- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యావ్యవస్థపై మేధోమథనం జరపాలి!
There should be an intellectual debate on the education system

విద్యను నవ సమాజ నిర్మాణానికి వినియోగించాలి. విద్యను స్వీయ ప్రయోజనాల కోసం, పరపీడన కోసం వినియోగించడం వలన విద్యకున్న ప్రాశస్థ్యం నశిస్తుంది. విద్యావంతుల శాతం పెరుగుతున్నా, సమాజంలో సరైన మార్పు రావడం లేదు. పూర్వకాలం నాటి చదువుల్లో ఉండే విలువలు నేటి చదువుల్లో లేవు. మనిషిని మనిషిగా గౌరవించే రోజులు పోయాయి. ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి కారణం మంచి చెడుల గురించి చెప్పే వారు లేకపోవడమే. నేటి విద్యార్థులకు పుస్తకాలు బరువైనాయి. నేటి పుస్తకాల్లో నైతిక విలువలను బోధించే పాఠ్యాంశాలు కరువైనాయి. ఇలాంటి పరిస్థితులు మారాలి. చదువుకు అందం సంస్కారం. వినయానికి విలువలు ఆభరణాలు. సకల సద్గుణాలకు ఆయువు పట్టు విద్య. అలాంటి చదువులను పుస్తకాల ద్వారా విద్యార్ధుల మస్తకాల్లో ప్రేరేపించాలి. విద్యావ్యవస్థలో అనేకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో వీటి ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
మెకాలే విద్యావ్యవస్థ కారణంగా..
విద్యావ్యవస్థ సరిగా లేకపోవడంతోనే సమాజం సరైన దిశలో నడవలేకపోవడానికి కారణమనే వాదన అక్షర సత్యం. నేటి చదువు సమాజానికి ఉపయోగపడడం లేదు. స్వార్థానికి, ధనదాహానికి, ఇతరులను అణగద్రొక్కే నైజానికి జీవం పోస్తుంది. నేటి సమాజంలో విద్యావంతులు పెరుగుతున్నారు. కానీ వారిని గౌరవించే పరిస్థితి నేటి సంఘంలో కొరవడింది. కారణం విద్యావంతులలో కూడా సంస్కారం, వినయం కొరవడడమే. విద్యావంతుల కంటే విద్యావిహీనులే నయం అన్న భావన ఒక్కోసారి కలగకమానదు. ఇది చాలా దురదృష్టకరం. అలాగే ప్రతీ ఒక్కరు ఎంతో కొంత చదువుకున్న వారే కాబట్టి గతంలో మాదిరిగా విద్యావంతులకు దాసోహమై వారి సలహాలను స్వీకరించే పరిస్థితి నేడు కానరాదు. ఇది ఒకరకంగా శుభపరిణామమే కావచ్చు. అయితే ధనానికి దాసోహమయ్యే పరిస్థితులు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూడా మార్పు వచ్చి వివేకానికి, సంస్కారానికి విలువ పెరిగితేనే సమాజవికాసం "మూడు పువ్వులు- ఆరుకాయలు" అన్నట్టుగా వర్ధిల్లుతుంది. ఈ పరిణామాలు జరగాలంటే విద్యా వ్యవస్థ మెరుగుపడాలి.
భారతదేశం సుదీర్ఘ కాలం ఆంగ్లేయుల ఏలుబడిలో కొనసాగింది. అప్పుడే భారతీయ విద్యావిధానం పూర్తిగా దెబ్బతిన్నది. బ్రిటిషు వారి విధానాలకు అనుకూలమైన విద్యావిధానం ప్రవేశ పెట్టడానికి మెకాలే విపరీతంగా శ్రమించాడు. యూరప్ దేశాల సంస్కృతిని, వారి గొప్పదనాన్ని చాటి చెప్పడానికి, ఆంగ్లభాషను విస్తృతం చేయడానికి మెకాలే పాటుపడ్డాడు. దీంతో భారతీయ బోధనా పద్ధతులు, ప్రాచీన సంస్కృతిని నాశనం చేయడానికి ఈ విద్యావిధానం తోడ్పడింది. క్రమేపీ ఆంగ్ల ప్రాభవం పెరిగింది. ఆంగ్ల భాష చాప క్రింద నీరులా ప్రపంచంలోకి చొచ్చుకు పోయి అంతర్జాతీయ భాషగా అవతరించింది. ప్రస్తుతం అన్ని వ్యవహారాలు ఆంగ్లంలోనే సాగుతున్న నేపథ్యంలో ఆంగ్ల భాషను అభ్యసించక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి.
సచ్ఛరిత్రులు.. సమాజంలో ఇమడలేక
అయితే ఆంగ్లేయులు ఏ ఉద్దేశ్యంతో ఇంగ్లిషును ప్రవేశ పెట్టినా, అది అంతిమంగా భారతీయులకు కొంతవరకు వరంగా మారిందనే చెప్పాలి. భారతీయులు అగ్రదేశాల్లో సైతం రాణించడానికి, విద్య, ఉపాధి అవకాశాలు పెరగడానికి, సైన్స్ బోధన వలన మూఢనమ్మకాల నుండి, అనవసరమైన ఆలోచనల నుండి కొంతవరకు విముక్తి చెందడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నేటి ప్రపంచం ఆంగ్లమయమై పోయింది. మెకాలే ఆంగ్ల విద్యకు ప్రాధాన్యత పెరిగింది. ఈ దశలో మనం ఆంగ్ల భాషకు వ్యతిరేకమైన దారిలో నడవడం అసాధ్యం. అందరితో పాటే మన గమ్యం సాగాలి. ప్రవాహానికి ఎదురీదడం అసాధ్యం. ఆంగ్ల భాషను అభ్యసిస్తూనే మన భాషలను మనం కాపాడుకోవాలి. మన సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలి.
