- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశభక్తిని చాటేది సగటు జీవితాలే..!
భారతదేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, యువత విదేశీ వలసలు, పోషకాహార లోపం, సంపద కేంద్రీకరణ వంటి సమస్యలపై విశ్లేషణ. నిజమైన దేశభక్తి అంటే ప్రజా శ్రేయస్సు, సమాన అవకాశాలు, ఆర్థిక న్యాయం కోసం పోరాడటమేనని చర్చించే ప్రత్యేక కథనం.

మన భారతదేశం గొప్పదని భావించడం మంచిదే గాని ఆ గొప్పతనం మానవ శ్రేయస్సు రీత్యా ఉన్నదా? ఉన్నత ఆదాయ వర్గాల మొదటి ఒకటి నుంచి ఐదు శాతంలో ఉండే సంపన్న వర్గాల స్థితిగతులను మొత్తం ప్రజానీకానికి వర్తింపజేస్తే అదే దేశ స్థితిగతులు అనుకుంటే అంతకన్నా మించిన లోపభూయిష్టమైన అంచనా ఉండదు దేశంలో జరిగే వృద్ధి ప్రక్రియలో సమ్మిళిత వృద్ధి లేక ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక యువత విదేశాల పాలవుతున్నది.
దేశంలో 67% గ్రాడ్యుయేట్లు 38% ఐఐటీ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నారు. ఉపాధి అవకాశాలు లేక 18.5 మిలియన్ భారతీయులు విదేశాలకు వలస పోయారు 35.4 మిలియన్ భారతీయులు విదేశాలలో పౌరులుగా నేడు ఉన్నా రు. పుట్టిన దేశంలో మాకు ఏముంది? ఎలా బతికేది అని మన దేశ పౌరులు విదేశాల పాలవుతున్నారు. మానవ జీవన ప్రమాణాలైన సగటు ఆయుర్దాయం, శిశు మరణాల రేటు వంటి ప్రాథమిక విషయాలలో భారతదేశం ఇంకా వెనుకబడే ఉంది.
పోషకాహార లోపం ఒక తీరని 'అప్పు'
ఉదాహరణకు, భారతదేశంలో ప్రతి 1,000 జననాలకు శిశు మరణాల రేటు దాదాపు 26గా ఉంది. ఇది వియత్నాం (14) కంటే దాదాపు రెట్టింపు, చైనా కంటే (6) చాలా ఎక్కువ. బహుశా అన్నింటికంటే విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచ ఆకలి సూచిక (గ్లోబల్ హంగర్ ఇండెక్స్)లో భారతదేశం ఎప్పుడూ చివరి వరుసలోనే ఉండటం! ఇటీవల 127 దేశాలతో ఇండెక్స్ మన దేశం 105వ స్థానంలో నిలిచింది. పోషకాహార లోపం అనేది ఒక తీరని 'అప్పు' లాంటిది. ఇది భవిష్యత్తులో దశాబ్దాల పాటు పిల్లల మానసిక వికాసం, దీర్ఘకాలిక ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
కన్న కలలన్నీ కల్లలే..
మరొకవైపు అమెరికా, చైనా తర్వాత ఎక్కువ మంది (309) బిలియనీర్లు ఉన్న దేశం మనది. మన దేశ స్థూల జాతీయోత్పత్తిలో 13 వంతు ఈ బిలియనీర్లదే. దేశంలో అత్యంత సంపన్నులైన ఒక శాతం వద్ద స్వాతంత్య్రం వచ్చే నాటికి జాతీయాదాయంలో 12 శాతం వాటా చేరితే, 1982 నాటికి వారి వాటా 6 శాతానికి పడిపోయింది. నయా ఉదారవాద విధానాలు వచ్చాక, లిబరలైజేషన్(L), ప్రైవే టైజేషన్(P), గ్లోబలైజేషన్(G) అనే LPG విధానాల వలన ప్రపంచమంతా వసుధైక కుటుంబంగా, పెట్టుబడులతో, ఉద్యోగ కల్పనతో, వస్తు ఉత్పత్తులతో, ఉపాధి గణనీయంగా పెరిగి మానవ శ్రేయస్సుతో ప్రపంచ దేశాలన్నీ అభివృద్ధి చెంది పోతాయని, ముఖ్యంగా వెనుకబడిన దేశాలు అభివృద్ధిలో పెట్టుబడిదారుల దేశాల సరసన సమానంగా అభివృద్ధి చెందుతాయని అందరూ భావించారు..
ప్రభుత్వరంగంపై శీతకన్ను.. ఉత్పత్తి కుదేలు..
