- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇది గవాయ్‌పై దాడి కాదు.. భారత న్యాయ వ్యవస్థ గౌరవంపై దాడి!
భారతదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, నిష్పాక్షికత రాజ్యాంగ మౌలిక సూత్రాలలో ఒకటి. భారత అత్యున్నత న్యాయస్థానంలో కొన్ని రోజుల క్రితం

భారతదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, నిష్పాక్షికత రాజ్యాంగ మౌలిక సూత్రాలలో ఒకటి. భారత అత్యున్నత న్యాయస్థానంలో కొన్ని రోజుల క్రితం చోటు చేసుకున్న అమానవీయ సంఘటన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కలచి వేసింది. అత్యున్నత న్యాయమూర్తిపై న్యాయవాది షూ విసిరేందుకు ప్రయత్నించడం కేవలం ఒక వ్యక్తిగత దుస్సాహసం మాత్రమే కాదు. ఇది భారత న్యాయ వ్యవస్థ సంస్థాగత అధికారంపై జరిగిన అత్యంత అసాధారణ దాడి.
ఈ చర్య న్యాయపరమైన ధిక్కారం స్థాయిని దాటి, రాజ్యాంగ సమగ్ర స్ఫూర్తిని ధ్వంసం చేసే ప్రేరేపిత ప్రయత్నం గా కనిపిస్తుంది. దేశంలోని ప్రతి పౌరుడు, ఈ దారుణ చర్యను సీజేఐ గవాయిపై జరిగిన దాడిగా కాకుండా, భారత న్యాయ వ్యవస్థ సంస్థాగత సమగ్రతపై జరిగిన భయంకరమైన దాడిగా న్యాయ కోవిదులు భావిస్తున్నారు.
కోర్టులో ఘర్షణలు కొత్తేమీ కాదు..
గత భారత ప్రధాన న్యాయమూర్తి డీ.వై. చంద్రచూడ్ కోర్టులో క్రమశిక్షణ, గౌరవం విషయంలో ఎటువంటి రాజీ పడలేదు. కోర్టు పద్ధతులను ధిక్కరించే వారిపై ఆయన చూపిన ఆగ్రహం చాలాసార్లు వ్యక్తమైంది. 2023లో అప్పటి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడి బెదిరింపు ధోరణిని తిప్పికొట్టారు. ప్రధాన న్యాయమూర్తిని బెదిరించొద్దు, నా కోర్టు నుంచి వెళ్లిపోండి అంటూ సీజేఐ గట్టిగా హెచ్చరించారు. పలు సందర్భాల్లో కోర్టును బెదిరించే ప్రయత్నం చేసిన వారిని బయటకు పంపేందుకు ఆదేశించారు. పూర్వ సీజేఐ చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న చర్యలు అప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందలేదు కానీ ఇప్పటి సందర్భం, వాదన, ప్రధాన న్యాయమూర్తిపైనే దాడి ఘటన వేరు.
సీజేఐపై అసాధారణ దాడి
సుప్రీంకోర్టులోని ప్రధాన న్యాయస్థానం ప్రాంగణంలో, కోర్టు కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో న్యాయమూర్తిని భౌతికంగా అవమానించడానికి ప్రయత్నించడం అనేది న్యాయ వ్యవస్థ పవిత్రతకు భంగం కలిగించే దారుణ చర్య. అత్యున్నత న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని, మతపరమైన నినాదం చేస్తూ దాడికి ప్రయత్నించడం, ఉద్దేశ పూర్వకంగా చేసినట్లు ఉంది. ఈ చర్యపై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) తక్షణమే స్పందించి, దీనిని న్యాయ స్వాతంత్ర్యంపై ప్రత్యక్ష దాడిగా తీవ్రంగా ఖండించింది. అయితే ఈ దాడి కేవలం సీజేఐ వ్యక్తిగత భద్రతకు సంబంధించిన విషయం కాదు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీయడానికి, న్యాయమూర్తులు బెదిరింపులకు లోనవుతారనే సందేశాన్ని పంపడానికి ఈ చర్య ఉద్దేశించబడింది. న్యాయమూర్తులపై గౌరవం అనేది వారి వ్యక్తిగత అహంకారం కోసం కాదు.
రాజ్యాంగ నైతికతపై దాడి!
