- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రంప్.. ప్రపంచ శాంతికి ప్రమాదం!
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల దాడి అంతర్జాతీయ చట్టాలను తుంచి పారేసిన దౌర్జన్య చర్యగా నిలిచింది.

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబుల దాడి అంతర్జాతీయ చట్టాలను తుంచి పారేసిన దౌర్జన్య చర్యగా నిలిచింది. జూన్ 21 రాత్రి అమెరికా యుద్ధ విమానాలతో ‘బంకర్ బస్టర్’ బాంబులతో అంతర్జాతీయ అణు సంస్థ (ఐఏఈఏ)ను పక్కనపెట్టి, ప్రపంచాధిపత్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ దాడికి పాల్పడింది. ట్రంప్ చేస్తున్న యుద్ధ న్యాయాలు నిష్కర్షగా అణు ఆయుధాలపై కాక, పాలకుల మార్పు లక్ష్యంగా ఉండటం గమనార్హం. అమెరికా ఆధిపత్యం ఉన్నంతకాలం, యుద్ధాలూ ఉండక తప్పదు అనే వాస్తవాన్ని ఇది మరోసారి నిరూపిస్తోంది.
ఇరాన్‌ను ఒంటరి చేయాలని..
మిడిల్ ఈస్ట్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చేందుకు అమెరికా-ఇజ్రాయెల్ సంకల్పంతో ముందుకు సాగుతున్నాయి. గతంలో ఇరాక్, లిబియా, సిరియా, లెబనాన్‌లపై 'రెజీమ్ చేంజ్' ప్రయోగాల తర్వాత ఇప్పుడు టార్గెట్ ఇరాన్. కుర్దిష్ ప్రాంతాల్లోని సైనిక దళాల చలనాలు, సిరియాలోని హిజ్బుల్లాను బలహీన పరిచే కుట్రలూ ఈ దాడికి పునాది వేసాయి.. జూన్ 18న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ను ట్రంప్ ఆహ్వానించడంలో కూడా, తూర్పు వైపు నుంచి ఇరాన్‌ను ఒంటరిగా చేయాలన్న కుట్ర ఉందనే అనుమానం తలెత్తుతోంది. ఇరాన్ అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకే వినియోగిస్తోందన్న అంశాన్ని అమెరికా నేషనల్ ఇంటలిజెన్స్, ఐఏఈఏ చీఫ్‌లు స్పష్టంగా ప్రకటించినా అమెరికా దాన్ని అంగీకరించలేదు. నిజానికి, ఇజ్రాయెల్‌కి అణు బాంబు లు అభివృద్ధి చేసే స్వేచ్ఛ ఇచ్చిన అమెరికా, అదే హక్కు ను ఇరాన్‌కు నిరాకరిస్తోంది. ఇది అమెరికా సంకుచిత కుట్ర బుద్ధికి నిదర్శనం.
మీడియా పక్షపాత ధోరణి..
ఇజ్రాయెల్ మొదటగా అణు శాస్త్రవేత్తలపై, మిలిటరీ స్థావరాలపై దాడులు చేసింది, ఇందుకు ఇరాన్ 15 గంటల్లోనే ధీటైన ప్రతిస్పందన ఇచ్చింది. పశ్చిమ దేశాలు ఈ దాడులను "ఆత్మరక్షణ చర్య"లుగా ప్రదర్శించే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ పౌరులను లక్ష్యంగా చేసుకుని, మహిళలతో సహా అమాయకుల్ని హతమార్చి న ఇజ్రాయెల్‌ను బహిరంగంగా తప్పుబట్టలేకపోవడం పశ్చిమ మీడియా పక్షపాత ధోరణిని ఎత్తిచూపుతోంది. ఇదే మీడియా గతంలో గాజాలో హమాస్ స్థావరాల కోసం ఆసుపత్రుల కింద తవ్వినప్పుడు పెద్ద గొంతుతో మొత్తుకున్న మీడియా ఇప్పుడు మౌనంగా మారింది. అయితే ఈ యుద్ధం మానవాళి ప్రయోజనాలకు వ్యతి రేకంగా జరుగుతుంది. అమెరికా - ఇజ్రాయెల్ ఉమ్మడి వ్యూహం శాశ్వత శాంతికి భంగం కలిగిస్తోంది.
అమెరికా.. అణు రౌడీయిజం
ఈ సంఘటనలు ఒక క్లిష్టమైన సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రపంచ అశాంతికి అమెరికా అణు రౌడీయిజమే ప్రధాన కారణం. ట్రంప్‌తో ప్రపంచ శాంతికి ప్రమాదం అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. అందుకే అమెరికాలోనే ట్రంప్ చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వేలాది మంది పౌరులు "నో వార్ ఆన్ ఇరాన్" అంటూ "ట్రంప్ వార్ క్రిమినల్" వంటి ప్లకార్డులతో వీధుల్లోకి వచ్చారు.. యువత, శాంతి వాదులు, శాస్త్రవేత్తలు, మాజీ మిలిటరీ అధికారులందరూ ఈ దాడులకు వ్యతిరేకంగా తమ స్వరం వినిపించారు. అమెరికాలో ప్రజాస్వామ్య ధ్వని ఇంకా బతికే ఉందని ఈ నిరసనలు సూచిస్తున్నాయి. ఒకవైపు ఐక్య రాజ్యసమితిని నిర్వీర్యం చేసి, మరోవైపు తమ నిబంధనలు ఇతరులపై రుద్ది, ఇతరుల మీద నిందలు మోపే యత్నాలు చేస్తున్న అమెరికా, తమ ద్వంద్వ ధోరణిని ఇక పైనా కొనసాగిస్తే ప్రపంచవ్యాప్తంగా తగిన ఎదురు దెబ్బలు తప్పవు.. అణు బాంబుల మాయాజాలంలో శాంతి అసంభవం. శాశ్వత శాంతికి న్యాయపూర్వకమైన అంతర్జాతీయ వ్యవస్థ అవసరం. అందుకే ఐక్యరాజ్య సమితి తక్షణంగా అమెరికా దాడులపై విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాల్సిన అవసరం ఉందని ప్రపంచ శాంతి కాముకులు కోరుకుంటున్నారు..
-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
98493 28496






