తరగని స్వరం... రేడియో!

by Ravi |   (  Updated:2026-02-13 00:30:27  IST  )

‘కిర్రు.. కిర్రు.. మంటూ శబ్దం.. చిన్నగా ట్యూనింగ్ నాబ్ తిప్పితే సన్నని కూత.. ఆ తర్వాత గంభీరమైన గొంతులో ‘ఇది ఆకాశవాణి.. వార్తలు చదువుతోంది..' అనే పిలుపు. ‘ఈ వాక్యం చదువుతుంటేనే మనలో చాలామందికి బాల్యం గుర్తుకు వస్తుంది.

తరగని స్వరం... రేడియో!
X

‘కిర్రు.. కిర్రు.. మంటూ శబ్దం.. చిన్నగా ట్యూనింగ్ నాబ్ తిప్పితే సన్నని కూత.. ఆ తర్వాత గంభీరమైన గొంతులో ‘ఇది ఆకాశవాణి.. వార్తలు చదువుతోంది..' అనే పిలుపు. ‘ఈ వాక్యం చదువుతుంటేనే మనలో చాలామందికి బాల్యం గుర్తుకు వస్తుంది. ఒకప్పుడు సమస్త ప్రపంచానికి కిటికీ ఆ చిన్న పెట్టెనే. ఉదయం నిద్రలేవగానే భక్తి గీతాలతో మొదలై, రాత్రి ‘వార్తలు-విశేషాలు’తో ముగిసే దినచర్య మనది.

పరికరం కాదు, ఎమోషన్..

రేడియో కేవలం ఒక పరికరం కాదు, అది ఒక ఎమోషన్. మానవ చరిత్రలో అత్యంత శక్తివంతమైన మాధ్యమంగా రేడియో తనదైన ముద్ర వేసింది. 1946 ఫిబ్రవరి 13న ఐక్యరాజ్యసమితి రేడియో ప్రారంభమైంది. యునెస్కో ఈ రోజును ప్రపంచ రేడియో దినో త్సవంగా ప్రకటించింది. యుద్ధాలు జరిగినప్పుడు సమాచారాన్ని చేరవేయడంలోనూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు హెచ్చ రికలు జారీ చేయడంలోనూ, అక్షరాస్యత లేని మారుమూల గ్రామాల్లో విజ్ఞానాన్ని పంచడంలోనూ రేడియో పోషించిన పాత్ర అద్వితీయం. ప్రపంచంలో విద్యుత్ వెలుగులు చూడని గ్రామాలు ఉండొచ్చేమో గానీ, రేడియో తరంగాలు తాకని ప్రదేశం ఉండద నడంలో అతిశయోక్తి లేదు.

తెలుగు వారి రేడియో బంధం..

తెలుగు వారికైతే రేడియోతో ఉన్న బంధం విడదీయరానిది. ఘంటసాల గొంతులో భక్తి పాటలు, ‘కార్మికుల కార్యక్రమం’, ‘రైతుల కోసం’, ‘వనితా వాణి’, సాయంత్రం వేళ ‘వివిధ భారతి’లో వచ్చే సినిమా పాటలు.. ఇవన్నీ ఒక తరం తెలుగు వారి జీవితంలో భాగమయ్యాయి.. ముఖ్యంగా తుఫానులు వచ్చినప్పుడు కోస్తా తీర ప్రాంత ప్రజలకు రేడియోనే దైవం. కరెంట్ లేకపోయినా, బ్యాటరీలతో పనిచేసే రేడియోలు ఎంతోమంది ప్రాణాలను కాపాడాయి. సమాచారాన్ని ఇంత వేగంగా, ఇంత తక్కువ ఖర్చుతో సామాన్యుడికి చేరవేసే సాధనం మరొకటి లేదు.. అందుకే మహాత్మా గాంధీ రేడియోను ‘అద్భుతమైన శక్తి’గా అభివర్ణించారు..

ఎఫ్ . ఎం యాప్స్ వరకు అదే..

అయితే, సాంకేతిక విప్లవం రేడియోను చంపేస్తుందన్న వాదనను రేడియో ఎప్పటికప్పుడు పటాపంచలు చేస్తూనే ఉంది. దీనికి ప్రధాన కారణం రేడియోకున్న ‘అడాప్టబిలిటీ’. వాల్వ్ సెట్ల నుండి ట్రాన్సిస్టర్లకు, అక్కడి నుండి ఎఫ్.ఎం రేడియోలకు, ఇప్పుడు ఇంటర్నెట్ రేడియోలు, పాడ్‌కాస్ట్‌ల వరకు రేడియో తన రూపాన్ని మార్చు కుంటూనే ఉంది. ఒకప్పుడు ఇంట్లో హాల్లో పదిమంది కూర్చుని వినే రేడియో.. ఇప్పుడు కారులో ప్రయాణిస్తున్నప్పుడు తోడుగా వచ్చే ఎఫ్.ఎం‌గా మారింది. ట్రాఫిక్ కష్టాలను మరిపించే ఔషధంగా మారింది. మొబైల్ ఫోన్లలో యాప్స్ రూపంలోకి వచ్చేసింది. రూపం మారింది కానీ, దాని ఆత్మ మాత్రం అలాగే ఉంది.

రేడియో ఎప్పటికీ చనిపోదు..

భవిష్యత్తు రేడియోది ఎలా ఉండబోతోంది? రేడియో చనిపోదు, అది ‘ఆడియో కంటెంట్’గా రూపాంతరం చెందుతుంది. పాడ్‌కాస్ట్‌ల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఆడియో విప్లవం నడుస్తోంది. నేటి యువత పుస్తకాలు చదవడానికి బదులు ‘ఆడియో బుక్స్’ వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రయాణంలో, జిమ్‌లో, వంట గదిలో.. ఇలా ఏ పని చేసుకుంటూనైనా వినే వెసులుబాటు ఒక్క ఆడియో మాధ్యమానికే ఉంది. వీడియో చూడాలంటే పని ఆపేయాలి, కానీ రేడియో వినాలంటే పని ఆపాల్సిన పనిలేదు.. ఇదే రేడియోకున్న అతిపెద్ద బలం.

నిన్నటి జ్ఞాపకం.. రేపటి అవసరం

చివరగా, ‘బహుజన హితాయ.. బహుజన సుఖాయ..’ అన్నది ఆకాశవాణి నినాదం. లాభాపేక్ష లేకుండా, కేవలం సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచడమే లక్ష్యంగా సాగిన రేడియో ప్రస్థానం ఒక అద్భుతం. ఫేక్ న్యూస్ రాజ్యమేలుతున్న సోషల్ మీడియా కాలంలో, రేడియో ఇప్పటికీ విశ్వసనీయతకు మారు పేరుగా నిలుస్తోంది. టెక్నాలజీ ఎంత మారినా, మనిషి గొంతులోని ఆ ఆర్ద్రతను, ఆ భావోద్వేగాన్ని ఏ యంత్రం భర్తీ చేయలేదు.. అందుకే, రేడియో నిన్నటి జ్ఞాపకం మాత్రమే కాదు, రేపటి అవసరం కూడా.. ఈ ప్రపంచ రేడియో దినోత్సవం నాడు, ఆ అదృశ్య నేస్తానికి సెల్యూట్ చేద్దాం.

(నేడు ప్రపంచ రేడియో దినోత్సవం)

- నరేన్

88973 88393

Next Story