- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లమల అడవిలో దాహార్తి
నల్లమల అడవులు.. దక్షిణ భారతదేశానికి ఊపిరితిత్తు ల్లాంటివి. జీవ వైవిధ్యానికి నిలయంగా, అరుదైన వృక్షజాలం, జంతుజాలానికి ఆశ్రయంగా నిలిచిన ఈ అరణ్యం నేడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

నల్లమల అడవులు.. దక్షిణ భారతదేశానికి ఊపిరితిత్తు ల్లాంటివి. జీవ వైవిధ్యానికి నిలయంగా, అరుదైన వృక్షజాలం, జంతుజాలానికి ఆశ్రయంగా నిలిచిన ఈ అరణ్యం నేడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అడవిలోని సహజ నీటి వనరులు పూర్తిగా ఎండిపోయాయి. ఫలితంగా అక్కడ నివసిస్తున్న అడవి జంతువులు తాగునీరు లేక తీవ్రంగా అలమటిస్తున్నాయి. ఇది కేవలం ప్రకృతి విపత్తు మాత్రమే కాదు.. పాలనా వైఫల్యానికి స్పష్టమైన ప్రతిబింబం కూడా.. నల్లమల అడవులు మనవి కావు... మనం నల్లమల అడవుల వాళ్లం. అక్కడి జంతువుల దాహం తీర్చడం అంటే ప్రకృతితో మన బాధ్యతను నెరవేర్చడమే. ప్రభుత్వం తక్షణమే సమగ్ర కార్యాచరణ ప్రకటించి అమలు చేయాలి. లేదంటే, మౌనంగా చూస్తూ ఉండే ఈ పాలనపై ప్రజల ప్రశ్నలు మరింత ఘాటుగా మారడం ఖాయం.
జంతువులు గ్రామాల్లోకి వస్తే...
నల్లమల ప్రాంతంలో సాధారణంగా చెరువులు, వాగులు, గుంతలు వంటి సహజ నీటి వనరులు వేసవి కాలంలోనూ కొంతవరకు జంతువులకు ఉపశమనంగా ఉండేవి. కానీ ఈ ఏడాది వర్షాలు పెద్దగా పడకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అడవిలోని జంతువులు దాహార్తితో అడవుల నుంచి బయటకు రావడం, గ్రామాల సమీపానికి చేరడం, ప్రమాదాలకు గురవడం వంటి సంఘటనలు పెరుగుతున్నాయి. ఇది జంతువులకు మాత్రమే కాదు, మనుషులకు కూడా ప్రమాదకరమైన పరిణామమే.
అక్కడక్కడా నీటి తొట్టెలు..
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అటవీ శాఖ, పర్యావరణ శాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. కానీ వాస్తవంలో చూస్తే.. పరిస్థితిపై ప్రభుత్వ స్పందన చాలా మందగించింది. కొద్ది ప్రాంతాల్లో తాత్కాలికంగా నీటి తొట్లలు ఏర్పాటు చేసినా, అవి సరిపోవడం లేదు. విస్తా రమైన నల్లమల అడవులకు ఇవి చుక్కల్లో మునకలే.
జంతువులకు తాగునీరు దయాదాక్షిణ్యమా?
అడవి జంతువులకు తాగునీరు అందించడం ప్రభుత్వానికి దయాదాక్షిణ్యం కాదు.. అది రాజ్యాంగ బాధ్యత. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ అనేవి కేవలం ప్రకటనలకే పరి మితం కావద్దు. ఎండాకాలం ప్రారంభమయ్యే ముందే అడవుల్లో నీటి లభ్యతపై ప్రణాళిక ఉండాలి. బోరు బావుల ద్వారా సోలార్ మోటార్లతో నీటిని తొట్లకు పంపించడం, పాత చెరువులు, వాగులను పునరుద్ధరించడం, వర్షపు నీటి నిల్వకు శాశ్వత ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు ఇప్పటికైనా చేపట్టాల్సిందే.
అడవులు అంతరిస్తే కలిగే నష్టం..
అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నీటి వనరుల స్థితిని పర్య వేక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం కూడా సాధ్యమే. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులుగా ప్రభుత్వం భావిస్తే.. అడవులు నశించిన తర్వాత చెల్లించాల్సిన మూల్యం మరింత ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి. అధికారులు కూడా ఫైళ్లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేయాలి. ‘వర్షాలు వస్తే చూసుకుందాం’ అనే నిర్లక్ష్య ధోరణి వదిలేయాలి. ప్రకృతి మన హెచ్చరికలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఇప్పటికైనా మేల్కొనకపోతే, రేపు ఎదురయ్యే పర్యావరణ విపత్తులకు మనమే బాధ్యులం.
అడవులు మనవి కావు..
నల్లమల అడవులు మనవి కావు... మనం నల్లమల అడవుల వాళ్లం. అక్కడి జంతువుల దాహం తీర్చడం అంటే ప్రకృతితో మన బాధ్యతను నెరవేర్చడమే.. ప్రభుత్వం తక్షణమే సమగ్ర కార్యాచరణ ప్రకటించి అమలు చేయాలి. లేదంటే, మౌనంగా చూస్తూ ఉండే ఈ పాలనపై ప్రజల ప్రశ్నలు మరింత ఘాటుగా మారడం ఖాయం.
-కె బాపురావు,
95533 07006






