- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనా వలలో చిక్కిన ట్రంప్.. చైనా ఇవి ఎగుమతి చెయ్యకపోతే అమెరికా భద్రతకే ముప్పు!
సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదన్న చైనా, అనుకున్నట్టుగానే అమెరికాకు గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు

సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదన్న చైనా, అనుకున్నట్టుగానే అమెరికాకు గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో వ్యూహాత్మక పోటీ కొనసాగుతున్న తరుణంలో ట్రంప్ తీసుకున్న తొందర పాటు నిర్ణయాల వల్ల అమెరికానే కాదు మొత్తం యూరప్ దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ చైనాతో గోక్కొని పొరపాటు చేసాడని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
ట్రంప్ పాలనలో చైనాపై విధించిన ప్రతీకార సుంకాలు చివరకు అమెరికాకే బూమెరాంగ్ అయ్యాయి. 2024లో అమెరికా రక్షణ శాఖ అధ్యక్షుడికి ఇచ్చిన నివేదిక ప్రకారం, అరుదైన ఖనిజాల విషయంలో చైనాపై ఆధారపడటమే జాతీయ భద్రతకు పెద్ద ముప్పు అని ముందే హెచ్చరించింది. ఇప్పుడు అదే యథార్థమైంది.
భద్రతకు ముప్పు
చైనా తాజాగా తీసుకున్న గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం లాంటి అరుదైన ఖనిజాల ఎగుమతుల నిషేధం అమెరికాకు మామూలు హెచ్చరిక కాదు. ఇది నేరుగా భద్రతకు ఉద్దేశించి చైనా కొట్టిన బలమైన దెబ్బ. ట్రంప్ సర్కార్ చైనాతో వాణిజ్య యుద్ధాన్ని వ్యూహాత్మకంగా మొదలు పెట్టినప్పటికీ, అందులో భద్రతా సంబంధిత విభాగాలను తక్కువ అంచనా వేసింది. ఇప్పుడు ఆ పొరపాటుకు మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి అమెరికాకు దాపురించింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే అరుదైన ఖనిజాల్లో దాదాపు 70 శాతం చైనా నుంచే వస్తుంది. అగ్రరాజ్యం అయిన అమెరికా వాటా కేవలం 11.4 శాతం మాత్రమే. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దిగుమతులు లేకపోతే అది ఎంత మాత్రం సరిపోదు.
ప్రపంచం మొత్తంగా కుదేల్
చైనా ఏడింటికి పైగా కీలక ఖనిజాలపై నిషేధం విధించి, వాటిని ఎగుమతి చేయాలంటే ప్రత్యేక లైసెన్సులు తప్పనిసరి చేసింది. సమారియం, గడోలినియం, డైస్పోరియం వంటి ఖనిజాలు అమెరికా రక్షణ వ్యవస్థకు మౌలికంగా అవసరం. ఎఫ్-35 యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, రాడార్ వ్యవస్థలు, మానవరహిత వైమానిక వాహనాలు, స్మార్ట్ బాంబుల తయారీలో ఇవి కీలకం. ఇవి లేకుండా నూతన తరం రక్షణ సాంకేతికత అభివృద్ధి అసాధ్యం. ఈ నిషేధంతో అమెరికా మాత్రమే కాదు, యూరప్ దేశాలూ కూడా కుదేలవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ అవసరాల్లో సగం వరకు చైనా మీద ఆధారపడి ఉంది. సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆటోమొబైల్ పరిశ్రమలు ఇలా ప్రతి విషయంలో యూరప్ దేశాలు కూడా ఈ ఖనిజాల కోసం చైనాపై ఆధారపడి ఉన్నాయి.
మేకపోతు గాంభీర్యం
ఇలాంటి పరిస్థితుల్లో "మైన్ టు మాగ్నెట్" పేరిట అమెరికా ఐదేళ్ల ప్రణాళికను రూపొందించినా, ఇది దీర్ఘకాలిక పరిష్కారం మాత్రమే. తక్షణ పరిష్కారం కాదు. ఇప్పటికిప్పుడు అవసరాలను తీర్చే పరిష్కార మార్గం కనిపించడం లేదు. ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హసెట్ ప్రకారం, ఈ పరిణామం అమెరికాకు ఒక హెచ్చరిక. చైనా నిర్ణయం వల్ల మౌలిక రంగాలన్నింటిలో ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన ఒప్పుకున్నారు. తాము చైనా నిర్ణయాన్ని అధ్యయనం చేస్తున్నామని, ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే ఇది కేవలం దౌత్య భాష. మేకపోతు గాంభీర్యం మాత్రమే.
అగ్రరాజ్యంగా చైనా స్థానం ఖరార్
అయితే ఇది కేవలం వాణిజ్య సమస్య కాదు. ఇది గ్లోబల్ పవర్ డైనమిక్స్‌ను మార్చే స్థాయికి చేరిన వ్యూహాత్మక పోరాటం. చైనా ఇప్పటి నిర్ణయంతో భౌగోళిక రాజకీయాలలో తాను అగ్రస్థానానికి చేయదగినదని ఘనంగా ప్రకటించినట్లైంది. ట్రంప్ దూకుడుతో చైనాపై వేసిన ఆంక్షలన్నీ ఇప్పుడు అమెరికా పైనే రివర్స్ గేర్‌లో తిప్పి కొడుతున్నాయి. ఈ సంక్షోభం అమెరికా నేతృత్వంలో ఉన్న పాశ్చాత్య దేశాలకు భద్రత, ఆర్థిక వ్యవస్థల మీద ప్రాథమిక ప్రశ్నలు వేస్తోంది. చైనా ఎప్పుడూ ఒక వ్యాపార భాగస్వామి కాదు. అది ఒక వ్యూహాత్మక ప్రత్యర్థి అన్న నిజం మరింత స్పష్టమవుతోంది. దీని అర్థం ఏంటంటే పరస్పర ఆధారిత ప్రపంచంలో దుర్నీతి, ముందు చూపు లేకుండా అనాలోచిత వ్యూహాలతో ముందుకు పోతే, తిరుగులేని మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
డాక్టర్. కోలాహలం రామ్ కిషోర్
98493 28496






