నిరుద్యోగి గొంతుకపై ఫీజు కత్తి..

by Ravi |   (  Updated:2026-04-22 00:30:46  IST  )

టీజీపీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లలో ఫీజుల భారీ పెంపు, వయో పరిమితి తగ్గింపుతో తెలంగాణ నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ విధానాలపై పెరుగుతున్న విమర్శలపై విశ్లేషణాత్మక కథనం.

నిరుద్యోగి గొంతుకపై ఫీజు కత్తి..
X

తెలంగాణలో కొలువుల కొట్లాట కొత్త మలుపు తిరుగుతోంది. ఎన్నికల వేళ నిరుద్యోగుల ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పుడు గాలికి ఎగిరిపో తున్నాయి. ఎన్నికలకు ముందు ‘మేము అధికారంలోకి వస్తే ఉద్యోగ దరఖాస్తులకు పైసా వసూలు చేయం.. ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తాం’ అని నమ్మబలికిన నేతలు, గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగుల నడ్డి విరుస్తున్నారు.. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో గరిష్ట వయస్సు కుదించడం దరఖాస్తు ఫీజు 400% పెంచడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగ భృతి ఇస్తామని గత ప్రభుత్వం మోసం చేస్తే, ఉచిత దర ఖాస్తుల పేరుతో గద్దెనెక్కి నిన్న మొన్నటి వరకు నామమాత్రంగా ఉన్న ఫీజులను ఏకంగా 400 శాతం పెంచడం వెనుక ఆంతర్యమేమిటి? ప్రభుత్వం నిరుద్యో గులను ఆదుకోవాల్సింది పోయి, వారి ఆర్థిక ఇబ్బందులనే ఆదాయ వనరుగా మార్చుకోవడం దారుణమని మేధావులు విమర్శిస్తున్నారు.. కేవలం ఫీజుల భారం మాత్రమే కాదు, వయోపరిమితి విషయంలోనూ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. గతంలో ఉన్న 42 ఏళ్ల గరిష్ట వయోపరిమితిని ఇప్పుడు 34 ఏళ్లకే పరిమితం చేయడం అభ్యర్థుల పాలిట శాపంగా మారింది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన యువతలో అత్యధికులు ఇప్పుడు 35-40 ఏళ్ల మధ్యలో ఉన్నారు. నోటిఫికేషన్ల కోసం పదేళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వీరిని, వయస్సు సాకుతో పోటీ నుంచి తప్పించడం ఎంతవరకు సమంజసం? వేలాది మంది సీనియర్ అభ్యర్థులు ఒక్క కలం పోటుతో అనర్హులుగా మారిపోతున్నారు. ఓట్ల కోసం ఉచితాల హామీలు గుప్పించి, అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల గొంతు కోయడం తెలంగాణ ఆత్మగౌరవానికే భంగ కరమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి‌కైనా ప్రభుత్వం స్పందించి పెంచిన ఫీజులను తక్షణమే రద్దు చేయాలని, వయోపరిమితిని తిరిగి 42 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర యువత డిమాండ్ చేస్తోంది. లేనిపక్షంలో ప్రభుత్వం మరో ఉద్యమాన్ని ఎదుర్కోక తప్పదు.

- ఎ. ఆనంద్ సాగర్

89196 59715

Next Story