భారతీయ విలువలు ప్రపంచానికి ఆదర్శం. అయితే పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన ప్రపంచమంతా వేగంగా పరుగెడుతున్నది. విదేశీ సంస్కృతి స్వదేశీ విలువలను ధ్వంసం చేస్తున్నది. ఇతర దేశాల సంస్కృతిలోని మంచిని గ్రహించి, మన దేశ సంస్కృతిని కాపాడుకోవాలి. మన చదువుల్లో విలువలకు ప్రాధాన్యత పెరగాలి. పాతకాలం నాటి నైతిక విలువలతో కూడిన విద్యతో ఆధునిక విద్యావ్యవస్థ సమ్మిళితమై వెలుగొందాలి. ‘విద్యాదదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం...’ అన్నాడు భర్తృహరి. విద్య వలన వినయం, వినయం వలన పాత్రత సిద్ధిస్తుంది. అయితే నేటి విద్యావ్యవస్థ కేవలం ధనార్జనకు, ఉద్యోగ సంపాదనకే అధిక ప్రాధాన్యత నివ్వడంవలన వినయమనే విశిష్టమైన ఆభరణం సమాజమనే కిరీటంలో చేరలేక పోతున్నది. సంస్కారం స్థానంలో కృత్రిమమైన నటనా వైదుష్యంతో కూడిన కుసంస్కారం వ్రేళ్ళూనుతున్నది. మంచికి వంచన జరుగుతున్నది. నిజమైన సంస్కారానికి, వినయానికి చోటు మృగ్యమైపోతున్నది. స్వకార్యాలను చక్కబెట్టుకోవడానికే చదువు ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది కాని సమాజ సేవకు కొరగావడం లేదు. కొద్దో గొప్పో సమాజంపై అవగాహన ఉన్నవారు నేటివ్యవస్థలో పేరుకుపోయిన అహంకార జాఢ్యమనే మనో వికారాలతో అణకద్రొక్కబడుతున్నారు. సచ్ఛరిత్ర గల ఎవరూ సమాజంలో ఇమడలేక నలిగిపోతున్నారు. ఆత్మాభిమానం చంపుకోలేక, అవకాశవాదానికి తలొగ్గడం ఇష్టంలేక మౌనముద్ర వహిస్తున్నారు.
ధనమే పరమావధి.. ధోరణి మారాలి!
సమాజంలో అరాచకాలు, అత్యాచారాలు, అసాంఘిక కార్యకలాపాలు నేటి వ్యవస్థలో పెచ్చుమీరిపోతున్నాయి. ధనం, అధికారం, అహంకారం ముందు మంచితనం వీగిపోతున్నది. యాంత్రికమైన చదువుల వల్ల విలువలు పడిపోతున్నాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కేవలం ఉద్యోగాలు చేసే యంత్రాలుగా కరెన్సీ నోట్లకు ప్రతిరూపాలుగా చూడడం వల్లనే సమాజం అధోగతి పాలైపోతున్నది. ఒకరితో ఒకరికి సంబంధాలుండడం లేదు. మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలేనన్న నానుడి నిక్కమై కూర్చున్నది. మితిమీరిన ధనాపేక్ష, యుక్తాయుక్త విచక్షణ మరచిన అహంకారతత్వం కొలుపుగోలుతనాన్ని, సంఘటితంగా మెసలే తత్వాన్ని మంటగలపడం బాధాకరం. అష్టవంకరలతో అడ్డదిడ్డంగా మారిన సామాజిక వ్యవస్థను సరిచేసే బాధ్యత ఉపాధ్యాయుల భుజస్కంధాలపై ఉంది. అందుకు తగిన మార్పులను ప్రభుత్వాలు నేటి విద్యా వ్యవస్థలో తీసుకురావాలి. మానవత్వ విలువలు మంటగలుస్తున్నాయి. ధనార్జనకే గాని, విలువలకు పనికిరాని చదువుల వలన దేశానికి ఉపయోగం శూన్యం. తన చుట్టూ జరుగుతున్న విషయాలను ఆకళింపు చేసుకోకుండా, బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా సాగుతున్న నేటి జీవితాలకు అర్ధం లేదు. విద్యా వ్యవస్థలో విలువల గురించి, మానవ సంబంధాల గురించి ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశ పెట్టాలి. యువత వెర్రి వ్యామోహాల్లో తలమునకలై, సకల వ్యసనాలతో జాతికి పెనుభారంగా మారకూడదు. యువత విషయంలో భారతీయ యువకెరటం స్వామి వివేకానంద స్ఫూర్తిని జ్వలింప చేయవలసిన అవసరం ఏర్పడింది. విద్య ద్వారా యువత చైతన్యమవుతుందని, విద్య ద్వారా జాతికి జవసత్వాలు సిద్ధిస్తాయని విద్య ప్రాధాన్యత చాటి చెప్పిన వివేకానందుని స్ఫూర్తిని విద్యారంగంలో నింపాలి. సంస్కారాన్ని, వినయాన్ని, వివేకాన్ని, సామాజిక స్పృహను కలిగించే రీతిలో పాఠ్యాంశాలలో మార్పులు రావాలి. ‘ధనమే పరమావధి’ అనే ధోరణి మారాలి. విలువల ఆధారంగా సమాజం నడవాలంటే విద్యావ్యవస్థపై తీవ్రమైన మేథోమధనం జరగాలి. దిగజారిపోతున్న విలువలను చదువులతో సంస్కరించాలి.
సుంకవల్లి సత్తిరాజు
సోషల్ ఎనలిస్ట్, కాలమిస్ట్
97049 03463






