- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది వెన్నుపోటు కాదు.. చీకటి అధ్యాయానికి ముగింపు దినం!
వైసీపీ అధినేత జగన్ జూన్ 4ని వెన్నుపోటు దినంగా పిలుపునివ్వడం చూస్తే, ఆయనకు ఓటు వేయని ప్రజలే ఆయనకు వెన్నుపోటు పొడిచారన్న

వైసీపీ అధినేత జగన్ జూన్ 4ని వెన్నుపోటు దినంగా పిలుపునివ్వడం చూస్తే, ఆయనకు ఓటు వేయని ప్రజలే ఆయనకు వెన్నుపోటు పొడిచారన్న అర్థం వస్తోంది. తన పాలనను ప్రజలు తిరస్కరించడాన్ని వెన్నుపోటుగా చిత్రించి ప్రజలనే దోషులుగా చిత్రించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. నిజానికి జూన్ 4 భారత ప్రజాస్వామ్యంలో మరో చీకటి అధ్యాయానికి ముగింపు పలికిన దినం. ప్రజల చేతుల్లో ఉన్న ఓటు శక్తి, పాలకుల పట్ల సమీక్ష హక్కు ఎంత బలంగా పనిచేస్తుందో మరోసారి నిరూపితమైన దినం.
జూన్ 4 వ తేదీన తన పరాజయాన్ని జగన్ వెన్నుపోటు దినంగా చిత్రించడం అంటే ప్రజలను నేరం చేసిన వారి దృష్టితో చూడటమే. ప్రజలు వెన్నుపోటు పొడవలేదు. నమ్మి అధికారం ఇస్తే ఆయనే ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. జూన్ 4 ప్రజాస్వామ్యం విజయం సాధించిన రోజు అని చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. మంచి పాలకులను ఎన్నుకొనే స్వేచ్ఛ ప్రజలకే ఉంది. ప్రజలు 2019లో జగన్ పార్టీకి 151 సీట్లు ఇచ్చారు అది వారి నమ్మకం. అదే ప్రజలు 2024లో అత్యధిక స్థానాలను తెలుగుదేశం కూటమికి ఇచ్చారు. అది వారి నిరాశకు ప్రతిఫలనం.
అరాచకానికి పాతరేసిన దినం
ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు దైవోపదేశం లాంటిది. తను ఓటమి చెందితే అది ప్రజల వ్యతిరేకత కాదు, ప్రజలను వంచించిన పాలనకు చెల్లించిన తగిన మూల్యం. జగన్ పాపాలను అవినీతిని, అరాచకాన్ని పాతరేసిన దినం. రాజధాని లేకుండా, పరిశ్రమలు, ఉద్యోగాలు లేకుండా, ప్రాజెక్టులు లేకుండా, అభివృద్ధి నిలిపి వేసిన పాలనను ప్రజలు తిరస్కరించిన దినం ఆ రోజు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన పాలకులకు చరమ గీతం పాడిన దినం. అసమర్థులను, అరాచకులను ఓడించి ప్రజలు ఇచ్చిన అద్భుత తీర్పు నిజమైన ఓదార్పు.. మరి ఇక్కడ వెన్నుపోటు ఏమిటి? అది ప్రజల అభిప్రాయం, అనుభవం ఆధారంగా ఇచ్చిన తీర్పు మాత్రమే.
ఈ జగన్నాటకాలు దేనికి?
ఏ పార్టీనైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు దగ్గరయే సరికొత్త కార్యక్రమాలు చెయ్యాలి. తప్ప జగన్నాటకాలు ఆడటం ఏమిటి? ఓటమికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ప్రజలే వెన్నుపోటు పొడిచారని ప్రచారం చేస్తూ ప్రజల తీర్పును అపహాస్యం చేయడం దురదృష్టకరం. ప్రజలు ఎప్పుడూ విజ్ఞతతో, అనుభవంతో ఓటు వేస్తారు. పాలకులు ప్రజలను ఒకసారి మాత్రమే మోసం చేయవచ్చు కానీ పదేపదే మోసం చేయడం సాధ్యం కాదు. నిజానికి ప్రజలు వెన్నుపోటు పొడవలేదు.. జగన్ పాలనపై నమ్మకం పోయింది. ప్రజల తీర్పును వెన్నుపోటుగా చూపడం జగన్ ముఠా అజ్ఞానానికి, అహంకారానికి నిదర్శనం. జగన్‌కి మళ్ళీ అధికారం ఇస్తే జరిగే పరిణామాలు ఏమిటో జనం తెలుసుకొని విజ్ఞత ప్రదర్శించి విపత్తు నివారించుకొన్నారు. రాష్ట్రంలో ప్రజల అభిమతం ఎలా పనిచేస్తుందో, పాలన మీద ప్రజల విజ్ఞత ఎలా పని చేస్తుందో నిరూపించిన దినం జూన్ 4. ఆయన ఎందుకు ప్రజలు తన పాలనపై ఆశ వదిలేసుకొన్నారో అర్థం చేసుకొని, ప్రజాస్వామ్య తీర్పును గౌరవించటం నిజమైన ప్రజా స్వామ్యం. జగన్ ఈ మార్గంలో ఆలోచించాలి.
11 సీట్లు మిగిలాయ్
అధికార మదంతో ధర్మాన్ని విస్మరించి అధర్మ పరిపాలన చేసిన జగన్ పై జనాగ్రహం కట్టలు తెంచుకుంది. గత ఎన్నికల్లో 151 సీట్లు ఒక్క వైసీపీనే గెలుచుకుంది. అయిదు ఏళ్ళు గడిచే సరికి మధ్యన ఉన్న అయిదు అదృశ్యమై 11 సీట్లు మాత్రమే మిగిలాయి. యువత, రైతులు, ఉద్యోగులు, మహిళలు, విద్యావంతులు, వ్యాపారులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు అవినీతి, అసమర్థ పాలనను చరమగీతం పాడారు. ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ మొత్తం అన్ని ప్రాంతాల్లో ఒకే విధమైన విజయాన్ని కూటమి సాధించింది. ఆయన మంత్రి వర్గంలో ఉన్న 26 మంది మంత్రులలో 24 మంది ఘోర పరాజయం పాలయ్యారు. పాత 13 జిల్లాల్లో 8 జిల్లాలలో వైసీపీకి ఒక్క సీటూ కూడా దక్కలేదు.
తమ తీర్పును తిరగరాసిన జనం
గత ఎన్నికల ప్రచారంలో తనకు తాను అపర దాన కర్ణుడిగా బిరుదు తగిలించుకొని ఊరేగినా జగన్ నిజ స్వరూపాన్ని జనం తెలుసుకున్నారు. 2019లో ఇచ్చిన తీర్పును 2024లో తిరగరాశారు. పాలకులు ఎలా ఉండకూడదో తమ తీర్పు ద్వారా రుజువు చేశారు. ఎలాంటి వారు ముఖ్యమంత్రి అవకూడదో ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. శాసనసభను కౌరవ సభగా మార్చి తనను తీవ్రంగా అవమానించిన సభలోకి మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని చంద్రబాబు చేసిన శపథంలోని ధర్మా గ్రహాన్ని ప్రజలు అర్థం చేసుకొని చంద్రబాబుని మళ్లీ ముఖ్యమంత్రిని చేశారు. అయిదు కోట్ల ఆంధ్రులు అందించిన అద్భుత విజయం అది. ఓటర్లు సృష్టించిన ఆ నిశ్శబ్ద విప్లవంలో ప్రజలు గెలిచారు, రాష్ట్రం నిలబడింది.
నీరుకొండ ప్రసాద్
98496 25610






