- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రమజీవుల సమర నినాదం..
జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగనున్నది. అన్ని రంగాల్లోని సుమారు 30 కోట్ల మంది

జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగనున్నది. అన్ని రంగాల్లోని సుమారు 30 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, రైతులూ.. సంఘాల కతీతంగా ఐక్యమై సమ్మె చేపట్టనున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వినాశకర ఆర్థిక విధానాలను నిరసిస్తూ ఈ సమ్మె జరుగనున్నది.
పైవేటీకరణ విధానాలను విరమించుకుని ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయాలి, అధిక ధరలను అరికట్టాలి, పాత పెన్షన్ స్కీం పునరుద్ధరించాలి, కనీస వేతనాలు చెల్లించాలి, కార్మిక వ్యతిరేక చట్ట సవరణలు విరమించుకోవాలి, కార్పొరేట్ల కోసం కాకుండా కష్టజీవులకు మేలు కలిగేలా విధానాల రూపకల్పన జరగాలి అనేవే.. ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్లు..
శ్రామిక ప్రజల ధర్మాగ్రహం
భారత్ మాతాకీ జై అనే నినాదంతో దేశ ప్రజలను ఆక ర్షించి, వారి ఓట్లు సంపాదించి గద్దెనెక్కిన నేటి మన పాల కులు.. ఆ భారతమాత ఒంటి మీదున్న ఆభరణాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఒలిచి, విదేశీయులకు అప్పజెప్పి, భారత మాతను నిరుపేదగా నిలబెట్టే తతంగం నేడు మన కళ్ల ముందే నడుస్తున్నది. నాడు ఒక్క ఈస్టిండియా కంపెనీ మన దేశాన్ని రెండు వందల ఏళ్ల బానిసత్వంలోకి నెట్టేసింది. నేడు అలాంటి ఈస్టిండియా కంపెనీలెన్నింటికో మన పాలకులు తలుపులు బార్లా తెరుస్తున్నారు. ఈ తరహా వినాశకర విధానాలపై దేశభక్త శ్రామిక జనులు ఎక్కుపెట్టిన ధర్మాగ్రహమే నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె.
సంక్షేమ రాజ్యాంగం.. సరళీకరణ రాజ్యాంగం
1991లో ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన ఆర్థిక విధానం అనే ఒక విషపూరిత వైరస్ ఇంజెక్ట్ చేయబడింది. ఆనాటి నుండి అంబేడ్కర్ రాసిన సంక్షేమ రాజ్యాంగం పక్కకు పోయి.. అంబానీ అదానీల కోసం పునర్ లిఖించబడిన 'సరళీకరణ' రాజ్యాంగం అమలు కావడం మొదలయింది. ఆనాటి నుండి.. దేశంలోని కోట్లాది మంది శ్రామికులూ, సామాన్య జనం అనేక విధాలుగా బాధలు పడుతున్నారు. ధనిక వర్గాలకు లాభాలు కట్టబెట్టే పనులన్నీ మోడీ ప్రభుత్వం చకచకా చేస్తున్నది. కార్మిక హక్కులను హరించివేసే వేజ్ కోడ్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసుకున్నది. కార్మికులకు కనీస వేతనం దినసరి రూ. 670గా ఉండాల్సిందేనని ఆర్థికవేత్తల నివేదికలు తేల్చి చెప్పగా.. వాటినన్నిటినీ తోసిరాజని కనీస వేతనం రూ. 178గా నిర్ధారిస్తూ పార్లమెంటులోని పెద్దలందరూ చప్పట్లు కొట్టి చట్టం చేసేసారు. స్వయంగా కార్మిక మంత్రిత్వ శాఖ అంతర్గత నివేదిక సిఫారసు చేసిన రూ. 375 ప్రతిపాదనను సైతం ప్రభుత్వం నిస్సిగ్గుగా తిరస్కరించింది. కష్టజీవుల కడుపు కొట్టే ఈ చట్టాన్ని మేము ఒప్పుకోమంటూ.. కేవలం ఎనిమిది మంది ఎంపీలు మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు.
బంగారు బాతుల్ని ప్రైవేట్ పరం చేసి..
లాభాలు ఆర్జిస్తూ, సమర్ధవంతంగా పనిచేస్తున్న విశాఖ ఉక్కు, ఎల్ఐసీ, బ్యాంకులనూ ప్రైవేటు దొరలకు అప్ప జెప్పుతున్న మన నాయకులు.. వ్యాపారాలు నిర్వహించడం ప్రభుత్వాలు చేయాల్సిన పనికాదంటూ బుకాయిస్తున్నారు. బంగారు గుడ్లు అందించే బాతుల లాంటి ప్రభుత్వరంగ సంస్థలను నేడు ప్రైవేటు వాళ్లకి అప్పజెబితే.. రేపు ప్రజా సంక్షేమ పథకాలకు నిధులు ఎవరు అందిస్తారు? ప్రభుత్వ పెద్దలు అనునిత్యం వల్లెవేస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ అంటే అర్థం ఇదేనా? లక్షలాది మంది భారతీయలకు ఉపాధిని, రిజర్వేషన్ల సామాజిక న్యాయాన్ని అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల రూపంలో ఉన్న ఆధునిక దేవాలయాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం ఏ తరహా దేశభక్తి అవుతుంది.
చట్టాలు.. విదేశీ రాబందుల కోసమా?
కేంద్ర ప్రభుత్వ వినాశకర విధానాలని ప్రతిఘటించే ఉద్దేశంతో దేశంలోని కోట్లాది మంది కష్టజీవులు చేపడుతున్న దేశభక్తి యుత పోరాటమే.. నేటి సార్వత్రిక సమ్మె. గద్దె మీద కూర్చున్న నాయకులు తీసుకురావాల్సిన చట్టాలు.. చేపట్టాల్సిన చర్యలు.. ఈ దేశంలోని మెజారిటీ వర్గాల మేలు కోసం జరగాలి కానీ.. కొద్దిమంది కార్పొరేట్ ప్రభువుల కోసం, విదేశీ బహుళజాతి రాబందుల కోసం కానే కాదు అంటూ నిలదీస్తున్న శ్రమజీవుల సమర నినాదమే నేటి సమ్మె. సమ్మెల ద్వారా, నిరసనల ద్వారా పాలకుల మొద్దునిదుర వదులుతుందనుకుంటే.. అపోహ మాత్రమే. కార్మిక జనావళి చేపడుతున్న సమ్మె కార్యాచరణ.. దేశ ప్రజలందరి ఆలోచనా సరళిలో మార్పు తీసుకురావడానికి దోహదం కావాలి. అంబేడ్కర్ రచించిన సంక్షేమ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసే ప్రజానుకూల విధానాలకు పట్టం కట్టే దిశలో.. రావాల్సిన రాజకీయ మార్పుకి నేటి సమ్మె సరైన తోవ చూపాలి!
ఆర్. రాజేశమ్,
కన్వీనర్, సామాజిక న్యాయ వేదిక
94404 43183






