ఎన్నో చట్టాలున్నా.. కార్మికులకు న్యాయం ఎక్కడ?

by Ravi |   (  Updated:2025-10-01 00:16:02  IST  )

‘ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను’ అన్నారో సినీకవి వేరే సందర్భంలో.. కార్మిక సంక్షేమం విషయంలో క్షేత్రస్థాయి పరిస్థితి

ఎన్నో చట్టాలున్నా.. కార్మికులకు న్యాయం ఎక్కడ?
X

‘ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను’ అన్నారో సినీకవి వేరే సందర్భంలో.. కార్మిక సంక్షేమం విషయంలో క్షేత్రస్థాయి పరిస్థితి మారేవరకూ నాదీ అదే బాట. ‘ముఖ్యమంత్రులు జిల్లా కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో జరిపే సమీక్షా సమావేశాల విశేషాలను వార్తా పత్రికలలో చదివినప్పుడల్లా, ‘ ఎవరికి పుట్టిన బిడ్డరా వెక్కివెక్కి ఏడుస్తున్నది’ అన్న సామెతే తడుతుంది. ఒక దండకంలా కార్మిక చట్టాలు గుర్తొస్తాయి. ‌ విషాదమేమంటే ఈ చట్టాలేవీ సక్రమంగా, పూర్తిగా అమలు జరగడం లేదు..

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన దుకాణాలు, సంస్థల చట్టం మొదలైన వాటి అమ లు పరిస్థితీ భిన్నంగా లేదు. ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా ప్రవేశపెట్టిన, పారి శ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తున్న, సులభతర వాణిజ్య విధానాలు కార్మికులపై వ్యతిరేక ఫలితాలను చూపుతున్నాయి.

ఎన్నో చట్టాలు..

బ్రిటిష్ ఇండియా పాలనలోనే పనివారాల నష్టపరిహార చట్టం-1926, వేతనాల చెల్లింపు చట్టం- 1936 అమలులో ఉన్నా యి. స్వాతంత్య్రం సాధించిన సంవత్సరమే పారిశ్రామిక వివాదాల చట్టం రూపొందించారు. ఆ మరుసటి సంవత్సరమే 1948లోనే కర్మాగారాల చట్టం, కనీస వేతనాల చట్టం, కార్మిక రాజ్య బీమా చట్టం, బొగ్గు కార్మికుల భవిష్యనిధి చట్టం వచ్చాయి. ఆ తర్వాత నాలుగే‌ళ్లకు ఉద్యోగ భవిష్యనిధి చట్టం, గనుల చట్టాలు తీసుకొచ్చారు. కొంత విరామం తర్వాత 1965లో బోనస్ చట్టం, ఆ తర్వాత కాంట్రాక్ట్ కార్మికుల (రద్దు, నియంత్రణ) చట్టం, 1970 ఆ జాబితాలో చేరాయి. మళ్లీ అత్యవసర పరి స్థితి పుణ్యమా అని 1976లో రెండు ముఖ్య మైన చట్టాలు చేయబడ్డాయి. అవే, సమాన ప్రతిఫల చట్టం, వెట్టిచాకిరీ వ్యవస్థ రద్దు- 1979లో అంతర్ రాష్ట్ర వలస చట్టం, కొంత విరామం తర్వాత భవన, ఇతర నిర్మాణ కార్మికుల (ఉపాధి, సేవా పరిస్థితుల నియంత్ర ణ) చట్టం-1996 పట్టాలెక్కాయి. 2008లో అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రత చట్టం ఈ వరసలో చేరింది.

అమలును ఎందుకు సమీక్షించరు?

