ఉన్నది ఉన్నట్టు:ప్రజాగ్రహం కట్టలు తెగితే!?

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు:ప్రజాగ్రహం కట్టలు తెగితే!?
X

భారత్‌లోనూ నిత్యావర వస్తువులు, పెట్రోలు-డీజిల్-వంటగ్యాస్ ధరలు ఆందోళకరంగా మారుతున్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. ప్రజల మధ్య కుల, మత, వర్గ విభజన రేఖ ఏర్పడింది. ధనిక-పేద అంతరం పెరుగుతున్నది. సమాజంలో అశాంతి నెలకొన్నది. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ప్రజా ప్రతినిధులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఐటీ, ఈడీ సోదాలలో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు బైట పడుతున్నాయి. ఒకవైపు పేదలు గూడు కోసం తపిస్తున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు వందలాది ఎకరాలను పోగేసుకుంటున్నారు. ఈ అసంతృప్తి ఆగ్రహంగా మారకముందే మేలుకోవడం పాలకులకు అవసరం. శ్రీలంకలోని ప్రజాగ్రహం కనువిప్పు కావాలి.

ప్రజల సహనం నశిస్తే ఏమవుతుందో ఊహించలేం. అది ఏ రూపం తీసుకుంటుందో అంచనా వేయలేం. ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఎలా మారుతుందో పసిగట్టలేం. గతంలో చైనాలోని తియాన్‌మెన్ స్క్వేర్ సంఘటనను చూశాం. పుష్కరకాలం క్రితం 'మల్లెపూల విప్లవం' పేరుతో అరబ్ స్ప్రింగ్‌ తిరుగుబాటును చూశాం. ఇప్పుడు శ్రీలంకలో చూస్తున్నాం. భవిష్యత్తులో అది ఏ దేశంలో ఎలా పెల్లుబుకుతుందో ఇప్పుడే చెప్పుకోలేం. పాలకుల విధానాలు ప్రజలకు శాపంగా మారినప్పుడు తిరుగుబాటు అనివార్యమనేది అనేక దేశాలలో జరిగిన సంఘటనలు రుజువుచేశాయి. ప్రజల జీవితాలతో ఆటలాడే పాలకులకు పలాయనం తథ్యమనే సందేశాన్ని ఇచ్చాయి. బాధలో ఉన్నప్పుడు ఓదార్పు, కష్టాలలో ఉన్నప్పుడు కనికరించడం, ఆకలితో ఉన్నప్పుడు ఆదుకోవడం మానవ సహజ లక్షణం.

శ్రీలంకలోని తాజా ప్రజాగ్రహం ప్రపంచ నేతలందరికీ ఒక గుణపాఠం. జనం తిరగబడితే నిర్బంధం, కర్ఫ్యూ, ఎమర్జెన్సీ, పోలీసులు, సైన్యం ఇవేవీ ఆపలేవని నిరూపించింది. చేతిలో ఆయుధంగానీ, నడిపించే నాయకత్వంగానీ, హింసగానీ లేకుండా లక్షలాది మంది జమయ్యారు. ఎవ్వరూ ఎలాంటి పిలుపు ఇవ్వకుండానే జనం కదం తొక్కారు. నిన్నటిదాకా 'ఆడింది ఆటగా' సాగిన పాలకుల పరిస్థితి తలకిందులైంది. గత్యంతరం లేక పాలకులు తోక ముడిచారు. దేశం విడిచిపెట్టి పారిపోయారు. పాలకుల అవినీతి, బంధుప్రీతి, అసమర్థ పాలన, ఫలితంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభమే ప్రజల ఆగ్రహానికి కారణం.

అహింసా పద్ధతులతోనే

బుద్ధుడి శాంతి బోధనలు వినిపించే శ్రీలంకలో పౌరులు సింహాలై గర్జించారు. హింసకు తావులేకుండా పాలకులను పారదోలారు. ప్రజల పన్నులతో రాజభోగాలు అనుభవించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నెత్తురుచుక్క లేని నిరసనలతో బుద్ధి చెప్పారు. 'గొటబాయ గో' నినాదంతో అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, తినడానికి తిండి దొరకక ప్రజలు ఇబ్బందులలో ఉంటే పాలకులు మాత్రం లగ్జరీ జీవితం గడుపుతున్నారన్నదే వారికి కడుపు మంట కలిగించింది. తమను పట్టించుకోని ప్రభుత్వం వద్దనేదే వారి విధానమైంది. అందుకే వారిని సాగనంపడమే ధ్యేయంగా దండుగా కదిలారు.

