కోచింగ్ భ్రమలో నిరుద్యోగ యువత.. వారి భవిష్యత్తును మింగేస్తున్న కోచింగ్ సంస్కృతి!

by Ravi |   (  Updated:2026-01-30 01:01:03  IST  )

ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక వ్యక్తికి మాత్రమే కాదు.. ఒక కుటుంబానికి భరోసా, ఒక తరం భవిష్యత్తుకు ఆశ. ఆ ఒక్క నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే నిరుద్యోగ యువత మన సమాజంలో కోట్లల్లో ఉన్నారు. కానీ వారిలో ఆ ఆశతో పాటు నేడు మరో భయమూ వెంటాడుతోంది.. అది ‘కోచింగ్ లేకపోతే ఉద్యోగం రాదు’ అన్న భ్రమ. ఈ భ్రమే ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. ఈ దందా ప్రభావం ఒక్కో అభ్యర్థి జీవితానికే పరిమితం కాదు.. రేపటి పాలన, పరిపాలన, విధానాల దిశపైనా దీని నీడ పడుతోంది..

కోచింగ్ భ్రమలో నిరుద్యోగ యువత.. వారి భవిష్యత్తును మింగేస్తున్న కోచింగ్ సంస్కృతి!
X

ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక వ్యక్తికి మాత్రమే కాదు.. ఒక కుటుంబానికి భరోసా, ఒక తరం భవిష్యత్తుకు ఆశ. ఆ ఒక్క నోటిఫికేషన్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే నిరుద్యోగ యువత మన సమాజంలో కోట్లల్లో ఉన్నారు. కానీ వారిలో ఆ ఆశతో పాటు నేడు మరో భయమూ వెంటాడుతోంది.. అది ‘కోచింగ్ లేకపోతే ఉద్యోగం రాదు’ అన్న భ్రమ. ఈ భ్రమే ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. ఈ దందా ప్రభావం ఒక్కో అభ్యర్థి జీవితానికే పరిమితం కాదు.. రేపటి పాలన, పరిపాలన, విధానాల దిశపైనా దీని నీడ పడుతోంది..

యువత అసురక్షిత భావాలను పెట్టుబడిగా, తల్లిదండ్రుల కన్నీళ్లను లాభంగా మార్చుకుంటూ ‘కోచింగ్ వ్యాపారం’ నిశ్శబ్దంగా విస్తరిస్తోంది. ఇది విద్యా విస్తరణ కాదు.. ఇది నిరుద్యో‌గంపై నిర్మితమైన ఒక వ్యవస్థీకృత దందా. ప్రభుత్వాలు కోచింగ్ రంగాన్ని ‘మార్కెట్ సమస్య’గా కాకుండా విద్యా విధాన సమస్యగా చూడాలి.. ఉద్యోగ ఆశలో పుట్టే కలలు కన్నీళ్లుగా మారకుండా ఉండాలంటే నిరుద్యోగులు, తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వం అందరూ బాధ్యతగా ఆలోచించాల్సిన క్షణం ఇదే..

ఉద్యోగ ఆశలో కలలు, కన్నీళ్లు..

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వార్త వినగానే నిరుద్యోగుల్లో ఆశ చిగురిస్తుంది. కానీ ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న అవకాశం దొరుకుతుందన్న భావన, జీవితానికి దిశ లభిస్తుందన్న ఆశ వారి కళ్లలో మెరుస్తుంది. కానీ ఆ ఆశ త్వరలోనే భయంగా మారుతోంది. స్వయంగా చదివితే విజయం సాధించలేమన్న భావన పెరిగి, తమ ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను మరిచి‌పోయేలా చేస్తోంది. చివరికి కోచింగ్‌పైనే ఆధారపడాల్సిందేనన్న భ్రమ నెలకొంటోంది. ఈ బలహీనతను అవకాశంగా చేసుకుని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు విస్తరిస్తూ, ‘మా దగ్గర చదివితేనే ఉద్యోగం’ అన్న నమ్మకాన్ని యువతలో నాటుతున్నాయి. దీని‌వల్ల అత్యంత నష్టపోతున్నవారు నిరుపేద అభ్యర్థులు, వారి కుటుంబాలే.. వారే అప్పులు చేసి పట్టణాలకు వెళ్లి ఖరీదైన కోచింగ్ ఫీజులు, జీవన ఖర్చులు భరిస్తూ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

మోసం మొదలవుతోందిక్కడే..