న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా, నిర్భయంగా పనిచేయడానికి అది ప్రాథమిక అవసరం. ఈ దాడి సంస్థాగత గౌరవాన్ని కూలదోయడం ద్వారా న్యాయ నిర్ణయ ప్రక్రియను ప్రభావితం చేయాలనే అపసవ్య ధోరణిని సూచిస్తుంది. మత రాజకీయాల ద్వారా రాజ్యాంగ సంస్థలను భయపెట్టాలని, న్యాయ వ్యవస్థను మెజారిటీ భావజాలానికి లొంగదీసుకోవాలని ప్రయత్నించే ఒక ప్రమాదకరమైన రాజకీయ ఎజెండాలో ఈ చర్య భాగం. ఈ చర్య రాజ్యాంగ నైతికత స్థానంలో 'మెజారిటీ నైతికత'ను ప్రతిక్షేపించడానికి చేసిన ప్రయత్నంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. సుప్రీంకోర్టు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలుగన్న సామాజిక విప్లవ పత్రంగా పరిగణించబడుతున్న నేపథ్యంలో, ఒక న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకోవడం అనేది, న్యాయ వ్యవస్థను సమాజంలోని అణగారిన వర్గాల రక్షణ బాధ్యత నుండి నిరోధించడానికి చేసే ప్రయత్నమని న్యాయ నిపుణుల వాదన. రాజ్యాంగ 'సమానత్వ సూత్రం' అలాగే 'సామాజిక, ఆర్థిక న్యాయం' అనే భావనలను దెబ్బతీయాలని చూసే ప్రమాదకర ధోరణి ఇది.
భౌతిక బెదిరింపుల నుండి కాపాడేది ఎలా?
న్యాయ స్వాతంత్ర్యం అనేది ప్రజాస్వామ్యానికి ఆధారం. ప్రతి పౌరునికి న్యాయమైన విచారణకు ప్రాథమిక హామీ. ఈ స్వాతంత్ర్యం రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడింది. భారత న్యాయ వ్యవస్థ అజేయతకు ప్రధాన ఆధారం మూల నిర్మాణం సిద్ధాంతం. ఈ సిద్ధాంతం కార్యనిర్వాహక, శాసన జోక్యం నుండి న్యాయ వ్యవస్థను కాపాడినప్పటికీ, ఈ దాడి, అంతర్గత లేదా సామాజిక-రాజకీయ శక్తుల నుండి వచ్చే భౌతిక బెదిరింపుల నుండి సంస్థాగత రక్షణ గోడలు ఎంత బలంగా ఉండాలో మరోసారి నిరూపించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగపు అంతిమ సంరక్షణ కేంద్రం. ఇది ఆర్టికల్ 142 ద్వారా సంపూర్ణ న్యాయం అందించడానికి అపారమైన అధికారాన్ని కలిగి ఉంది. న్యాయమూర్తులను బెదిరించడం, దాడి చేయడం న్యాయవాద వృత్తి అత్యున్నత ప్రమాణాలకు విరుద్ధం. దాడికి పాల్పడిన వ్యక్తి న్యాయవాది కావడంతో, న్యాయవ్యవస్థ సమగ్రతను పరిరక్షించడంలో బార్ కౌన్సిల్ బాధ్యత మరింత పెరిగింది.
వ్యవస్థ బలహీనపడలేదని నిరూపించి..
ఈ తీవ్రమైన రెచ్చగొట్టే చర్యకు గురైనప్పటికీ, ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ప్రదర్శించిన శాంతమైన సంయమనం, ఆదర్శప్రాయమైన నిగ్రహం వ్యవస్థాగత పరిపక్వతకు నిదర్శనం. తన విధులను గౌరవంగా కొనసాగించడం ద్వారా, వ్యవస్థ బలహీనపడలేదని, సంస్థాగత ధైర్యం చెక్కు చెదరలేదని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ దాడి భారత న్యాయ వ్యవస్థ ప్రతిఘటన శక్తిని పరీక్షించింది తప్ప, దాని స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేకపోయింది. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువల పరిరక్షణకు న్యాయవ్యవస్థ ధైర్యం గా తన బాధ్యతలను నిర్వర్తించాలని దేశం కోరుకుంటుంది.
-డా. కట్కూరి
సైబర్ సెక్యూరిటీ న్యాయ నిపుణుడు






