ఈ యుద్ధం పాక్ స్వయంకృపరాధమే!

by Ravi |   (  Updated:2025-05-11 00:45:58  IST  )

భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో తమ వాళ్లు 14 మంది మరణించినట్లు జైషే మహ్మద్ మసూద్ అజర్ ప్రకటించడం గమనార్హం.

ఈ యుద్ధం పాక్ స్వయంకృపరాధమే!
X

భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో తమ వాళ్లు 14 మంది మరణించినట్లు జైషే మహ్మద్ మసూద్ అజర్ ప్రకటించడం గమనార్హం. తన భూ భాగాన్ని భారత వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలకు సురక్షిత స్థావరంగా మార్చిన పాక్ స్పందన 'తేలు కుట్టిన దొంగల' తరహాలో ఉన్నది. ఆత్మరక్షణ కోసం స్పందించే హక్కు తనకున్నదని, తగిన సమయంలో దానిని ఉపయోగిస్తామని పాక్ ప్రభుత్వం చెప్పడం కేవలం మేకపోతు గాంభీర్యం తప్ప మరోటి కాదు.

రక్తమోడుతుంటే.. రాక్షసానందం పొంది

ఈ దాడుల విపత్తును ఒకరకంగా పాకిస్తాన్ తనంతట తానుగా కొని తెచ్చుకున్నదే. మతోన్మాద ఉగ్రమూకలను పెంచి పోషించి, భారత్‌పై పాక్ మొదలుపెట్టిన పరోక్ష యుద్ధం ఇప్పుడు తుది ఘట్టానికి చేరుకున్నది. ఇకనైనా తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పని సమయం వచ్చింది. భారత్ రక్త మోడుతుంటే రాక్షసానందం పొందిన పాక్ సైన్యిక నాయకత్వం. పరిహారం చెల్లించుకునే రోజు రానే వచ్చింది. ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించినందుకు పాక్ అంతర్జాతీయంగా ఏకాకి అయింది.

మన లక్ష్యం ఉగ్రవాద నిర్మూలనే!

పహెల్గాంలో భారత మహిళల సిందూరాన్ని నేల రాల్చిన పాక్ ముష్కరుల స్థావరాలపై భారత సైనిక వైమానిక రక్షణ దళాలు క్షిపణులతో అగ్ని వర్షం కురిపించాయి. ఉగ్రవాదంపై ప్రతీకారంగా 'ఆపరేషన్ సిందూర్' పేరిట జరిపిన మహోగ్ర దాడిలో పాకిస్థాన్ గడ్డపై ఇష్టారాజ్యంగా నడుపుతున్న ఉగ్ర వాద శిక్షణా స్థావరాలు సమూలంగా బూడిద కుప్పలుగా మారాయి. లక్ష్యాలను ఛేదించడంలో, శత్రు స్థావరాలను నేలమట్టం చేయడంలో మన సైనిక దళాల పాటవానికి సిందూర్ నిలువుటద్దం పడుతున్నది. ఉగ్రదాడులకు పథకాలు వేసే ఆ దాడులను నిర్దేశించే ప్రదేశాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించినట్టు రక్షణశాఖ వెల్లడించడం విశేషం. అక్కడ ప్రజలకు, ఆస్తులకు నష్టం జరగకుండా మన సైన్యం మానవత్వాన్ని చాటి చెప్పింది. మన లక్ష్యం ఉగ్రవాద మూకల రహస్య స్థావరాలను తుద ముట్టించటం. అందుకే భారత వైమానిక దళం ప్రధానంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థల స్థావరాలను లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించింది.

అంతర్జాతీయంగా ఏకాకి పాక్

ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించినందుకు పాక్ అంతర్జాతీయంగా ఏకాకి అయింది. పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు రెండు రోజుల కిందట జరిగిన ఐక్యరాజ్య భద్రతా మండలి సమావేశం కూడా పాకిస్తాన్‌ను ఘాటుగా చివాట్లు పెట్టింది. అందుకే ఈ విష యంలో ఎలాంటి తీర్మానం చేయకుండానే ముగి సింది. పైగా కశ్మీర్ సమస్యను లేవనెత్తేందుకు పాక్ జరిపిన ప్రయత్నాలు పేలవంగా తేలిపోవడం కూడా పొరుగు దేశ వైఫల్యాన్ని సూచిస్తున్నది. ఉగ్రవాదం అనే విషపు మొక్కను తన పెరడులో పెంచి పోషించిన పాకిస్తాన్ ప్రపంచం ముందు తల దించుకుని దోషిగా నిలబడింది. 'పహెల్గాం'లో అమానుషమైన రీతిలో అమాయకులను చంపిన దుర్మార్గులు పాక్‌లోని తమ సూత్రధారులతో ఎప్పటికప్పుడు రహస్య సంప్రదింపులు జరిపినట్టు రుజు వులు కూడా దొరికాయని భారత విదేశాంగ శాఖ తాజాగా ధృవీకరించింది. భారత్ జరిపిన దాడులకు ఇంతకన్నా బలమైన హేతువు ఇంకేం కావాలి. ఇకనైనా పాక్ పశ్చాత్తాపం ప్రకటించి తన తప్పులు సరిదిద్దుకోవాలి. లేదా ఫలితాలు మరింత దారు ణంగా ఉంటాయి.

-డాక్టర్ కిషోర్ ప్రసాద్

98493 28496

Next Story