ప్రభుత్వ ఉద్యోగాల సాధన కోచింగ్ సెంటర్ల చేతుల్లో ఉండేది కాదు, అది అభ్యర్థి ఆలోచనా శక్తి, క్రమశిక్షణ, నిరంతర సాధనంపై ఆధారపడుతుంది. ఉద్యోగ నోటిఫికే షన్లకు ముందే మొదలయ్యే కోచింగ్ హడావుడి, అవి వెలువడగానే మరింత విస్తరిస్తోంది. ఇది విద్యా విస్తరణ కాదు.. నిరుద్యోగుల అమాయకత్వాన్ని సొమ్ముగా మలిచే వ్యవస్థీకృత వ్యాపారం.. కోట్ల టర్నోవర్‌తో నిర్వాహకులు ఆకర్షణీయమైన ప్రకటనలతో వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు. ఇంకొందరేమో పాత, పనికిరాని మెటీరియల్‌ను కొత్త పేర్లతో ‘ఇంపార్టంట్ మెటీరీయల్’గా విక్రయిస్తున్నారు. దీంతో ఏది నాణ్యమైనదో తెలియని అభ్యర్థులు గుడ్డిగా నమ్ముతున్నారు. కొద్దిమంది ప్రతిభతో సాధించిన విజయాలను తమ కోచింగ్ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో లాభపడేది కోచింగ్ సెంటర్లే.. అభ్యర్థులకు, ముఖ్యంగా నిరుపేద యువతకు దక్కేది శూన్యమే.

నిపుణుల వేషంలో ‘అనర్హుల’ రాజ్యం..!

అయితే, బోధకుల పాత్రను పూర్తిగా తిరస్కరించాల్సిన అవసరం లేదు.. కానీ దానికి స్పష్టమైన పరిమితులు, బాధ్యతలు ఉండాలి. మంచి బోధకుడు భయాన్ని పెంచడు, ఆ దిశను చూపుతాడు.. నోట్స్‌పై ఆధారపడేలా కాకుండా విద్యార్థిని స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తిగా తీర్చిదిద్దుతాడు. కానీ నేడు అనేక కోచింగ్ సెంటర్లలో బోధకులుగా ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగ ఎంపికల అనుభవం, విషయంపై లోతైన అవగాహన లేకపోయినా ‘ఏళ్ల అనుభవజ్ఞులు’, ‘నిష్ణాతులు’ అంటూ మోసపూరిత ప్రచారంతో నమ్మకం కల్పిస్తున్నారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ వంటి విస్తారమైన అవగాహన రంగాలను నోట్స్‌గా కుదించి, ‘ఇవే వస్తాయి’ అనే భ్రమను నాటడం వల్ల అభ్యర్థి ఆలోచనశక్తి క్షీణిస్తోంది. వాస్తవానికి వీటికి హద్దులుండవు, పూర్తిగా కవర్ చేయడం అసాధ్యం.

ప్రభుత్వ చర్యలు అత్యవసరం..

ఇక ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ సైతం వివిధ కారణాలతో పదే‌ పదే వాయిదా పడుతున్నాయి. ఈ జాప్యంలో అభ్యర్థుల నష్టం అపారం. కొందరి వయోపరిమితి దాటిపోతుండగా, మరికొందరు నిరాశలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఈ ఆలస్యంతో లాభపడుతున్న కోచింగ్ సెంటర్ల మోసాల వ్యాపారంపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలి. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లపై బోధకుల అర్హతలు, ఫీజుల పరిమితులు, మోసపూరిత ప్రచారాల నిషేధంతో స్పష్టమైన విధానాలు రూపొందించి కఠినంగా అమలు చేయాలి.. ఇందుకోసం ‘రాష్ట్రస్థాయి కోచింగ్ నియంత్రణ అథారిటీ’ని ఏర్పాటు చేయాలి. అదే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్లను సమయానికి విడుదల చేయడం, పారదర్శక నియామక ప్రక్రియను అమలు చేయడం అనివార్యం. లేకపోతే కోచింగ్ దందా యువత ఆశలపై మరింత బల పడుతూ, వ్యక్తిగత నష్టమే కాక తెలంగాణ సమాజ భవి ష్యత్తుకే గాయంగా మారుతుంది.

-నంగె శ్రీనివాస్,

ఎడ్యుకేషన్ ఎనలిస్ట్ & ప్రిన్సిపాల్,

94419 09191

Next Story