ఆర్థిక సంస్కరణల పర్యవసానంగా ప్రవేశపెట్టిన, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తున్న, సులభతర వాణిజ్య విధానాలు కార్మికులపై వ్యతిరేక ఫలితాలను చూపుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, వార్షిక సర్వే ప్రకారం మనదేశ వ్యవస్థీకృత తయారీ రంగంలో కాంట్రాక్ట్ కార్మికుల వాటా 2023-24లో 27 సంవత్సరాల గరిష్ట స్థాయి 42 శాతానికి చేరుకుంది. ఇది 2014కి ముందు స్థాయి కంటే దాదాపు రెట్టింపు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో కార్మిక చట్టాలను క్రమంగా సడలించడం ఇందుకు ప్రధాన కారణం. నన్ను వెంటాడే ప్రశ్న కార్మిక సంక్షేమానికి ఉద్దేశించిన చట్టాల అమలును ఎందుకు అత్యున్నత స్థాయిలో సమీక్షించరు? ప్రభుత్వ వసతి గృహాలలో బస చెయ్యమని నిర్దేశించిన కలెక్టర్లను, పెద్ద పెద్ద కార్మగారాల, సంస్థల క్షేత్ర పరిశీలన కూడా చేయమని అడగరెందుకు? మద్యం విక్రయాల పెంపుపై చూపుతున్న శ్రద్ధ ఇటువైపు కూడా చూపరే మి? పౌర సంఘాలు, మానవ హక్కుల రక్షణ వేదికలు ఈ విషయంలో ఎందుకు ఉదాసీనంగా ఉంటాయి? రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి, కార్మిక సంఘాలు ఐక్య సంఘటన ద్వారా అన్ని కార్మిక చట్టాల సక్రమ అమలుకై పోరాడరేమి? ఈ చట్టాల అమలు పర్యవేక్షించే అధికారులు, సిబ్బంది కూడా ఉద్యోగుల, అధికారుల సంఘాల సభ్యులే కదా! వారికి నిజాయితీగా విధులు నిర్వర్తించే మనో వైఖరి ఒంట బట్టించడానికి ఆ సంఘాల నాయకులు ఎందుకు పూనుకోరు?

మనది నాగరిక సమాజమేనా?

ఉచిత బస్సు ప్రయాణం వలన మహిళా కార్మికులకు, ఉద్యోగులకు ప్రయాణ ఖర్చులు మిగలవచ్చు గాని వారిలో పలువురు 10 నుండి 12 గంటలు నిలబడి విధులు నిర్వర్తించి, ఏ రాత్రికో ఇంటికి చేరి ఎంత ఆరోగ్యంగా ఉండగలరు? ఒక్కోసారి మనది నాగరిక సమాజమేనా? అనిపిస్తుంది. నక్షత్రాల హోటల్స్‌లో కూడా అమలు కాని కనీస వేతనాలు.. ఐచ్ఛికంగా, అవసరమైతే, అధిక వేతనం ఆశించకుండా, 12 గంటల వరకు పనిచేస్తామని రాతపూర్వక హామీ తీసుకుని ఉద్యోగాన్ని ఇచ్చే బడా వ్యాపారులు. కొందరు దేవాలయాలు నిర్మించే వదాన్యులు. మరికొందరు వినుతి కెక్కిన వితరణశీలులు. వారు తమ పరిశ్రమలలో, సంస్థలలో, సాంఘిక భద్రతా చట్టాల అమలుకు మాత్రం పూనుకోరు. యజమాని అవతారం ఎత్తిన ప్రభుత్వాలు ‘పనికి ఆహారం’ పథకం కింద వేతనాలు పెంచవు. సకాలంలో చెల్లించవు. పరాయి సేవకులకు, ఒప్పందం కార్మికులకు సమాన ప్రతిఫల చట్ట ఫలాలు అందని ద్రాక్ష పళ్లు. ఇక ఉద్యోగుల భవిష్య నిధి నుండి విదిల్చే ‌వెయ్యి రూపాయల కనీస పింఛను దశాబ్దం పైగా గడిచినా కొంచెమైనా పెరగదు.

ఉచితాల భారం తగ్గించుకోవచ్చు!

వలస కార్మికులు దిక్కుమాలిన జీవితాలు గడుపుతుంటారు. భవన నిర్మాణ రంగ కార్మికుల శ్రేయోనిధి ఏడాది, ఏడాదికీ పెరుగుతుంది. ఆ రంగ కార్మికులలో అత్యధికులకు అలాంటి చట్టం ఒకటి ఉన్నట్టే తెలియదు. వారికి అవగాహన సదస్సులు నిర్వహించి, ఆ పథక లబ్ధిదారులను చేసేలా ఉద్యమం చేపట్టాలని అటు ప్రభుత్వాలకు, ఇటు కార్మిక సంఘాలకు తోచదు. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం ఒక్కటే సరిపోదు.. కార్మిక చట్టాల అమలు మీద కూడా దృష్టి ఉంచాలి. సాంకేతికతా వినియోగం కార్మిక చట్టాల నిర్దిష్ట అమలుకూ విస్తరించాలి. పి-4లో ‘ప్రమోషన్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్’ చేర్చి పి-5గా మార్చాలి. అప్పుడు పెట్టుబడుదారుల అక్రమ లాభాలు తగ్గి, అట్టడుగునున్న కార్మిక వర్గ సంపాదన మెరుగవుతుంది. ఉచితాల భారం నుండి ప్రభుత్వాలకు కొంత ఉపశమనం లభిస్తుంది.

-మల్లాప్రగడ రామారావు

99898 63398

Next Story