ఉన్నది ఉన్నట్టు: టామ్ అండ్ జెర్రీ ఆటలో పొలిటికల్ పార్టీలు

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు: టామ్ అండ్ జెర్రీ ఆటలో పొలిటికల్ పార్టీలు
X

అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారం, ఇవేవీ ఇప్పుడు పాలకులకు ప్రయారిటీ కాదు. ఎన్నికలలో అధికారంపైనే వీటి తపనంతా. ఇంకా ఏడాది టైమ్ ఉన్నా ఇప్పటి నుంచే అవి ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయాయి. గతంలో ఇచ్చిన హామీల అమలు, వాటి ఫెయిల్యూర్, ప్రజల అవసరాలు, పెండింగ్‌లోని దరఖాస్తులు.. ఇవన్నీ 'లైట్ తీసుకో' తరహాగా మారిపోయాయి. ప్రజలు, వారి అవసరాలు, సమస్యలు, పరిష్కారం.. ఇవేవీ తెరపైకి రాకుండా, ప్రజల నుంచి డిమాండ్లుగా మారకుండా పొలిటికల్ సెన్సేషనల్ వ్యవహారాలు హైలైట్ కానున్నాయి. ప్రజలు కూడా ఎప్పుడు ఏ సంచలన వార్త వస్తుందా అని ఉత్కంఠగా ఎదురుచూసే వాతావరణానికి అలవాటైపోయారు.

చిన్నప్పుడు మనలో చాలామంది టామ్ అండ్ జెర్రీ కథలను చదివే ఉంటాం. ఇప్పుడు తెలంగాణలోని పరిస్థితులను చూస్తూ ఉంటే ఆ కథలే గుర్తుకొస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ తెలంగాణలో ఇప్పుడు ఆ తరహాలోనే జరుగుతున్నది. రోజూ ఏదో ఒక సంచలనంతో ప్రజలను ఆ అంశాల చుట్టే తిరిగేలా చేస్తున్నది. ఇతర సమస్యల మీద ఆలోచించడానికి కూడా ప్రజలకు అవకాశం ఇవ్వకుండా అటెన్షన్‌ డైవర్ట్ చేస్తున్నది. జనం మైండ్‌సెట్‌నూ మార్చేశారు. దాదాపు ఏడాది కాలంగా ప్రజల అట్రాక్షన్ అంతా ఈ రెండు పార్టీలపైనే పడింది. జనం మూడ్ కూడా దానికే అలవాటుపడిపోయింది. నిత్యం జరుగుతున్న సీబీఐ, ఐటీ, ఈడీ దాడులతో రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మానసికంగా టెన్షన్‌ పడుతున్నారు.

కేసులతో పొలిటికల్ ఫ్యూచర్ ఏమవుతుందోననే ఆందోళనకు గురవుతున్నారు. ఆర్థిక లావాదేవీలపై నిఘా పెరగడంతో వారి చేతులు కట్టేసినట్లవుతున్నది. దీనికి చెక్ పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వమూ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నది. సీబీఐ ఎంట్రీకి చెక్ పెట్టేలా జీఓ జారీ చేసింది. కానీ ఐటీ, ఈడీ దాడుల విషయంలోఅలాంటివి సాధ్యం కాకపోవడంతో నిస్సహాయంగా ఉండిపోయింది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారంతో(moinabad farm house case) 'సిట్' తెరమీదకు వచ్చింది. బీజేపీ నేతలను ఇరుకున పెట్టే చర్యలు మొదలయ్యాయి. ఇప్పుడు టెన్షన్ పడడం వారి వంతయింది.

అన్నీ ఒక తాను ముక్కలే

ఇటీవలి కాలంలో ప్రభుత్వాలకూ, అధికారంలో ఉన్న పార్టీలకూ మధ్య విభజన రేఖ కనుమరుగైంది. ప్రభుత్వమూ, పార్టీ ఒకటేననే తీరులో వ్యవహరిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలకు, పార్టీకి సంబంధం లేకపోయినా అవి పొలిటికల్ చెప్పుచేతలలోనే పనిచేస్తున్నాయనే సాధారణ అభిప్రాయం నెలకొన్నది. అధికార పార్టీకి జేబు సంస్థలంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. 'రెండాకులు ఎక్కువే చదివా' అనే తీరులో దర్యాప్తు సంస్థలను ప్రయోగించి రాజకీయ ప్రయోజనం పొందడంలో రెండు అధికార పార్టీలూ పోటీపడుతున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. చెస్ గేమ్ తరహాలో రెండు పార్టీలూ రాష్ట్రాన్ని పొలిటికల్ లేబొరేటరీగా మార్చేసుకున్నాయి. దర్యాప్తు సంస్థలపైనే జనం దృష్టి కేంద్రీకృతమయ్యేలా పార్టీలు భారీ స్కెచ్ వేశాయి.

