స్థానిక ఎన్నికల్లో త్రిముఖ పోరు.. గెలిచేది ఎవరు?

by Ravi |   (  Updated:2025-07-16 01:15:27  IST  )

తెలంగాణలో స్థానిక సమరానికి త్వరలోనే నగారా మోగనుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతున్న వేళ

స్థానిక ఎన్నికల్లో త్రిముఖ పోరు.. గెలిచేది ఎవరు?
X

తెలంగాణలో స్థానిక సమరానికి త్వరలోనే నగారా మోగనుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతున్న వేళ, ఈ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షగా మారాయి. పదేళ్ల అధికారాన్ని కోల్పోయి పూర్వవైభవం కోసం పరితపిస్తున్న బీఆర్ఎస్, అధికారంలో ఉన్నా కాసింత ప్రజా వ్యతిరేకతను సహజంగానే ఎదుర్కొంటున్న కాంగ్రెస్, కేంద్రంలో కొండంత బలమున్నా రాష్ట్రంలో పునాదుల కోసం పాకులాడుతున్న బీజేపీ.. ఈ మూడు శక్తుల మధ్య జరగబోయేది కేవలం ఎన్నిక కాదు, రాజకీయ కురుక్షేత్రం!

అసెంబ్లీ ఎన్నికల సమయంలో లాగే, తెలంగాణలో స్థానిక ఎన్నికలు కూడా హోరాహోరీగా జరగనున్నాయి. చావో రేవో అనేది తేలిపోనున్న ఈ మహా సంగ్రామంలో ఎవరి వ్యూహం ఏ స్థాయిలో ఫలిస్తుంది? ప్రజల నాడి ఎటువైపు ఉంది? అం తిమంగా స్థానిక సామ్రాజ్యాన్ని శాసించేది ఎవరో చూద్దాం..

కేసీఆర్ చాణక్యం వర్సెస్ అంతర్గత కుంపట్లు

పదేళ్ల పాటు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన గులాబీ దళం, అధికారం కోల్పోయాక తీవ్ర గందరగోళంలో చిక్కుకుంది. పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరిందని, కవిత లేఖ ఎపిసోడ్ వంటివి ఆ లొసుగులను బజారుకీడ్చాయని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ అంతర్గత కుమ్ములాటలు పార్టీని కోలుకోలేని దెబ్బతీస్తాయని ప్రత్యర్థులు భావిస్తుండగా, సరిగ్గా ఇక్కడే అధినేత కేసీఆర్ తనదైన చాణక్యం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన గనుక పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే, సెంటి మెంట్‌తో పాటు, పాత సంక్షేమ పథకాల జ్ఞాపకాలతో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. అధికార కాంగ్రెస్‌పై నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీఆర్ఎస్ వేస్తున్న ప్రతి అడుగు ఉత్కంఠ రేపుతోంది. అయితే, సొంత ఇంటిని చక్కదిద్దుకోకుండా రణరంగంలోకి దూకితే ఫలితం ఎలా ఉంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అధికారం అండ.. కలిసి వస్తుందా?

అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అసలు సవాళ్లు మొదలయ్యాయి. ముఖ్యంగా, రైతు భరోసా, రుణమాఫీ వంటి మెగా హామీల అమలులో జాప్యం జరగడం అనేది రైతన్నలలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఇది స్థానిక ఎన్నికల్లో గ్రామీణ ఓటు బ్యాంకుకు గండి కొట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్క్ దూకుడుతో వేల ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా నిరుద్యోగ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తు న్నారు. ఈ పాజిటివ్ వైబ్‌ను ఆయన ఎంతవరకు ఓట్లుగా మలుచుకోగలరు? మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పథకాలు, అధికార బలం కాంగ్రెస్‌కు శ్రీరామరక్షగా నిలుస్తాయా? లేక హామీల వైఫల్యం చివరకు శాపంగా మారుతుందా? అనేది చర్చనీయాంశం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రయాణం కత్తిమీద సాములాగే కనిపిస్తోంది. అయితే అధికారంలో ఉండటం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం. ఇది స్థానిక ఎన్నికల్లో చాలాసార్లు రుజువైంది కూడా. ఇక గ్రామానికి నిధులు రావాలంటే, పనులు కావాలంటే అధికార అభ్యర్థులను గెలిపించడం మంచిదనే అభిప్రాయం సాధా రణంగా గ్రామీణ ప్రజల్లో ఉంటుంది. ఇది అధికార పార్టీకి తప్పకుండా ప్రయోజనం చేకూరుస్తుంది.

కొత్త అధ్యక్షుడికి.. కఠిన సవాలే!

"ఢిల్లీలో మనదే హవా, గల్లీలో మనమెందుకు తక్కువ?" అన్నట్లుగా బీజేపీ పరిస్థితి ఉంది. కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఉన్నా, రాష్ట్రంలో మాత్రం ఆశించిన స్థాయిలో పుంజుకో లేకపోతోంది. నిత్యావసరాల ధరల మంట, పెట్రోల్ బాదుడు వంటివి ప్రజలలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకతను పెంచుతున్నాయి. దీనికి తోడు, పార్టీలో "బయటకు ఐక్యత రాగం, లోపల వర్గాల కుంపటి" అన్న చందంగా పరిస్థితి తయారైంది. తెలంగాణ బీజేపీకి ఇటీవలే ఎంపికయిన కొత్త అధ్యక్షుడు రాంచందర్ రావుకు ఇది ఒక రకంగా కఠిన సవాలే.. అయితే, బలమైన క్యాడర్ ఉన్న కొన్ని ప్రాంతాలు, హిందూత్వ కార్డు, ఆపరేషన్ సిందూర్, మోడీ ఇమేజ్‌తో ఎన్నికల్లో గట్టెక్కాలని భారతీయ జనతా పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ, స్థానిక సమస్యలపై పోరాడకుండా, కేవలం జాతీయ అంశాలతో స్థానిక ఎన్నికల్లో నెగ్గుకు రావడం సాధ్యమేనా?

ఈ ఎన్నికలు.. జీవన్మరణ సమస్య!

ఈ స్థానిక ఎన్నికల్లో త్రిముఖ సంగ్రామం హోరాహోరీగా సాగడం ఖాయం. బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకోవడానికి, కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, బీజేపీ భవిష్యత్తుకు పునాది వేసుకోవడానికి ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా చూస్తున్నాయి. పార్టీల వ్యూహాలు, నేతల మాటల గారడీ ఎలా ఉన్నా, అంతిమంగా ప్రజా తీర్పే శిరోధార్యం. ఈ స్థానిక సమరం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒక సెమీ ఫైనల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే ఈ కురుక్షేత్రంలో విజేత ఎవరో తేలాలంటే, ఫలితాల వరకు వేచి చూడాల్సిందే!

చింత ఆమని

జర్నలిజం పరిశోధక విద్యార్ధి,

84989 04031

Next Story