ప్రపంచీకరణే వరం అన్నట్టు ప్రచారం చేశారు.. ఇప్పుడంతా తారుమారు..

by Ravi |   (  Updated:2025-09-14 01:15:18  IST  )

ట్రంప్ ఆగస్టులో విధించిన దుర్మార్గమైన 50 శాతం సుంకం భారతదేశ పారిశ్రామిక రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎగుమతులు

ప్రపంచీకరణే వరం అన్నట్టు ప్రచారం చేశారు.. ఇప్పుడంతా  తారుమారు..
X

ట్రంప్ ఆగస్టులో విధించిన దుర్మార్గమైన 50 శాతం సుంకం భారతదేశ పారిశ్రామిక రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎగుమతులు ఎక్కడికక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఎగుమతుల కోసం సిద్ధంగా ఉన్న సరుకులు ఇంత భారీ టారిఫ్ భరించలేక సగం ప్యాకింగ్ స్టేజిలోనే ఉన్నాయి. ఊహించరాని ఈ మలుపుకి ఎగుమతుల మీద ఆధారపడ్డ పరిశ్రమలన్నీ కూడా తారుమారు అయిపోయాయి. తమ నష్టాలను చూసుకుంటూ విస్మయం చెందుతున్నాయి. భవిష్యత్తులో ఏ రకమైన ప్రణాళిక వేయాల్సి ఉందో అర్థం కాక పరిశ్రమలు తికమక పడుతున్నాయి.

రష్యా నుండి భారతదేశం చమురు కొనడం వలన అందుకు శిక్షగా అమెరికా అత్యంత భారీ స్థాయిలో ఈ సుంకం విధించి విభిన్న రకాల పరిశ్రమలకూ, అందులో పనిచేసే కార్మిక వర్గానికి బలమైన దెబ్బ కొట్టినట్టు అనిపిస్తుంది. రష్యా నుండి చవకగా కొన్న చమురు ఏ కార్పొరేట్లకు ఎలా ప్రయోజనం కలిగిస్తుందో ప్రస్తుతం అర్థం కావడం లేదు. కానీ ఎగుమతుల మీద ఆధారపడ్డ పరిశ్రమలలో పనిచేసే శ్రామిక వర్గం మాత్రం మరింత కష్టాల్లోకి పయనిస్తుందనేది మాత్రం అర్థం అవుతుంది.

లెక్కల్ని తారుమారు చేస్తున్న 'సుంకం'

ప్రపంచీకరణ ఫలితంగా ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు గణనీయంగా తగ్గిపోయాయి. తక్కువ జీతాలకు ఇతర ప్రైవేటు రంగాల్లో సర్దుకున్న కార్మిక వర్గం కాస్తంత ఊపిరి పీల్చుకుంటూ ఉంటే హఠాత్తుగా తుఫానులా వచ్చిన ఈ సుంకం మొత్తం లెక్కల్ని తారుమారు చేస్తోంది. తమిళనాడులోని కోయంబత్తూర్, తిరుపూర్ లాంటి ప్రాంతాలు గార్మెంట్ పరిశ్రమకు గిరాకీ ఉన్న ప్రాంతాలు.. ఇక్కడ తయారయ్యే గార్మెంట్స్ అధిక భాగం అమెరికాకు ఎగుమతి అవుతాయి. పది సంవత్సరాల నుండి ఇదే సిలబస్. దాదాపు రెండు లక్షల మంది కార్మికులు ఈ పరిశ్రమల మీద ఆధారపడి ఉన్నారు. మరో రెండు లక్షల మంది పరోక్షంగా ఈ పరిశ్రమల మీద ఆధారపడి ఉన్నారు. వీరి కుటుంబాలను కూడా లెక్కపెట్టి చూసుకుంటే అవి మరికొన్ని లక్షలకు పయనిస్తాయి. ఈ పరిశ్రమల మీద తమిళనాడులోని కార్మికులు మాత్రమే ఆధారపడి ఉండలేదు. దేశం లోని వివిధ ప్రాంతాల వివిధ రాష్ట్రాల్లోని ఎంతో మంది ఈ పరిశ్రమల మీద ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇది ఒక్క గార్మెంట్ పరిశ్రమ పరిస్థితి. ఇలా చాలా పరిశ్రమల మీద ఈ అమెరికా సుంకం బలమైన ప్రభావం కలిగించింది.

వేలాది కార్మికుల జీవన ధ్వంసం..

