ఈ సినిమా.. సాహిత్యానుభూతికి నిదర్శనం!

by Ravi |   (  Updated:2025-12-13 01:15:36  IST  )

భారతీయ ప్రధాన స్రవంతి సినిమాకు సమాంతరంగా రూపొందిన భారతీయ కళాత్మక సినిమాకి ప్రత్యేకమైన రూపకర్తగా దర్శకుడు మనికౌల్ నిలబడ్డారు. ఆయన సినిమాలు కథ చెప్తాయి. కానీ సంప్రదాయ కథన పద్ధతిలో కాదు..

ఈ సినిమా.. సాహిత్యానుభూతికి నిదర్శనం!
X

భారతీయ ప్రధాన స్రవంతి సినిమాకు సమాంతరంగా రూపొందిన భారతీయ కళాత్మక సినిమాకి ప్రత్యేకమైన రూపకర్తగా దర్శకుడు మనికౌల్ నిలబడ్డారు. ఆయన సినిమాలు కథ చెప్తాయి. కానీ సంప్రదాయ కథన పద్ధతిలో కాదు.. మూల భావం, నిశ్శబ్దం, ధ్వనులు, స్వరాలు, వస్తువుల మధ్య సాగే మౌన సంభాషణల ద్వారా.. అందుకే ఆయన సినిమాల్లో కథకంటే అనుభవం ముఖ్యం.

ఆయన చిత్రాలు చూడడం అంటే కథను తెలుసుకోవడం కాదు.. ఒక కథానుభావాన్ని పులుముకోవడంలా ఉంటుంది. స్క్రీన్ మీద ఆయన ఫ్రేములు కవిత్వంలా ప్రవహిస్తాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కథను తెలుసుకోవడమే కాదు.. ఆలోచిస్తాడు, అనుభవిస్తాడు. కౌల్‌ది ఘర్షణలతో కూడిన, సాహసోపేతమైన దర్శక దృష్టి.

సినిమా కాదు.. కావ్యరూపం!

ప్రధాన స్రవంతి సినిమాల్లో తీవ్రమైన వేగవంతమైన కథనం, సంఘర్షణలు, మలుపులు సినీ పద్ధతులుగా ఉంటాయి. అయితే మనికౌల్ తన కెమెరా ఫ్రేమ్‌ను స్లో చేస్తాడు. నిశ్శబ్దాన్ని కథకుడిగా మారుస్తాడు. దృశ్యానికే ఒక రాగాన్ని ఇస్తాడు. దీనివల్ల ప్రేక్షకుడు పాత్రలతో పాటు సమయాన్ని కూడా పాటించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం భారతీయ సినిమాలో అరుదైనది. కౌల్ కవిత్వాన్ని సినిమా భాషగా మార్చాడు. మనికౌల్ దృష్టిలో సినిమా కేవలం కథ కాదు భాష, శబ్దం, రిథమ్, దృశ్యాలు అన్నీ ఒక కవిత లాంటివి. నిజానికి ఆయన సృష్టించిన సినిమా ఒక సాహిత్యా నుభూతి. కవిత్వం ఎలా విస్తరించుకుంటుందో ఆయన కెమెరా ఫ్రేములు కూడా అలాగే విస్తరిస్తాయి..

సామాన్య ప్రేక్షుకుడికి కష్టమే!

మనికౌల్ సినిమాల్లో పాత్రలు సరళ రేఖలపై నడవవు. వారి అంతర్ముఖత, దాని నిశ్శబ్దం, వారి భావధారలు మొ త్తంగా అవే కథ. సామాన్య ప్రేక్షకుడికి అది క్లిష్టతే. కానీ కళ ను లోతుగా ఆస్వాదించగల దృష్టికోణం ఉన్నవారికి అది వి ప్లవం. అలాంటి మనికౌల్ రూపొందించిన సినిమా నౌకర్ కా కమీజ్. హిందీ కవి రచయిత వినోద్ కుమార్ శుక్లా రా సిన కొన్ని కథలు నేను ఉంటున్న ఇంట్లో పక్క గదిలో నిద్రి స్తున్న నిశ్శబ్ద కథల్లా అనిపిస్తాయి. మౌనంగా వినిపిస్తా యి. గది కిటికీ అంచున కొట్టిన మొలకు తగిలేసిన పాత చొక్కా వేలాడుతున్నట్టుగా మాటలు పలకకుండా నా దగ్గరే ఉంటా యి. ఆయన రాసిన ‘నౌకర్ కి కమీజ్’ నవల కూడా అలాం టిదే. చదివినప్పుడల్లా, మా చిన్న ఇంటి ఆవరణలో ఎండలో ఆరేసిన బట్టలు గుర్తొస్తాయి. చల్లగాలి వీచినప్పుడల్లా వాటి నీడ కూడా కదిలేది, కేవలం బట్టలే కాదు, జీవితమూ కదిలేది.

అలంకారాలు లేని స్వచ్ఛ రచన..