ఇప్పుడు శ్రీలంకలో జరిగిన పరిణామాలు భవిష్యత్తులో ఏ దేశంలోనూ జరగవనే గ్యారంటీ ఏమీ లేదు. ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన లేనప్పుడు ఇలాంటివే జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగినప్పుడూ పోలీసు లాఠీలను, తూటాలను ప్రజలు లెక్కచేయలేదు. గుజ్జర్లు రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమం, సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉత్తరాది రాష్ట్రాల రైతుల నిరసనలు, ఇలాంటి ఎన్నో సంఘటనలు కళ్లముందు సజీవ సాక్ష్యాలు. పాలకులు అవినీతిలో కూరుకుపోవడం, సంపదను పోగేసుకోవడం, ప్రజలు సంక్షోభంలో పడడం జరిగినప్పుడు ఇవే జరుగుతాయని తేటతెల్లమైంది.

నిబద్ధత కలిగిన ప్రజలు

అధ్యక్ష భవనాన్ని చుట్టుముడుతున్నారన్న విషయాన్ని ముందుగానే గ్రహించిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరారయ్యారు. ప్రజల జీవితాలను పణంగా పెట్టి రాజపక్స కుటుంబ సభ్యులు విలాస జీవితాన్ని గడపడాన్ని తట్టుకోలేకపోయారు. అధ్యక్ష భవనంలోకి ఎంటర్ అయిన ప్రజలు ప్రతీ అంగుళాన్ని నిశితంగా పరిశీలించారు. స్వర్గం అంటే ఇలాంటి భవనాలు, ఇందులోని ఖరీదైన వస్తువులు, చీకూ చింతా లేని సుఖమయ జీవనం, ఇవే కాబోలు అని ఊహించుకున్నారు. అధ్యక్షుడు వాడే కుర్చీలు, సోఫాలు, బెడ్‌లు, బాత్‌రూమ్‌లు, స్విమ్మింగ్ పూల్ ఇలా అన్నింటినీ చూసి మరింత ఆగ్రహానికి గురయ్యారు. చివరకు ఈ అధ్యక్ష భవనం ఒక పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.

ఆహారం దొరకక రోజుల తరబడి పస్తులున్న శ్రీలంక ప్రజలు అధ్యక్షుడి లగ్జరీ లైఫ్‌ను చూసి అసహ్యించుకున్నారు. భవనంలో నోట్ల కట్టలను చూసి నివ్వెరపోయారు. కానీ, ఒక్క కరెన్సీ నోటునూ ముట్టుకోకుండా సైన్యానికి అప్పగించారు. ప్రతీ వస్తువునూ చేతులతో తడిపి వినోదం పొందారు. దాదాపు మూడు దశాబ్దాలుగా రాజపక్సే కుటుంబానికి చెందిన 40 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వివిధ స్థాయిలలో పాలనా వ్యవహారాలలో మునిగిపోయారు. వారి ముందుచూపు లేని నిర్ణయాలు, తప్పుడు విధానాల ఫలితమే దేశానికి ఈ గతి పట్టిందని భావించారు.

అవేమీ ప్రభావం చూపలేదు

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి కారణాలు ఎన్నయినా ఉండొచ్చు. ఆర్థిక సంస్కరణలు, ఉచిత పథకాలు, పన్ను రాయితీలు, విదేశీ పెట్టుబడులు, ఇలాంటివి ఏవైనా అంతిమంగా ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ప్రధానం. ప్రభుత్వాలు తీసుకునే విధానాలు ప్రజలకు శాపంగా మారినప్పుడు రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వారి జీవితాలు ప్రశ్నార్థకమైనప్పుడు, రోడ్డున పడ్డప్పుడు ఏం జరుగుతుందో గ్రహించలేం. స్వయం సమృద్ధి దిశగా లేని పాలనా విధానమే ఇప్పుడు శ్రీలంక ప్రజలకు నిలువ నీడ లేకుండా చేసింది. సరైన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక పాలసీలు లేని కారణంగా స్వంత కాళ్ళ మీద నిలబడలేకపోయింది. అధికారం కేంద్రీకృతమైతే పాలకులకు కళ్లు నెత్తికెక్కుతాయి.