అమెరికా ఎగుమతుల మీద విభిన్న పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. వాటి టర్నోవర్ వందల వేల కోట్ల రూపాయలు ఉంటాయి. ఇటీవలి ఓ ఆంగ్ల పత్రిక రిపోర్ట్ ప్రకారం, ఇంజినీరింగ్ గూడ్స్ 1.8 లక్షల కోట్ల రూపాయలు, టెక్స్ టైల్స్ 95,040 కోట్ల రూపాయలు, జెమ్స్ జ్యువెలరీ 88 వేల కోట్లు, ఆటో కంపోనెంట్స్ 58 వేల 100 కోట్లు, కెమికల్స్ 61 వేల 600 కోట్లు, వ్యవసాయ ఉత్పత్తులు 52 వేల 800 కోట్లు, కేరళలోని సీ ఫుడ్ 24 వేల 640 కోట్లు, హ్యాండ్ క్రాఫ్ట్, ఫర్నిచర్ 19 వేల 800 కోట్లు, లెదర్ 10 వేల 560 కోట్లు, టాయ్స్ 695 కోట్లు వ్యాపారం అమెరికాకు ఎగుమతుల మీద ఆధారపడి ఉంది. ఇంత భారీ స్థాయిలో అమెరికా టారిఫ్ విధించడం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన పారిశ్రామిక రంగం ప్రభావితం అవుతోంది. ఈ రంగం మాత్రమే కాదు. ఇందులో పనిచేసే వేల కొలది శ్రామికులు ప్రభావితమవుతున్నారు. జెమ్స్ జ్యూవలరీకి అమెరికా చాలా పెద్ద మార్కెట్. ఏడాదికి 88 వేల కోట్ల రూపాయల విలువైన సరుకు లు అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఈ కొత్త టారిఫ్‌తో ఈ రంగం కూడా భారీగా దెబ్బ తినబోతోంది. 95 వేల 040 కోట్ల రూపాయల ఆదాయం అందించే 30 శాతం టెక్స్ టైల్స్, అపారెల్స్ అమెరికా వైపు పయనిస్తాయి. ట్రంప్ దెబ్బతో ఈ రంగం కూడా అతలాకుతలం కాబోతోంది.

ప్రపంచీకరణ భ్రమల్లో ముంచెత్తి..

ప్రపంచీకరణ అనేది ఒక వరమనీ, భారత ప్రభుత్వం తన తలుపులు తెరుచుకుంటే వివిధ రంగాలు గణనీయంగా అభివృద్ధి చెంది భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల స్థానంలో నిల్చుంటుందని గతంలో భ్రమ లు కలిగించారు. ప్రపంచీకరణ నేపథ్యంలోనే దేశం తలుపులు 1990 నుండి తెరిచేసింది. ఇక అంతర్జాతీయ పెట్టుబడులకు పుల్ స్టాప్ లేదు. ఎన్నో రకాల పరిశ్రమలు ఎగుమతుల మీద ఆధారపడడం జరిగింది. మనదేశంలోని ఉత్పత్తులు మనదేశంలోనే ఉండిపోతే అభివృద్ధి ఎలా అవుతుంది? అని గతంలో నమ్మించారు. ఎగుమతుల కోసం కూడా ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయి. మరి ఈ రోజు ఇదే అమెరికా ఒక్క వేటుతో ఎగుమతులను మొత్తం ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమైన విషయం.

తిమింగలాలు మరింతగా బలుస్తాయి..

ఇలా చాలా తెలివిగా ట్రంప్ కొట్టిన దెబ్బ ఊహించరానిది. అంతర్జాతీయ పెట్టుబడుల మధ్య ఎల్లప్పుడూ కూడా సాధారణ దేశాలు నలిగిపోతాయి. ఇక్కడ ట్రంప్ అనే వ్యక్తి ఒక వ్యక్తి మాత్రమే. అతని వెనుక ఉన్నది ఒక పెద్ద సామ్రాజ్యవాద వ్యవస్థ. చమురు కోసం దేశాల్లో యుద్ధాలనే ప్రకటించేసే అమెరికా.. ఇరాక్ లాంటి దేశాలను సర్వనాశనం చేసే అమెరికా, దేశాల అధ్యక్షులనే మార్పించేసే సత్తా ఉన్న అమెరికాకు చైనా, రష్యా లాంటి దేశాలు తమకు ధీటుగా నిల్చోవడం నచ్చదు. చిన్న చేపల్ని పెద్ద చేపలు తినేసే ఈ వ్యవస్థలో ఎల్లప్పుడూ నలిగిపోయేది సాధారణ ప్రజలూ, సాధారణ కార్మికులే. సాధారణ దేశాలే. బలపడేది పెద్ద చేపలు. అవి మరింత పెద్దవై, మరింత విశాలమైపోతాయి. మరింత బలం పుంజుకొని దోపిడీకి సిద్ధమైపోతాయి. తిమింగలాలుగా రూపాంతరం చెందుతాయి.

-కేశవ్,

ఆర్థిక సామాజిక విశ్లేషకులు

98313 14213

Next Story