వినోద్ కుమార్ శుక్లా తన రచనల్లో సాధారణ మనిషి జీవనాన్ని ఎలాంటి అదనపు అలంకారాలు లేకుండా రాస్తారు. శర్కర కలపని నీళ్లు ఎంత పారదర్శకమో అంత స్వచ్ఛంగా రచనలు చేసిన రచయిత ఆయన. ఆయన రచనల్లో ‘నౌకర్ కి కమీజ్’ అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ నవలలో కథ పెద్దదేమీ కాదు, అందులోని ఘట్టాలు వాస్తవ జీవితంలా నెమ్మదిగా ముందుకు సాగుతాయి. కానీ ఆ నెమ్మదితనంలోనే మనిషి జీవితపు భారం, నిరుపేద మధ్యతరగతి వర్గం వాళ్లు తమ గుండెల్లో మోయాల్సిన కఠినమైన అస్మితా పోరాటం దాగుంది. ఇందులో వినోద్ కుమార్ శుక్ల వాక్యాలు నెమ్మదిగా నడుస్తాయి. కథనం మా చిన్నప్పుడు మా వీధిలో సాయంత్రం సైకిల్ తొక్కే పాలవాడిలా ఎలాంటి హడావుడి లేకుండా సాగుతుంది. మనం చదివితే అది కేవలం చదవడం మాత్రమే కాదు.. మనసు లోపల ఎవరో నడుస్తున్న శబ్దం వింటాం.

గౌరవం తొలగించిన కమీజ్

కథ విషయానికి వస్తే, ఈ నవలలో సంతో అనే క్లర్క్ ఉంటాడు. తనది ఎంతో ఒత్తిడితో కూడిన ప్రభుత్వ ఉద్యోగం, తక్కువ జీతం. భార్యతో కలిసి భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కన్నా అవి కలలుగానే ఉంటాయి. ఒక రోజు సంతోకి తన యజమాని ఇంటి వద్ద పారిపోయిన ఒక నౌకర్ వదిలేసిన కమీజ్ కనిపిస్తుంది. అది తనకి సరిగ్గా సరిపోతుంది. ఆ కమీజ్ వేసుకోవడంతో అతని జీవితమే మారిపోతుంది. కాదు లోకం మార్చేస్తుంది.. ఆ కమీజు వేసుకున్న సంతో ని యజమాని నౌకరుగా గుర్తించి, అతన్ని అదే విధంగా వాడుకోవడం మొదలుపెడతాడు. సంతో వేసుకున్న ఆ నౌకర్ చొక్కా అతడిని యజమాని ఇంటి పనుల్లోకి నెట్టేసి తన గౌరవం వ్యక్తిత్వం కోల్పోవడానికి దారి తీస్తుంది.

చొక్కాపై సమాజ శాస్త్ర గ్రంథం..

ఈ కథలో మాటలు ఘాటుగా ఉండవు.. పెద్ద అరుపులు లేవు. నిశ్శబ్దం ఉంది. చిన్న చిన్న రోజువారీ సంఘటనల్లో పెద్ద సామాజిక అసమానతలు దాగి ఉంటాయి. చొక్కా మారితే మనం మారమేమో కానీ ప్రపంచం మాత్రం మన విలువని ఉనికిని మార్చేస్తుంది. శుక్లా ఈ నవల ద్వారా మధ్యతరగతి జీవితం ఎంత నిస్సహాయమో, గౌరవం కోసం చేసే పోరాటం ఎప్పుడు ఎంత భారంగా మారుతుందో నిగూఢంగా చూపించారు. తక్కువ జీతం, భారమైన ఆశలు, కదలని ప్రభుత్వ వ్యవస్థ ఇవన్నీ శుక్రా శైలి వల్ల మనకు సన్నివేశాల్లా కనిపిస్తాయి. ఈ కథ అధికారం, ఆర్థిక తేడాలు, దోపిడీ, ఇంకా మారని భారతీయ బ్యూరోక్రసీపై తీవ్రమైన విమర్శగా నిలుస్తుంది.

ఈ సినిమా అనుభవానికి అద్దం!

చివరికి, సంతో దంపతులు తమ దాస్య వ్యవస్థను తిర స్కరించి తమ గౌరవాన్ని తిరిగి సంపాదించుకోవడం ద్వారా కథ ప్రశాంతంగా ముగుస్తుంది. ‘నౌకర్ కి కమీజ్’ ఒక కథ కన్నా ఎక్కువగా ఒక చొక్కా మీద రాసిన సమాజ శాస్త్ర గ్రంథంగా చెప్పుకోవచ్చు.. మధ్యతరగతి మనిషి మనసులో దాచుకున్న బలహీనత, గౌరవం కోసం ఆ మనిషి చేసే అంతరంగ పోరాటం, మనిషి విలువను వస్త్రం, హోదా, వేతనం చూసి కొలిచే ప్రపంచానికి ఇది ప్రతిబింబం. నవల చదవడం ఒక అనుభవం అయితే దాని ఆధారంగా మని కౌల్ తీసిన సినిమా చూడడం ఆ అనుభవానికి అద్దం.

-వారాల ఆనంద్

94405 01281

Next Story