కానీ మన పాలకులు మాత్రం ప్రభుత్వ రంగంలో పరి శ్రమలు పనిచేయడం లేదని నష్టాలలో ఉన్నాయని చెబుతూ ఎల్‌పీజీ విధానాలకు పోయారు. ఇప్పుడు ఏమైంది..? ఉత్పత్తి రంగం కుదేలైంది. దీంతో అనేక వస్తువులు అమెరికా, చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో నిరుద్యోగిత, మానవ వనరుల విధ్వంసం పెరిగింది. సహజ వనరులు పెట్టుబడిదారుల వశమైపోయాయి. వృద్ధి ప్రక్రియ అంతా పెట్టుబడిదారుల కనుసన్నల్లోకి పోయింది. 2022-23 నాటికి అది ఏకంగా 23 శాతానికి పెరిగింది. గత 100 సంవత్సరాలలోనూ ఆదాయాల అసమానతలు ఇంత దారుణంగా ఎన్నడూ లేవు. అత్యంత సంపన్నులైన ఒక్క శాతం ప్రజల వార్షికాదాయం 5.5 శాతం చొప్పున పెరిగింది. తక్కిన 99 శాతం ప్రజల వార్షికాదాయాలు కేవలం 1.5 శాతం చొప్పున మాత్రమే పెరిగాయి. కానీ దేశ జనాభానంతటినీ ఒక్కటిగానే పరిగణిస్తూ లెక్కిస్తే సగటు ఆదాయ వృద్ధిరేటు 2 శాతం మాత్రమే ఉంది.
కనీవినీ ఎరుగని రీతిలో అసమానతలు..
దేశం తలసరి ఆదాయం ప్రస్తుతం మూడు వేల డాలర్లు ఉండగా, ఉన్నత ఆదాయ వర్గాలపై భాగంలో ఉన్న 10 శాతం ధనికుల తలసరి ఆదాయం 14 వేల మిలియన్ డాలర్లుగా ఉంది. ఇలా పేదలకు ధనికులకు మధ్య ఆర్థిక అసమానతలు ఎన్నడూలేని విధంగా పెరిగిపోయాయి. దేశంలో తీవ్రమైన ఆర్థిక అసమానతలు పెరిగాయి. టాప్ 10% ప్రజల వద్ద 77% సంపద ఉండగా, కింది 50% ప్రజల వద్ద కేవలం 4.1% మాత్రమే ఉంది. Oxfam నివేదిక ప్రకారం 2022-23లో 1% ప్రజలు 22.3% జాతీయ ఆదాయాన్ని పొందారు. ఇది ఒకప్పటి రాచరిక వ్యవస్థలో అసమానతల కంటే ఎక్కువ.
దేశభక్తి అంటే ఇది కదా..
ఈ అసమానతలు ప్రజా శ్రేయస్సును దెబ్బతీస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో 24 దేశాల 400 మంది ధనవంతులు తమపై ఎక్కువ పన్నులు విధించాలని కూడా కోరారు. ప్రజలకు చెందాల్సిన వనరులు కొద్ది మందికి వెళ్లడం వల్ల సంపద కేంద్రీ కరణ పెరిగి సామాజిక- ఆర్థిక సమస్యలు తీవ్రం అవుతున్నాయి. దేశంలో అసమానతలను, దోపిడీని రూపుమాపేందుకు పుట్టిన మావోయిస్టు పార్టీని ఆపరేషన్ కగార్‌తో నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ప్రజా ఉద్యమాలు తప్పవేమో? బ్రిటిష్ పాలన తర్వాత దేశంలో సంపద కొద్దిమంది బిలియనీర్ల చేతుల్లో కేంద్రీకృతమైందని విమర్శలు ఉన్నాయి. 25% ధనికుల వద్ద సుమారు 80% భూమి ఉండగా, 41% రైతులకు భూమి లేదు. 1997-2022 మధ్య సుమారు మూడు లక్షల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితిల్లో యువత వలసలు పెరిగాయి. కుబేరుల అండదండలతో మేము పాలకులుగా ఉండాలని ప్రజా హక్కుల పోరాటాన్ని అణగదొక్కుతూ ప్రమాదంలోకి పడవేస్తున్నారు పాలకులు.. కాబట్టి ప్రజా హక్కులు, సమాన అవకాశాలు, ఆర్థిక న్యాయం కోసం ప్రజా ఉద్యమాలు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కదా దేశభక్తి.
-డాక్టర్ ఎ. నాగరాజు నాయుడు
98663 22172






