క్లెయిమ్ చేయని డబ్బు.. ఇంతనా?

by Ravi |   (  Updated:2025-02-28 00:45:17  IST  )

దేశంలో వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రావిడెంట్ ఫండ్ (PF), పోస్ట్ ఆఫీసులు, ఇతర ఆర్థిక సంస్థల

క్లెయిమ్ చేయని డబ్బు.. ఇంతనా?
X

దేశంలో వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రావిడెంట్ ఫండ్ (PF), పోస్ట్ ఆఫీసులు, ఇతర ఆర్థిక సంస్థల వద్ద కలిపి దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అన్‌క్లెయిమ్డ్ నిధులుగా పేరుకుపోయాయి. ఈ మొత్తం వినియోగదారులు పొందాల్సింది కానీ వివిధ కారణాల వల్ల క్లెయిమ్ చేయని డబ్బు.

ఖాతాదారులు మరణించడం, వారసులకు ఆ వివరాలు తెలియకపోవడం, చిరు నామా లేదా మొబైల్ నంబర్లు మార్చడం, మారిన ఉద్యోగాల వల్ల పాత ఖాతాలను మర్చిపోవడం వంటి పరిస్థితుల వల్ల ఈ నిధులు అక్కడే మిగిలిపోతున్నాయి.

మురిగిపోయిన డబ్బు

ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం, బ్యాంకుల్లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల మొత్తం రూ. 50,000 కోట్లకు పైగా ఉంది. ఇది ప్రధానంగా సేవింగ్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కరెంట్ అకౌంట్లలో ఉండే డబ్బు. పదహారేళ్లకు పైగా లావాదేవీలు జరగని ఖాతాలను ఆర్‌బీఐ ప్రత్యేకంగా గుర్తించి, ఆ డబ్బును డిపాజిట్స్ అవేర్‌నెస్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్ (DEAF) లో జమ చేయిస్తుంది. ఖాతాదారులు మరణించడంతో పాటు వారసులు క్లెయిమ్ చేయకపోవడం, సమాచార లోపం దీనికి ప్రధాన కారణాలు.. ఇక అలాగే ఇన్సూరెన్స్ కంపెనీల్లో కూడా భారీగా అన్‌క్లెయిమ్డ్ డబ్బు పేరుకుపోయిం ది. పాలసీదారులు మరణించిన తర్వాత వారి కు టుంబ సభ్యులకు పాలసీ వివరాలు తెలియకపోవడం, కొన్ని పాలసీలు మధ్యలోనే లాప్స్ అవడం, వారసులు క్లెయిమ్ చేసేందుకు అవగాహన లేకపోవడం వల్ల రూ. 25,000 కోట్లకు పైగా అన్‌ క్లెయిమ్డ్ నిధులు ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద ఉన్నాయి. ఈ మొత్తంలో అత్యధిక శాతం ఎల్‌ఐసి దగ్గరే ఉందని సమాచారం.

పీఎఫ్ ఖాతాల్లోనే 50 వేల కోట్లు..

ప్రావిడెంట్ ఫండ్ కూడా పెద్ద మొత్తంలో అన్‌క్లెయిమ్డ్ నిధులున్న విభాగాల్లో ఒకటి. ఉద్యోగులు ఉద్యోగాలు మారినప్పుడు పాత పీఎఫ్ ఖాతాలను అనుసంధానం చేసుకోకపోవడం వల్ల రూ. 50,000 కోట్లకు పైగా ఫండ్‌లు క్లెయిమ్ కాకుండా ఈపీఎఫ్‌ఓ వద్ద నిలిచిపోయాయి. ఉద్యోగులు తమ పాత పీఎఫ్ ఖాతాలను ట్రాన్స్‌ఫర్ చేసుకోకపోవడం, ఉద్యోగ విరమణ తర్వాత క్లెయిమ్ చేసేందుకు ఆలస్యం చేయడం దీనికి ప్రధాన కారణాలు.. షేర్ల అకౌంట్లు, మ్యూచువల్ ఫండ్‌లు, డీమాట్ ఖాతాల్లో కూడా వేల కోట్ల రూపాయల అన్‌క్లెయిమ్డ్ డబ్బు ఉంది. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం, దాదాపు రూ. 30,000 కోట్లకు పైగా అన్‌క్లెయిమ్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు వివిధ ఫండ్స్, షేర్ల రూపంలో ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు, కిసాన్ వికాస్ పత్ర (KVP), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) లాంటి చిన్న సేవింగ్ స్కీమ్‌ల్లో కూడా పెద్ద మొత్తంలో అన్‌క్లెయిమ్డ్ డబ్బు ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజ లు ఈ సేవింగ్ స్కీమ్‌ల్లో డిపా జిట్ పెట్టి, మరిచిపోవడంతో కోట్ల రూపాయలు పోస్ట్ ఆఫీసుల్లో మిగిలిపోయాయి.

డబ్బును క్లెయిమ్ చేసుకోవాలంటే..

అయితే, ఈ అన్‌క్లెయిమ్డ్ డబ్బు సమస్యకు పరి ష్కారం కోసం ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కొన్ని చర్యలు తీసుకుంటున్నా, అవి తగిన స్థాయిలో ప్రజలకు తెలియడం లేదు. ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ, ఈపీఎఫ్‌ఓ వంటి సంస్థలు ప్రజలకు ఈ డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి అనేక మార్గా లను సూచించినప్పటికీ చాలా మంది తమకు ఆ డబ్బు పొందడానికి ఉన్న అర్హత గురించి పూర్తిగా తెలియకుండా పోతున్నారు. వారసులు లేదా హక్కుదారులు ఈ డబ్బును క్లెయిమ్ చేసుకోవడానికి సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించి, ఆధారాలు సమర్పించాలి. దీని కోసం ఆ సంస్థలు తమ అధికారిక వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ పోర్టల్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. అయితే ఇందు లో కూడా అవగాహన కొరత, క్లెయిమ్ ప్రక్రియలో సమస్యలు, సమాచార లోపం వల్ల ఈ డబ్బు వారి అసలైన వారసులకు చేరకుండా సంస్థల వద్ద పేరుకుపోతుంది. ప్రభుత్వాలు, ఆర్థిక సంస్థలు మరింత అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ప్రజలు తమ నిధులను తిరిగి పొందే విధంగా చర్యలు తీసుకోవాలి.

- శ్రీనివాస్ గౌడ్ ముద్దం

80088 88834

Next Story