మంత్రి మల్లారెడ్డి నివాసంలో రెండున్నర రోజుల పాటు జరిగిన సోదాలు రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారాయి. అక్కడేం దొరికాయి.. ఎంత నగదు స్వాధీనమైంది.. ఎన్ని అక్రమాలు బైటపడ్డాయి.. బంగారం ఎన్ని కిలోలున్నది.. ఎవరెవరికి నోటీసులు వచ్చాయి.. ఎంక్వయిరీలో ఎలాంటి ప్రశ్నలు వేశారు.. ఎవరు అరెస్టయ్యారు.. ఇలాంటి క్యూరియాసిటీ ఎక్కువైంది. నెక్స్ట్ టార్గెట్ ఎవరనే చర్చలూ జరుగుతున్నాయి. సరిగ్గా పార్టీలు కోరుకున్నదీ ఇదే. ప్రజలు వారి సమస్యల నుంచి ఇలాంటి సెన్సేషనల్ అంశాల వైపు డైవర్ట్ కావాలన్న వ్యూహం సక్సెస్ అయింది.

Also read: వివాదాలలో గవర్నర్లు! కారణాలేంటి?

సంచలనాల కోసమే అంతా

నిజానికి ఈ దాడులతో, విచారణలతో ఏమీ జరగదనేది పార్టీ నేతలకు తెలియందేమీ కాదు. రాష్ట్ర ప్రజలకూ ఇది స్వీయానుభవమే. రాష్ట్రంలోనే పెను సంచలనంగా మారిన డ్రగ్స్ కేసు ఎటూ తేలకుండా ఉండిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 2015లో ఓటుకు నోటు కేసు పరిస్థితీ అంతే. ఇప్పుడు జరుగుతున్న దాడులు పొలిటికల్‌గా పైచేయి సాధించడానికే తప్ప చివరకు ఎవరికి ఏమీ కాదనేది ప్రజలకూ అర్థమైపోయింది. లాజికల్ ఎండ్‌కు వెళ్లవనేదీ వారికి తెలుసు. అయినా ప్రజలకు ఇలాంటి విషయాలలో ఆసక్తి ఎక్కువ. ఒకప్పుడు ఎన్నికలు జరిగినప్పుడే ఇలాంటి సందడి ఉండేది. ఏం జరుగుతుందోననే ఇంట్రస్ట్ పుట్టేది. కానీ, ఇప్పుడు ప్రతిరోజూ ఎన్నికల సందడే. ఉదయం నుంచి రాత్రి వరకూ రాజకీయమే. దీని కోసమే పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందుతున్నాయి. నిద్ర లేచిన దగ్గరి నుంచీ సంచలన వార్తలతోటే టైమ్ గడిచిపోతున్నది.

హైకోర్టుకు ఒక గౌరవం, గుర్తింపు ఉండేది. ఒకప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మాత్రమే హైకోర్టుకు వెళ్లడం ఆనవాయితీ. కానీ, ఇప్పుడు సాధారణమైపోయింది. ఒకే కేసుకు సంబంధించి వేర్వేరు వైపుల నుంచి పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఇక లంచ్ మోషన్ పిటిషన్ల సంగతి సరేసరి. వీటిపై జరిగే విచారణ గంటగంటకూ ఉత్కంఠగా మారుతున్నది. ఫామ్ హౌజ్ దర్యాప్తు వ్యవహారంపై కేసు నమోదు చేయడం మొదలు అరెస్టుకు, జ్యూడిషియల్ రిమాండ్‌కు, బెయిల్‌కు, కస్టడీ కోసం క్రింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక విచారణ కోసం 'సిట్' నోటీసులు జారీచేయడంపై ఇప్పటికీ విచారణ జరుగుతూనే ఉన్నది. పిటిషన్‌కు కౌంటర్ వేయడం కూడా సంచలనం రేకెత్తించే వార్తలైపోయాయి.

అందరి అడుగులు కోర్టు వైపే

నిరసనలు, పాదయాత్రలు, బహిరంగసభలు, ర్యాలీలు లాంటి పార్టీ ఎఫైర్స్ మీద కూడా కోర్టులను ఆశ్రయించడం ఒక అవసరంగా మారిపోయింది. తొలుత పోలీసులు అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత రకరకాల కారణాలతో నిరాకరించడం రివాజుగా మారింది. ఇలాంటి పర్మిషన్ల కోసం కూడా హైకోర్టుకు వెళ్లడం మొదలైంది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర (praja sangrama yatra) విషయంలో, వైఎస్సార్టీపీ షర్మిల (Ysrtp chief) పాదయాత్ర అంశంలో, ఆ పార్టీ బహిరంగసభల విషయంలో ఇలాంటివి ఇటీవల రొటీనైపోయాయి. చివరి నిమిషం వరకూ సస్పెన్స్ కొనసాగేలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక ఎంపీల నివాసాలపై పరస్పరం దాడులు చేసుకోవడం, ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదులు రోజువారీ ప్రోగ్రామ్‌గా మారిపోయాయి.

