యూజీసీ కొత్త నిబంధనలు.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనా?

by Ravi |   (  Updated:2026-02-06 01:16:01  IST  )

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త 'వివక్ష వ్యతిరేక' (యాంటీ డిస్క్రిమినేషన్) నిబంధనల చుట్టూ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చర్చ ఒక చట్టం మంచిదా చెడ్డదా? అనే పరిమితిలో లేదు.. ఇది సామాజిక న్యాయం, సమానత్వం, రాజకీయ ఉద్దేశాలు, భయాలు, అనుమానాలు అన్నీ కలగలిసిన ఒక పెద్ద వాదనగా మారింది.

యూజీసీ కొత్త నిబంధనలు.. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనా?
X

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త 'వివక్ష వ్యతిరేక' (యాంటీ డిస్క్రిమినేషన్) నిబంధనల చుట్టూ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ చర్చ ఒక చట్టం మంచిదా చెడ్డదా? అనే పరిమితిలో లేదు.. ఇది సామాజిక న్యాయం, సమానత్వం, రాజకీయ ఉద్దేశాలు, భయాలు, అనుమానాలు అన్నీ కలగలిసిన ఒక పెద్ద వాదనగా మారింది. ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్లు, 24 గంటల్లో విచారణ వంటి నిబంధనలు ఇందులో ఉన్నాయి..

ఈక్వల్ ఆపర్చునిటీ కమిటీల ఏర్పాటు ద్వారా జనరల్ కేటగిరీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, ఇది 'యాంటీ-మెరిట్' చట్టమని వాదనలు ఉన్నాయి. ఒకవైపు, అణగారిన వర్గాల విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో ఎదుర్కొంటున్న కుల వివక్షను ఎవరూ ఖండించలేరు.. దళిత, ఆదివాసీ, ఓబీసీ విద్యార్థులు ప్రవేశాల నుంచి పరీక్షల జరిగి మూల్యాంకనం వరకు, హాస్టల్ జీవితం నుంచి పరిశోధన మార్గదర్శకత్వం వరకు వివక్షను ఎదుర్కొంటున్నారనే ఆరోప‌ణలు ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్నాయి. 'రోహిత్ వేముల, పాయల్ తాడ్వీ' వంటి విషాద ఘటనలు ఈ సమస్యను దేశం ముందు ఉంచాయి.

వివక్షపై పోరులో ఇంత నిబద్ధతా?

ఈ నేపథ్యంలోనే యూజీసీ యాంటీ డిస్క్రిమినేషన్ వ్యవస్థను బలపరచాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనలు తీసుకు‌వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కులను అమలు చేయడానికే ఇవి అవసరమని మద్దతుదారుల వాదన.. రాజకీయ కోణం కూడా ఈ వివాదంలో కీలకం అయింది. రోహిత్ వేముల చట్టం గురించి రాహుల్ గాంధీ మాట్లాడిన వెంటనే, దానికి కౌంటర్‌గా ఈ నిబంధనలు వచ్చాయా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇది నిజంగా అణగారిన వర్గాల రక్షణ కోసమా, లేక రాజకీయ 'డైవర్షన్‌' లో భాగమా ! అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. అయితే, రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కులను వాస్తవంగా అమలు చేయడానికే ఇవి అవసరమని మద్దతుదారులు వాదిస్తున్నారు.

జనరల్ కేటగిరీ వర్గాల భీతి..

మరోవైపు, ఈ నిబంధనలపై కొంతమంది విద్యార్థులు, అధ్యాపకులు, ముఖ్యంగా జనరల్ కేటగిరీకి చెందిన వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. “వివక్ష” అనే నిర్వచనం చాలా విస్తృతంగా ఉంటే, చిన్న విషయాలకే కేసులు పెట్టే పరిస్థితి వస్తుందా! అనే భయం వారిలో ఉంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం విషయంలో తప్పుడు కేసుల దుర్వినియోగంపై చర్చ జరిగిన నేపథ్యం గుర్తుకు తెస్తున్నారు. అదే విధంగా యూజీసీ నిబంధనలు కూడా అమల్లోకి వస్తే, నిరూపణ లేకుండానే చర్యలు, అరెస్టులు జరిగితే విద్యార్థుల భవిష్యత్ ఏమవుతుందనే ప్రశ్నలు వేస్తున్నారు.. ఇది విద్యా వాతావరణాన్ని భయభ్రాంతులకు గురిచేస్తుందా? అనే అనుమానం కూడా ఉంది.

