ఇకనైనా మేల్కొందాం!

by Ravi |   (  Updated:2025-08-31 00:30:27  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి దిగు మతులపై 50 శాతం టారిఫ్‌లు విధించడం, భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది.

ఇకనైనా మేల్కొందాం!
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ నుంచి దిగు మతులపై 50 శాతం టారిఫ్‌లు విధించడం, భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది. రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్నందుకు శిక్షగా ఈ టారిఫ్‌లు విధించారు. మునుపటి 25 శాతం టారిఫ్‌లను రెట్టింపు చేయడం ద్వారా, అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు సుమారు 87 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఇందులో 55 శాతం వరకు ప్రభావితమవుతుందని ఎక్స్‌పోర్టర్ సంఘాలు అంచనా వేస్తున్నాయి.

పలు రంగాలపై తీవ్ర ప్రభావం

ట్రంప్ టారిఫ్‌లు భారత్‌లోని పలు రంగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా లేబర్-ఇంటెన్సివ్ రంగాలు అత్యంత ఎక్కువగా దెబ్బతింటాయి. టెక్స్‌టైల్స్, అప్పారెల్ రంగాలకు అతి పెద్ద దెబ్బ తగులుతుంది. భారత్ నుంచి అమెరికాకు టెక్స్‌టైల్ ఎగుమతులు సుమారు 12 బిలియన్ డాలర్లు, ఇందులో మిలియన్ల మంది కార్మికులు పని చేస్తున్నారు. టారిఫ్‌లు 5.8 శాతం నుంచి 55.8 శాతానికి పెరగడంతో, కంపెనీలు లాభాలు తగ్గి, కార్మికుల ఉద్యోగాలు కోల్పోవచ్చు. ఉదాహరణకు, తిరుపూర్, బెంగళూరు ప్రాంతాల్లోని చిన్న ఫ్యాక్టరీలు ఇప్పటికే ఆర్డర్లు తగ్గుతున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్‌ఐ) అంచనాల ప్రకారం, ఈ రంగంలో 5-7 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి.

డేంజర్‌లో లక్షలాది ఉద్యోగాలు..

జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగానికి కూడా పెద్ద మొత్తంలో నష్టం జరగనుంది. సురత్, ముంబై, జైపూర్‌లలో మిలియన్ల మంది డైమండ్ కట్టర్లు, జ్యువెలరీ మేకర్లు ఉన్నారు. టారిఫ్‌లు 2.1 శాతం నుంచి 52.1 శాతానికి పెరగడంతో, 8-10 బిలియన్ డాలర్ల ఎగుమతులు ప్రభావితమవుతాయి. కంపెనీలు లాంటి టైటాన్, గోల్డ్ స్టార్ జ్యువెలరీ వంటివి షేర్ మార్కెట్‌లో దెబ్బతిన్నాయి. సీఫుడ్, లెదర్ రంగాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. ష్రింప్ పీలింగ్ యూనిట్లలో లక్షలాది మహిళా కార్మికులు ఉద్యోగాలు కోల్పోవచ్చు. కెమికల్స్, ఆటో పార్ట్స్ రంగాల్లో 4-5 బిలియన్ డాలర్ల నష్టం అంచనా. అయితే, స్టీల్, అల్యూమినియం, కాపర్ వంటివి 25 శాతం వద్దే ఉండటం కొంత ఊరట. స్మార్ట్‌ఫోన్స్, ఫార్మా, ఎనర్జీ రంగాలు మినహాయింపు పొందాయి. ఇవి భారత్‌ నుండి 20 బిలియన్ డాలర్లకు పైగా ఎగుమతులు ఉంటాయి.

ఏం చేయాలి?

నష్ట నివారణా చర్యలు అత్యవసరంగా తీసుకోవాలి. ముందుగా, ‘ఆత్మనిర్భర్ భారత్‌’ ను బలోపేతం చేయాలి. దేశీయ డిమాండ్‌ను పెంచడానికి జీఎస్‌టీ రేట్లను 5 శాతం లేదా 18 శాతానికి తగ్గించాలి. ఇది వినియోగాన్ని పెంచి, ఎగుమతి నష్టాన్ని కొంత మేరకు భర్తీ చేస్తుంది. రెండవది, ఎగుమతి వైవిధ్యీకరణ చైనా, రష్యా, బ్రెజిల్ వంటి కొత్త మార్కెట్లను వేగంగా అన్వేషించాలి. మూడవది, అమెరికాతో చర్చలు మినహాయింపుల కోసం డిప్లమాటిక్ ప్రయత్నాలు కొనసాగించాలి. మినీ ట్రేడ్ డీల్‌లు కుదుర్చుకోవాలి. నాలుగవది, రంగాల వారీగా సబ్సిడీలు, టెక్స్‌టైల్, జ్యువెలరీ రంగాలకు ప్రోత్సాహకాలను ఇవ్వాలి, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లతో కార్మికులను రీస్కిల్ చేయాల్సి ఉంటుంది. చివరగా, దీర్ఘకాలికంగా భారత్ తన ఆర్థిక విధానాన్ని సమీక్షించి, సింగిల్ మార్కెట్ ఆధారిత విధానాన్ని తగ్గించుకోవాలి. ఈ సవాలు భారత్‌ను మరింత బలోపేతం చేసే అవకాశంగా మార్చుకోవాలి. భారత్ ఆర్థికంగా కొంత పుంజుకున్న తర్వాత అమెరికా పై ప్రతీకార చర్యలు తీసుకోవాలి.

డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్,

98493 28496

Next Story