- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్‌ది మేకపోతు గాంభీర్యమే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వాణిజ్యంపై విరుచుకు పడ్డాడు. భారత్ నుండి తమకు వస్తున్న దిగుమతులపై ఇరవై

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ వాణిజ్యంపై విరుచుకు పడ్డాడు. భారత్ నుండి తమకు వస్తున్న దిగుమతులపై ఇరవై ఐదు శాతం పన్ను విధించడంతో పాటు అదనంగా పెనాల్టీ కూడా వేస్తానంటున్నాడు. అది కూడా తక్షణమే అమల్లోకి తీసుకువచ్చాడు. భారత్ అమెరికా ప్రయోజనాలకు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా రష్యా, ఇరాన్‌లతో వాణిజ్య సంబంధాలు కొనసాగించడం ఈ నిర్ణయాలకు కారణాలుగా చెబుతున్నా, అంతకు మించిన కడుపు మంట, కంటగింపు నేపథ్యంగా ఉన్నట్టున్నాయి. అందుకనే పన్నులు పెంచడంతో పాటు మన దేశ ఆర్థిక వ్యవస్థని ప్రాణం లేనిదిగా అభివర్ణించాడు. ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న పెద్ద ఆర్థిక వ్యవస్థ, జీడీపీ వృద్ధి ఆరు శాతం పైగా కొనసాగుతున్న వేళ అలా అభివర్ణించడం పిచ్చితనమే. నిజానికి వీటి వెనుక అసలు కారణం భారత్ తన దేశ ప్రయోజనాల కోణంలో స్వతంత్రంగా వ్యవహరించడమే. అమెరికా కోరుకున్నట్లు వ్యవసాయ, పాడి ఉత్పత్తుల దిగుమతులకు సుంకాలు తగ్గిస్తే, అవి వెల్లువెత్తి మన దేశవాళీ పంటలు, పాలు నష్టపోతాయి. రక్షణ కొరవడుతుంది. అక్కడ ఆ దేశం వాటికి భారీ రాయితీలు సమకూర్చి ప్రోత్సహించడం వల్ల, అంత చౌకగా ఇక్కడ రైతు పోటీకి నిలువలేడు. ఒకసారి వాడు మార్కెట్ ఆక్రమించుకున్నాక, మోనోపలీ చేస్తాడు. అప్పటికి ఇక్కడి స్వయం సమృద్ధి ధ్వంసం అవుతుంది. అందుకనే ఈ విషయంలో బేరసారాలకు తావులేదు. ఇక రష్యా నుండి ఆయుధా లు, ఇంధనం కొనుగోలు చెయ్యడం అది భారత్ ఇష్టం. పోనీ అమెరికా చెప్పినట్టు మన లాభం వదులుకొని అమెరికాతోనే అంటకాగితే ఫలితం ఏమైనా ఉందా? అమెరికాలో భారతీయుల ఉద్యోగాలతో సహా అన్నింట్లో కోత. మనకు శత్రువైన పాకిస్తాన్‌ని పెంచి పోషిస్తుంటే అమెరికాతో అంటకాగాల్సిన అవసరం ఏముంది? అమెరికా సుంకాలకు లొంగిపోకుండా ప్రపంచ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవాలి. ఈ మధ్య బ్రిటన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న రీతిలో మిగతా దేశాలతో ప్రయత్నించాలి. దేశంలోని వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలి. స్వతంత్ర భారతానికి అమృత కాలం అని భావిస్తున్న 2047లోగా అభివృద్ధి యాత్రలో, రాగల అడ్డంకుల్ని ఊహించి, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ట్రంప్‌దంతా మేకపోతు గాంభీర్యమే. చైనాని ఇలానే బెదిరించి వెనక్కి తగ్గలేదా? ఇలానే ముందుకు పోతే అమెరికా ఆర్థిక వ్యవస్థకూ నష్టమే కదా!
-డా.డి.వి.జి. శంకరరావు
94408 36931






