అభ్యర్థుల మేనిఫెస్టో లేనప్పుడు.. ఓటర్‌గా ఇదే నా మేనిఫెస్టో!

by Bhoopathi Nagaiah |

డిసెంబర్ 28న జరగనున్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల నేపథ్యంలో గత వారం రోజులుగా ఫోన్ మెసేజ్‌లు, కాల్స్, వాయిస్ రికార్డింగ్స్ వరదలా వస్తున్నాయి.

అభ్యర్థుల మేనిఫెస్టో లేనప్పుడు.. ఓటర్‌గా ఇదే నా మేనిఫెస్టో!
X

డిసెంబర్ 28న జరగనున్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల నేపథ్యంలో గత వారం రోజులుగా ఫోన్ మెసేజ్‌లు, కాల్స్, వాయిస్ రికార్డింగ్స్ వరదలా వస్తున్నాయి. ఓటు వేయమని విజ్ఞప్తులు, ఆత్మీయ విందులు, కాక్‌టెయిల్ డిన్నర్ పార్టీల ఆహ్వానాలు వాట్సాప్‌లో తిరుగుతున్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ, ఈ ఆహ్వానాలతో పాటు ఎన్నికలు గెలిచిన తర్వాత సభ్యుల కోసం ఏం చేయబోతున్నారో తెలిపే హామీల మేనిఫెస్టో కూడా పంపిస్తే బాగుండేదన్నది నా అభిప్రాయం.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో హై బడ్జెట్ సినిమాలు తీసే వారు మాత్రమే కాకుండా, ప్రస్తుతం సినిమా తీయడమే భారంగా మారిన లో-బడ్జెట్ నిర్మాతలు కూడా పోటీ పడతారు. కొందరు తమ వ్యాపారాల రక్షణ కోసం, మరికొందరు నిజమైన మార్పు తేవాలనే ఆశతో ముందుకొస్తారు. ఎదిగిన వారంటే నాకు అభిమానమే. కానీ వారు గతంలో పొందిన ప్రభుత్వ సహాయాలు, ప్రోత్సాహకాలు ఈ తరం లో-బడ్జెట్ నిర్మాతలకు కూడా అందేలా కృషి చేస్తే వారే నిజమైన ఆదర్శాలు అవుతారు.

ఎన్నికల తర్వాత జరిగేదేంటంటే..!

నేను 2002 నుంచి ఛాంబర్ సభ్యుణ్ణి. ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. ఉద్దేశాలు మారుతున్నట్టు కనిపించినా, ఫలితాలు మాత్రం యథావిధిగానే ఉంటున్నాయి. ఎన్నికల తర్వాత కనిపించేది ప్రభుత్వంతో పైరవీలు చేసి బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు జీఓలు తెచ్చుకోవడమే. కానీ లో-బడ్జెట్ సినిమాల నిర్మాణం, విడుదల, పంపిణీకి సంబంధించి ఎలాంటి స్పష్టమైన ప్రణాళికలు కనిపించవు.

ప్రకటనలకే పరిమితమైతే...

నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూడియో యజమానుల సమాఖ్య అయిన ఫిల్మ్ ఛాంబర్ ప్రధానంగా రిజిస్ట్రేషన్లు, పబ్లిసిటీ క్లియరెన్స్, వివాదాల పరిష్కారం, పైరసీ నియంత్రణ వరకే పరిమితమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించే ఈ సంస్థ నిజంగా కోరుకుంటే పరిశ్రమ అభివృద్ధికి, ముఖ్యంగా లో-బడ్జెట్ సినిమాలకు గొప్ప దోహదం చేయగలదు. కానీ ప్రభుత్వ పెద్దలను కలిసిన ప్రతిసారి “గ్లోబల్ ఇండస్ట్రీ”, “ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ” వంటి ప్రకటనలకే పరిమితం అవుతోంది. తప్ప ఇప్పుడు ఇక్కడ నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్ లకు ఉన్న సమస్యలపై ఏనాడూ ప్రభుత్వంతో ఎందుకు చర్చించరు? టికెట్ రేట్ల పెంచుడు పై ఉన్న శ్రద్ధ సినిమా నిర్మాణానికి, ఇబ్బంది లేకుండా విడుదల అవ్వడానికి, మూడంచెల వ్యవస్థ అభివృద్ధి చెందడానికి, సమస్యల పరిష్కారాలపై ఎందుకు ఉండదు?

లో-బడ్జెట్ సినిమాలను బతికించాలి..

ఫిల్మ్ ఛాంబర్ లైఫ్ మెంబర్‌గా, వోటర్‌గా నేను కొన్ని స్పష్టమైన ప్రతిపాదనలు ముందుంచుతున్నాను — ఇవన్నీ లో-బడ్జెట్ సినిమాల కోసం మాత్రమే. డిజిటల్ స్క్రీనింగ్ ఛార్జీలు తగ్గించాలి; మల్టీప్లెక్స్‌ల్లో కనీస 2 ప్రైమ్ షోలు ఇవ్వాలి; సెన్సార్ డేట్ ఆధారంగా విడుదల క్యూ సిస్టం అమలు చేయాలి; బుక్ మై షో ద్వారా వచ్చే ఆదాయంలో ఛాంబర్‌కు వాటా తీసుకుని సభ్యుల సంక్షేమానికి వినియోగించాలి; లొకేషన్ ఫీజులు తగ్గించాలి; సెన్సార్ (CCAD) నిబంధనల వల్ల పెరుగుతున్న ఖర్చును తగ్గించేలా కేంద్రానికి సిఫారసులు చేయాలి;

హామీ ఇచ్చేవారికే నా ఓటు

ప్రతి సినిమాకు ఉచిత ప్రెస్ మీట్, ప్రివ్యూ అవకాశం ఇవ్వాలి. ఇవి అమలైతే, నిర్మాణం పెరుగుతుంది. నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు, ఛాంబర్‌కే ఆదాయం పెరుగుతుంది. ఎన్నికల్లో గెలిచే పదవులకు అర్థం వస్తుంది. ఈ ప్రతిపాదనలకు స్పందించి, హామీ ఇచ్చే వారికే నా ఓటు, నా సపోర్టు.

-సయ్యద్ రఫీ, దర్శక-నిర్మాత

[email protected]

Next Story