న్యాయానికి చెప్పు, మతానికి జెండా.. ఇది కొత్త భారత్?

by Ravi |   (  Updated:2025-10-14 08:19:13  IST  )

రాజ్యాంగంలో అత్యున్నత స్థాయిని ఇచ్చి చట్టం కన్నా ఎంతో ఎత్తులో నిలబెట్టిన చీఫ్ జస్టిస్ పదవి మీద చెప్పు విసరడం ఈ దేశపు ప్రజాస్వామ్యాన్ని

న్యాయానికి చెప్పు, మతానికి జెండా.. ఇది కొత్త భారత్?
X

రాజ్యాంగంలో అత్యున్నత స్థాయిని ఇచ్చి చట్టం కన్నా ఎంతో ఎత్తులో నిలబెట్టిన చీఫ్ జస్టిస్ పదవి మీద చెప్పు విసరడం ఈ దేశపు ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడమే. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా పతనం అయిపోతే ఈ దేశం కుక్కలు చింపిన విస్తరిలా కావడం ఎంతసేపు? ఆ సోయిలేని వాళ్లు మతాన్ని కులాలను మత తత్వాన్ని బుర్రల్లోకి ఎక్కించుకొని విద్వేషం చిమ్మడానికి రెడీ అయిపోయారు. మతతత్వం అనేది కేవలం రాజకీయ క్రీడ అని ఇంకా తెలుసుకోని వాళ్లకు పదేళ్లుగా ఈ దేశం, ప్రభుత్వ వ్యవస్థలు భ్ర‌ష్టు పట్టిపోతున్నా పట్టించుకోక అమృత కాలంలో ఉన్నాం అనుకునేవాళ్లకు జోహార్లు చెప్పడం తప్ప మరేమీ చేయలేం.

చెప్పు విసిరేవాడే హీరో..

ఈ రాకేష్ కిషోర్ అనేవాడు రేపు ఆరెంజ్ పార్టీలో చేరి, ఎంపీ అయినా ఆశ్చర్యం లేదు.. గవాయి చీఫ్ జస్టిస్ అయితేనేం ఒక దళితుడు... దళితుడిపై చెప్పు విసిరి తన ప్రతాపం చూపిన సనాతని కిషోర్ రెండు రో‌జుల్లో హీరో అయిపోతాడు. ఈ రోజు ఆవేశంలో ఇది న్యాయ వ్యవస్థ మీద దాడి అన్నవాళ్లు రేపు అతని మీద మీమ్స్ షేర్ చేస్తారు. లోలోపల ఈగో సంతృప్తి చెంది అబ్బ సాయిరాం అనుకున్నవాళ్లు రేపు ఈజీగా అతన్ని నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పటికే భారత ప్రధాన న్యాయమూర్తి తాను బుద్దిస్టుని అని చెప్పుకున్నారు కాబట్టి ఆయన దళితుడు కాదనే వాదనలకు కూడా దిగిపోయారు.

అగ్గి రాజేయడానికి ‘స్వదేశీ’

అవును.. మెజారిటీయన్ మతపిచ్చి ఉన్న జనాల కోరిక మేరకు ఈ మతతత్వ పార్టీ దేశవ్యాప్తం కావాలి. ప్రాంతీయ పార్టీలు, ప్రజాస్వామ్యం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడే పార్టీలు అయిపు లేకుండా పోవాలి. రేపటి తరాలు చదువులు లేకుండా మత పాఠశాలల్లో, మదర్సాలల్లో చేరి ఒకరిమీద ఒకరు దాడులకు దిగాలి. పిల్లలు విదేశాల్లో సెటిల్ అయి డాలర్లు అందుకుంటున్న నేపథ్యంలో, కడుపులో చల్ల కదలని పెద్దలు స్వదేశీ వాట్సప్ ఫార్వర్డ్‌ల ద్వారా మరింత అగ్గి రాజేయాలి.

ఏ రీల్ చేసినా 'హేట్' మేలిముత్యాలు..

ఈ ద్వేషం కులంతో మతంతోనే ఆగదు, తిండి, బట్టా, భాష, ప్రాంతం, పద్ధతి, జెండర్, హీరోలు, నాయకులు, పార్టీలు కావేవీ ఈ విద్వేషానికి అనర్హం. నా మాట మీద నమ్మకం లేకుంటే ఏ రీల్ అయినా చూడండి (వంట, పిల్లలు, సినిమాలు, రాజకీయం, డ్యాన్సులు, ఇంటర్వ్యూలు ఏ టాపిక్ అయినా) చూసిన వాటి కింద పెడుతున్న కామెంట్స్ చూడండి. ఎంత గొప్ప వీడియో అయినా సరే. దాంట్లో ఒక్క నాలుగైనా హేట్ మేలిముత్యాలు దొరుకుతాయి.

ఏ విలువలూ తెలీని కాలం

ఇక సామాజికంగా బంధాల్లో హింసా, విద్వేషాల ఆధారంగా దాడులు, ప్రతిదాడుల జింగోఇజం పెచ్చరిల్లిపోయాక కూడా సోయిరాదు. అప్పుడు కానీ ఇన్ని వైరుధ్యాలు ఉన్న ఈ ఉపఖండం అనే పలుచని ఫ్యాబ్రిక్‌ను కలిపివుంచిన రాజ్యాంగ వ్యవస్థలు, వాటి విలువా తెలియదు. అప్పటికి చాలా లేట్ అయిపోయి ఉంటుంది.

once a country is conditiioned to liars, it takes generations to get the trugh back. - Gore Vidal

ఒక దేశం అబద్ధాలకోరులకు నిలయంగా మారిన తర్వాత, దాన్ని తిరిగి పొందడానికి తరాల కాలం పడుతుంది. - గోర్ విడాల్

-రజిత కొమ్ము

Next Story