పొలిటికల్‌గా పైచేయి సాధించడానికి బీజేపీ, టీఆర్ఎస్ పడరాని పాట్లు పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందంటూ హైదరాబాద్ వేదికగానే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కామెంట్లు చేస్తుంటారు. కానీ వీటిపై దర్యాప్తు విషయంలో మాత్రం సైలెంట్. కేసీఆర్‌ను ఇరుకున పెట్టడానికి చుట్టూ ఉన్న కోటరీలోని ముఖ్యులను, సన్నిహితులను టార్గెట్ చేసేలా బీజేపీ వ్యూహం పన్నుతున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థలూ ఆ దిశగానే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాయి. మంత్రులు, వారి పీఏలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల నివాసాల్లో సోదాలు, విచారణలు రొటీన్ యాక్టివిటీస్ అయిపోయాయి.

Also read: అవి జేబు సంస్థలేనా?

పోటాపోటీగా దాడులు

ఐటీ, ఈడీలకు దీటుగా ఇప్పుడు టీఆర్ఎస్ 'సిట్'ను ప్రయోగిస్తున్నది.(Telangana sit investigation) రానున్న కాలంలో ఏసీబీని కూడా వాడే అవకాశం లేకపోలేదు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతున్నా, కోర్టుల దాకా వెళ్తున్నా రెండు పార్టీల పెద్దలు మాత్రం 'సేఫ్ జోన్'లోనే ఉంటున్నారని ఓపెన్‌గానే కామెంట్లు వినిపిస్తున్నాయి. అగ్రనేతలకు దెబ్బ తగలకుండా అటెన్షన్ డైవర్ట్ చేసే దిశగానే పోటాపోటీగా దర్యాప్తులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే వరకూ ఈ రెండు పార్టీల మధ్య ఇలాంటి డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సోదాలు, తనిఖీలు, అదుపులోకి తీసుకోవడం, విచారణ పేరుతో ప్రశ్నించడం, నోటీసులు, అరెస్టులు, రిమాండ్‌లు, కస్టడీలు.. ఇలాంటివన్నీ ఇకపైన రెగ్యులర్ యాక్టివిటీస్‌గా మారనున్నాయి. ఏ చిన్న అంశం దొరికినా దాన్ని పొలిటికల్‌గా మైలేజీ పొందడానికి ఏం చేయాలో పార్టీలు ఆలోచిస్తున్నాయి.

అధికారాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నాయి. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారం... ఇవేవీ ఇప్పుడు పాలకులకు ప్రయారిటీ కాదు. ఎన్నికలలో అధికారంపైనే వీటి తపనంతా. ఇంకా ఏడాది టైమ్ ఉన్నా ఇప్పటి నుంచే అవి ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయాయి. గతంలో ఇచ్చిన హామీల అమలు, వాటి ఫెయిల్యూర్, ప్రజల అవసరాలు, పెండింగ్‌లోని దరఖాస్తులు.. ఇవన్నీ 'లైట్ తీసుకో' తరహాగా మారిపోయాయి.

కొసమెరుపు

ప్రజలు, వారి అవసరాలు, సమస్యలు, పరిష్కారం.. ఇవేవీ తెరపైకి రాకుండా, ప్రజల నుంచి డిమాండ్లుగా మారకుండా పొలిటికల్ సెన్సేషనల్ వ్యవహారాలు హైలైట్ కానున్నాయి. ప్రజలు కూడా ఎప్పుడు ఏ సంచలన వార్త వస్తుందా అని ఉత్కంఠగా ఎదురుచూసే వాతావరణానికి అలవాటైపోయారు. ఎన్నికలు, ఆ పైన అధికారంలోకి రావడం వరకూ రెండు పార్టీల ఎత్తుగడలు ఏ తీరులో ఉండనున్నాయో అనే చర్చలు ప్రజలలో బహిరంగంగానే జరుగుతున్నాయి. రానున్న కాలంలో మరింత హీట్ పుట్టించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ రెండు పార్టీల ఎత్తుగడలన్నీ ఒక 'ఎంటర్‌టైన్‌మెంట్ షో' తరహాలో ప్రజలకు ఎంజాయ్‌మెంట్ ఇస్తున్నాయి.


ఎన్. విశ్వనాథ్

99714 82403


Next Story