ప్రజలు ఐదేళ్లు పాలించే అధికారం ఇచ్చారంటూ విర్రవీగుతారు. తాము చెప్పిందే వేదమంటూ అహంకారాన్ని ప్రదర్శిస్తారు. తమకు ఎదురే లేదంటూ గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. పెత్తందారీ పోకడలు, ఎవరికీ జవాబుదారీ కాదనే తలబిరుసుతనం, నియంతృత్వ ధోరణి.. ఇవి పరాకాష్టకు చేరినప్పుడు ప్రజల నుంచి ఆగ్రహం ఇలాగే బైటకు వస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, బతుకు భారం కావడం, ఆర్థిక సంస్కరణలు భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టడం, ఉద్యోగ-ఉపాధి కల్పన లేకపోవడం, ఇలాంటి విపరీత పరిణామాలు ప్రజల సహనం కట్టలు తెంచుకోడానికి కారణమవుతున్నాయి.

స్వచ్ఛందంగానే బయటకు వచ్చి

అందుకే శ్రీలంక ప్రజలు స్వచ్ఛందంగా వీధులలోకి వచ్చి నిరసనలకు దిగారు. వారి నినాదాలు చాలా ఆలోచనలతో కూడినవి. గొటబాయ రాజపక్స అవినీతిని ప్రశ్నించారు. విదేశాలలో ఆయన పోగేసుకున్న సొమ్మును ప్రజల కడుపు నింపడానికి వాడాలని డిమాండ్ చేశారు. ఈ పాలకులతో ప్రయోజనం లేదనే నిర్ణయానికి వచ్చారు. అందుకే 'గో బ్యాక్' నినాదంతో భవనం నుంచి తరిమేయడానికి దండయాత్ర చేశారు. పోలీసులు, సైనికులు, ప్రభుత్వ దళాలు నిస్సహాయంగా ఉండిపోయాయి. ప్రజలు తిరగబడే పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవడం పాలకుల కనీస బాధ్యత. వారు తీసుకునే నిర్ణయాలు ప్రజానుకూలంగా ఉన్నంత వరకు ఢోకా ఉండదు.

ప్రజల కాళ్ల కింద నేల కదిలిపోతే అది పాలకులకే ముప్పు. పాలనలోనూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి. ఒక చిన్న నిప్పు రవ్వ దావానలంలా వ్యాపిస్తుందనే సత్యాన్ని గ్రహించాలి. మల్లెపూల విప్లవం ఒక యువకుడి ఆత్మార్పణతో మొదలైంది. పలు దేశాలకు పాకింది. పాలకులు ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమం కూడా ఆత్మార్పణతోనే మొదలైంది. రాష్ట్రాన్ని ఇవ్వాలనే నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఇప్పుడు శ్రీలంకలోనూ అదే జరిగింది. ఒక చిన్న సంఘటన దేశాన్ని కదిలిస్తోంది. పాలకులు వారి స్వంతాన్ని, స్వార్థాన్ని కాకుండా ప్రజలను మెప్పించే తీరులో పాలన అందించడమే సర్వదా శ్రేయస్కరం.

పాలకులు మేలుకుంటారా?

భారత్‌లోనూ నిత్యావర వస్తువులు, పెట్రోలు-డీజిల్-వంటగ్యాస్ ధరలు ఆందోళకరంగా మారుతున్నాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరుగుతున్నది. ప్రజల మధ్య కుల, మత, వర్గ విభజన రేఖ ఏర్పడింది. ధనిక-పేద అంతరం పెరుగుతున్నది. సమాజంలో అశాంతి నెలకొన్నది. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ప్రజా ప్రతినిధులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఐటీ, ఈడీ సోదాలలో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు బైట పడుతున్నాయి. ఒకవైపు పేదలు గూడు కోసం తపిస్తున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు వందలాది ఎకరాలను పోగేసుకుంటున్నారు. ఈ అసంతృప్తి ఆగ్రహంగా మారకముందే మేలుకోవడం పాలకులకు అవసరం. శ్రీలంకలోని ప్రజాగ్రహం కనువిప్పు కావాలి.

ఎన్. విశ్వనాథ్

99714 82403


Next Story

Most Viewed