతం రాజ్యాంగ విభాగాలలో ఒక విధమైన ప్రతిష్టంభన ఏర్పడిన ఛాయలు పొడసూపుతున్న సంధి కాలంలో భారత రాజ్యాంగ చట్ట పరిరక్షకుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి ఉప రాష్ట్రపతిగా దక్షిణాది నుండి అది తెలుగు ప్రాంతం నుంచి పోటీ పడుతున్నాడు. ఇండియా కూటమి మద్దతుతో బరిలో నిలబడడం యాదృచ్ఛికంగా ఆయనకు వచ్చిన అవకాశం. ఆయన వ్యక్తిత్వంలో హుందాతనం, విలువలు జగమెరిగిన సత్యాలే కదా. రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కులకు భంగం కలిగిన ప్రతిసారీ వాటి కోసం ఆయన ఆయా సందర్భాలలో వెలువరించిన తీర్పులు చదివితే ఎంత విలక్షణమైనవో తెలియజేస్తాయి.

అధినేతనే ఎదిరించిన మేటి..

తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 1984లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభ సమయంలో నిర్వహించిన గణనీయమైన పాత్ర ఇంకా తెలుగువారి మనో ఫలకం మీద నిన్న మొన్న జరిగిన సంఘటనలా ఇంకా నిలిచిపోయే ఉన్నది. 1995 ఆగస్టు పార్టీ భవిష్యత్తు గందరగోళంలో పడ్డప్పుడు నాయకుడిని ఎదిరించి అనివార్య పరిస్థితులలో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించిన విషయం కూడా తెలుగు ప్రజలు మర్చిపోలేని అనుభవం . రాజకీయ పరిపక్వత కలిగిన నాయకుడిగా పార్టీని రక్షించుకోవడానికి ఆయన చాకచక్యంతో ప్రదర్శించిన రాజనీతిజ్ఞత అరుదైనది.

ఈ సారీ చక్రం తిప్పాల్సిందే..!

1995 సెప్టెంబర్ 1 నుండి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, అనంతరం రాష్ట్ర విభజించబడ్డాక ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రిగా సమన్వయంతో పరిపాలి‌స్తున్నారు. తెలుగువారు అన్నా తెలుగువారి ఆత్మ గౌరవం అన్నా వల్లమాలిన అభిమానం కలిగిన నాయకుడు. పీవీ నరసింహారావు తర్వాత తెలుగువాడిగా జాతీయ స్థాయిలో అనన్యమైన ఆదరాభిమానాలు కలిగి ఉన్నవాడు. ప్రజలతో పాలు నీళ్లలా మమేకమయ్యే స్వభావం ఆయనకే సొంతం. జాతీయ స్థాయిలో అవసరం అయినప్పుడల్లా సంకీర్ణ ప్రభుత్వాలలో చక్రం తిప్పిన రాజకీయ నాయకుడు. మొదటిసారి బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన వాడు. రాష్ట్ర శాసనసభకు మహిళా స్పీకర్‌ను, జాతీయ స్థాయిలో లోకసభకు దళిత నాయకుడు స్పీకర్‌గా పనిచేయడానికి దోహదపడ్డారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తోడుగా మరిన్ని పథకాలను అమలు చేసి చూపారు. సందర్భం ఏర్పడినప్పుడల్లా జాతీయస్థాయిలో మతవాద రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించాడు.

ఆత్మ ప్రబోధ ప్రకారమే..

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలో చంద్రబాబు మద్దతు తప్పనిసరి అయింది. ఎంతటి ఎదురుగాలిలోనైనా రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చంద్రబాబు తనకు తానే సాటి. ఇన్ని లక్షణాలు కలిగిన చంద్రబాబు నాయుడు తెలుగు ఆత్మగౌరవం, తెలుగు పౌరుషం నిలబెట్టడానికి ఆయా సమయాలలో వ్యవహరించినట్టే ఇప్పుడు కూడా తన ఆత్మ ప్రబోధం అనుసరించి నిర్ణయం తీసుకుంటారని ఆశిద్దాం.

తెలంగాణ మద్దతు కావాలంటే...

పైగా 2028 సంవత్సరంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో కూడా పోటీ చేయాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పై విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాన్ తెలుగువాడి భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుంటారని తెలుగు ప్రజల సిక్స్త్ సెన్స్ చెప్తున్నది. ఏమి చేయాలనుకుంటున్నారో చూడాలి. ఎలా సద్వినియోగం చేసుకుంటారో సెప్టెంబర్ 9 సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

-జూకంటి జగన్నాథం,

కవి, రచయిత,

94410 78095

Next Story