- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్‌కోలో 'మిగులు' లాభం.. మానవ వనరుల 'లోటు'పై విశ్లేషణ
తెలంగాణ ట్రాన్స్‌కోలో రూ. 1,390 కోట్ల అదనపు నిల్వలు నమోదైనప్పటికీ, అవి నియామకాలు, నిర్వహణ ఖర్చుల తగ్గింపు వల్లే వచ్చాయా? భారీ విస్తరణ జరుగుతున్న వేళ సిబ్బంది కొరత విద్యుత్ వ్యవస్థ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందా? టీఎస్ ట్రాన్స్‌కో ఆర్థిక, మానవ వనరుల స్థితిగతులపై సమగ్ర కథనం.

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ప్రసరణ వ్యవ స్థను నిర్వహిస్తున్న ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ సంస్థ రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన ఆధారంగా నిలుస్తోంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఈ సంస్థ రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుండి పంపిణీ సంస్థలకు విద్యుత్తును సురక్షితంగా, నిరంతరంగా సరఫరా చేస్తూ కీలక బాధ్యతను నిర్వహిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, సాగునీటి పథకాలు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి కార్యక్రమాలన్నీ ఈ సంస్థ పనితీరుపైనే ఆధారపడి ఉన్నాయి...
ఖర్చు నిల్, నిల్వ ఫుల్..
తాజా వార్షిక టారిఫ్ వినతి పత్రంలో వెల్లడైన గణాంకాల ప్రకారం, 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంస్థకు 3,138.99 కోట్లుగా అంచనా వేసిన మొత్తం వ్యయ అవసరం ఉండగా, వాస్తవ వ్యయం 2,603.65 కోట్లకే పరిమితమైంది. అదే సమయంలో సంస్థకు వచ్చిన ఆదాయం 3,994.41 కోట్లకు చేరడంతో, మొత్తం 1,390.76 కోట్ల అధిక నిల్వ నమోదైంది. మొదట ఈ గణాంకాలు సంస్థ ఆర్థికంగా బలంగా ఉన్నదనే భావన కలిగించినా, లోతుగా పరిశీలిస్తే ఈ అధిక నిల్వ ప్రధానంగా ఖర్చుల తగ్గింపుల వల్ల వచ్చినదని స్పష్టమవుతుంది.
నియామకాలకు పుల్ స్టాఫ్
ప్రత్యేకంగా నిర్వహణ, సంరక్షణ వ్యయాలు గణనీయంగా తగ్గాయి.. ఇవి 1,299.52 కోట్ల నుంచి 1,135.01 కోట్లకు పడిపోవడంతో 164.50 కోట్ల తగ్గుదల నమోదైంది. ఇందులో ఉద్యోగు లపై ఖర్చు 1123.60 కోట్ల నుంచి 1005.50 కోట్లకు తగ్గడం, అలాగే మరమ్మత్తులు, సంరక్షణ ఖర్చులు 111.14 కోట్ల నుంచి 55.01 కోట్లకు పడిపోవడం గమనార్హం. ఈ గణాంకాలు సంస్థలో ఖాళీలు భర్తీ కాకపోవడం, కొత్త నియామకాలు జరగకపోవడం, నిర్వహణ పనులు తగ్గించబడడం వంటి అంశాలను స్పష్టంగా సూచిస్తున్నాయి.
విస్తరణ సరే.. వనరులు ఏవీ?
ఇక మరోవైపు, సంస్థ భారీ స్థాయిలో విస్తరణ కార్యక్రమాలను కొనసాగిస్తోంది. 2026–27 సంవత్సరానికి 4,432.61 కోట్ల పెట్టుబడులు ప్రతిపాదించబడినాయి. అధిక వోల్టేజ్ లైన్లు, ఉపకేంద్రాలు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన విద్యుత్ వ్యవస్థలు వంటి అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే ఈ విస్తరణకు సరిపడా మానవ వనరులు లేకపోతే, వ్యవస్థ నిర్వహణ, భద్రత, పనితీరు వంటి అంశాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
వనరుల పెంపును విస్మరిస్తే..
ఈ పరిస్థితుల్లో మానవ వనరుల ప్రాముఖ్యతను విస్మరించడం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఉన్న సిబ్బందితోనే ఎక్కువ పనులు చేయించడం లేదా సిబ్బంది సంఖ్యను తగ్గించడం వల్ల ఉద్యోగులపై పని భారం పెరగడం, ప్రమాదాల అవకాశాలు అధికమవడం, భవిష్యత్తులో నైపుణ్య లోటు ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు.. ముఖ్యంగా సహాయక ఇంజనీర్ స్థాయి ఉద్యోగులు సంస్థకు ప్రధాన స్తంభాలుగా ఉంటారు. ఫీల్డ్ స్థాయిలో నిర్వహణ, లోపాల నివారణ, వ్యవస్థ స్థిరత్వం వంటి కీలక పనులన్నీ వీరిపైనే ఆధారపడి ఉంటాయి. వీరి లోటు ఏర్పడితే వ్యవస్థ పనితీరు క్రమంగా క్షీణించే అవకాశం ఉంది. అందువల్ల తాత్కాలికంగా ఖర్చులను తగ్గించడం ద్వారా లాభాలను చూపించడం కన్నా, సమయానుకూలంగా అన్ని స్థాయిలలో నియామకాలు చేపట్టడం అత్యవసరం.
సమగ్ర నియామకాలు ఆవశ్యం!
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వృద్ధి మొత్తం విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా పంపిణీ సంస్థలకు నిరంతర సరఫరా కొనసా గాలంటే ప్రసరణ వ్యవస్థ బలంగా ఉండటం అత్యవసరం. ఈ నేపథ్యంలో ఈ సంస్థ స్థిరత్వం కేవలం ఒక సంస్థ ప్రయోజనం కాకుండా, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అవసరమైన అంశం. కాబట్టి ఈ కీలక సంస్థను బలోపేతం చేయడానికి మానవ వనరులపై తక్షణ దృష్టి పెట్టి, సమగ్ర నియామకాలు చేపట్టడం అత్యంత అవసరం.
-గువ్వల పవన్ కుమార్
అధ్యక్షులు, ఏఈ అసోసియేషన్
82477 71655