నిరసన హక్కుపై రివర్స్ గళం..

ఇక్కడ ఇంకొక విరుద్ధత స్పష్టంగా కనిపిస్తుంది. యూజీసీ బిల్లు తీసుకొచ్చినప్పుడు నిరసన తెలిపిన వారిని దేశద్రోహులుగా విమర్శించిన రాజకీయ శక్తులే, ఇప్పుడు ఈ నిబంధనల విషయంలో తమకు నిరసన హక్కు లేదా? అని ప్రశ్నించడంపై విమర్శలు వస్తున్నాయి.. అదే సమయంలో, ప్రభుత్వం స్వయంగా నిబంధనలు రూపొందించి, వాటిపైనే తన మద్దతుదారుల నుంచి నిర సనలు రావడం కూడా గందరగోళాన్ని పెంచుతోంది. ‘వాళ్లే చట్టం పెట్టి, వాళ్లే వ్యతిరేకిస్తున్నారా?’ అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతోంది.

కాగితాలకే నిబంధనలు పరిమితమైతే...!

రాజకీయ కోణం కూడా ఈ వివాదంలో కీలకం అయింది. రాహుల్ గాంధీ రోహిత్ వేముల చట్టం గురించి మాట్లాడిన వెంటనే, దానికి కౌంటర్‌గా ఈ నిబంధనలు వచ్చాయా? అనే అనుమానాలు ఉన్నాయి. ఇది నిజంగా అణగారిన వర్గాల రక్షణ కోసమా, లేక రాజకీయ 'డైవర్షన్‌' లో భాగమా! అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది. ఎన్నికల కాలంలో ఇలాంటి అంశాలు తరచూ భావజాల పోరాటాలకు వేదిక అవుతాయన్నది కొత్త విషయం కాదు.. నిజానికి, ఈ సమస్యకు చట్టం ఉందా? లేదా అన్నదానికంటే, అది ఎలా అమలవుతుంది? అన్నదే పెద్ద ప్రశ్న. పాత యూజీసీ నిబంధనలు కూడా కాగితాలకే పరిమితమయ్యాయన్న విమర్శ కూడా ఉంది. ఈ కొత్త నిబంధనలకు కూడా అదే గతి పడితే, వివాదం వృథానే. అదే సమ యంలో, అమలులో అతిగా కఠినత్వం చూపితే, అది మరో రకమైన అన్యాయానికి దారి తీసే ప్రమాదం కూడా ఉంది.

విద్యావ్యవస్థపై నమ్మకం ప్రధానం..

ఈ నిబంధనలు సమాజాన్ని చీల్చేలా ఉన్నాయని, ర్యాగింగ్ వంటి కీలక అంశాలను చేర్చలేదని, స్పష్టత కొరవడిందని సుప్రీంకోర్టు స్టే విధించింది. 'వివక్ష'కు సంబంధించి నిబంధనలలోని స్పష్టత, కుల ఆధారిత వివక్షను విడిగా నిర్వచించడంపై కోర్టు ప్రశ్నలు లేవనె త్తింది. దీంతో వివాదాస్పద నిబంధనలను సమీక్షించడానికి మోడీ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రగడకు పరిష్కారం చట్టాన్ని పూర్తిగా తిరస్కరించడంలోనో, సమర్థించడంలోనో లేదు. అణగారిన వర్గాలకు నిజమైన రక్షణ కల్పిస్తూ, నిర్దోషులపై అన్యాయం జరగకుండా సమతుల్యమైన అమలు విధానం అవసరం. స్పష్టమైన నిర్వచనాలు, స్వతంత్ర విచారణ కమిటీలు, అప్పీల్‌కు అవకాశం ఉంటేనే న్యాయం సాధ్యమ వుతుంది. భావోద్వేగాలు, రాజకీయ లాభనష్టాల కన్నా విద్యా వ్యవస్థలో న్యాయం, విశ్వాసం నిలబెట్టడమే అసలైన లక్ష్యం కావాలి. అప్పుడే ఈ నిబంధనలు వివాదానికి కాదు, పరిష్కారానికి దారి తీస్తాయి..

- డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,

98493 28496

Next Story