- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కళాశాలలు, పరీక్షలు ఉన్నా... ఉన్నత విద్యాభ్యసనం ఎక్కడ..!
తెలంగాణలో ఉన్నత విద్యా వ్యవస్థ మౌనంగా క్షీణిస్తోంది. బయటకు కళాశాలలు నడుస్తున్నట్టే కనిపిస్తున్నా, లోపల విద్య అనే ఆత్మ నెమ్మదిగా నశిస్తోంది.

తెలంగాణలో ఉన్నత విద్యా వ్యవస్థ మౌనంగా క్షీణిస్తోంది. బయటకు కళాశాలలు నడుస్తున్నట్టే కనిపిస్తున్నా, లోపల విద్య అనే ఆత్మ నెమ్మదిగా నశిస్తోంది. తరగతులు ఉన్నా బోధన లేదు, అరకొర అధ్యాపకులు ఉన్నా మార్గనిర్దేశం లేదు, విద్యార్థులు ఉన్నా నిజమైన అభ్యసనం కనిపించడం లేదు. ‘పుస్తకాలు’ ఉండాల్సిన చేతుల్లో ‘సెల్‌ఫోన్లు’ కనిపిస్తున్నా, కళాశాలలకు వెళ్లకపోయినా తల్లిదండ్రుల నుంచి వ్యవస్థ వరకు ఎవరికీ పట్టడం లేదు. తరగతులు జరగకపోయినా వ్యవస్థ స్పందించకపోవడం ఈ మౌన నిర్లక్ష్యాన్ని మరింత పెంచుతోంది.
ఫలితంగా విద్యాసంవత్సరం మొత్తం సమర్థవంతమైన అభ్యసనం లేకుండానే విద్యార్థులు పరీక్షలకు నామమాత్రంగా హాజరవుతున్నారు. సరైన ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో చూచిరాతలు, మాస్ కాపీయింగ్, ఇతర అక్రమ మార్గాల వైపు తోసుకుపోతున్నారు. తరగతులు, అధ్యాపకులు, ప్రయోగశాలలు,జ్ఞానం, క్రమశిక్షణ, మేధో వికాసం వంటి మూల స్తంభాలు కూలిపోతూ ఉన్నత విద్య కేవలం ‘పట్టా పొందే యాంత్రిక ప్రక్రియ’గా మారుతోంది. విద్య అనే ఆయుధం ఇవ్వాల్సిన వ్యవస్థ, ఖాళీ చేతులతోనే విద్యార్థులను పోటీ ప్రపంచంలోకి తోసేస్తోంది. ఈ దిగజారుదల ఒక్క కళాశాలకో విభాగానికో పరిమితం కాకుండా, ఇంజనీరింగ్ నుంచి డిగ్రీ, నర్సింగ్ నుంచి లా వరకు మొత్తం వ్యవస్థనే నిర్వీర్యం చేస్తోంది. ఎవ్వరూ ప్రత్యక్షంగా బాధ్యత వహించని ఈ వ్యవస్థే పరోక్షంగా భ్రష్టుపడుతున్న తతంగం. ఇది విద్యా సమస్య మాత్రమే కాదు, ఒక తరం భవిష్యత్తును ప్రశ్నార్థకంగా నిలబెట్టే ప్రమాదకర సంకేతం.
నిర్వీర్యమవుతున్న వ్యవస్థ..
ఇంజనీరింగ్ నుంచి డిగ్రీ, పీజీ, నర్సింగ్, ఫార్మసీ, వృత్తివిద్య, లా కళాశాలల వరకు రాష్ట్రంలో విద్యా దుస్థితి విస్తరించింది. అనేక ప్రైవేట్ కళాశాలలు UGC, AICTE, PCI, BCI, INC వంటి నియంత్రణ సంస్థల నిబంధనలను తూతూ మంత్రంగా పాటిస్తూ, పూర్తి స్థాయి అధ్యాపకుల నియామకాన్ని తప్పించుకుంటున్నాయి. విద్యార్థులు తరగతులకు రాకపోవడమే మంచిదన్న మౌన అంగీకారంతో, ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కళాశాలల నిర్వహణ సాగుతోంది. తరగతులు లేకున్నా కళాశాలలు నడుస్తున్నాయి. అధ్యాపకులు లేకున్నా గుర్తింపులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ, విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ లోపమే దీనికి ప్రధాన కారణం. అనుమతుల విషయంలో చూపే చురుకుదనం, క్షేత్రస్థాయి తనిఖీల్లో మాత్రం కనిపించడం లేదు. విద్యాసంవత్సరం మొత్తం తరగతులు జరుగుతున్నాయా, అధ్యాపకులు హాజరవుతున్నారా, విద్యార్థులు తరగతులకు వస్తున్నారా అన్న ప్రాథమిక అంశాలపైనా పర్యవేక్షణ లేదు.
తరగతులకు రాకుండా..చూచిరాతల పరీక్షలు
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. విద్యా సంవత్సరం మొత్తం పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరగతులకు హాజరు కావడం లేదు. థియరీ పాఠాలు, ప్రయోగశాల అనుభవం లేకుండానే విద్యా సంవత్సరాలు గడుస్తున్నాయి. ఫలితంగా జ్ఞానం, వ్యక్తిత్వం, నైపుణ్యాలు అభివృద్ధి చెందడం లేదు. దిశానిర్దేశం లేని చదువు పరీక్షలను చూచిరాతల వైపు నడిపిస్తూ, సెమిస్టర్, వార్షిక పరీక్షలకు తరగతుల్లో నేర్చుకున్న పరిజ్ఞానం లేకుండానే నామమాత్రంగా హాజరవుతున్నారు. ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో చూచిరాతలు, మాస్ కాపీయింగ్, అక్రమ మార్గాలు సాధారణమవుతున్నాయి. ఇది విద్యార్థుల తప్పు మాత్రమే కాదు. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, కొందరు అధ్యాపకులు కూడా ఈ అక్రమాలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రోత్సహించడం ఆందోళన కలిగించే విషయం.
పట్టా వస్తే చాలా?
“పట్టా వస్తే చాలు” అంటున్న తల్లిదండ్రులు, సమాజం మౌన ధోరణి ఈ దిగజారుదలకి బలం ఇస్తోంది. ఫలితంగా నైపుణ్యాలు, పరిశోధనా పరిజ్ఞానం లేని పట్టభద్రులు తయారవుతూ విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది. తరగతులకు వెళ్లకుండానే నేరుగా పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య పెరగడంతో, జ్ఞానాన్ని పరీక్షించాల్సిన పరీక్షలే ‘జవాబులు చూసి రాయగలిగితే చాలు’ అనే స్థాయికి దిగజారాయి. ఇందులో ఏమి కోల్పోతున్నామో విద్యార్థులు, కళాశాలలు, సమాజం మొత్తం గ్రహించలేని స్థితి నెలకొంది
పుస్తకాలు మూసి – సెల్‌ఫోన్ బానిసత్వం
నేటి రోజుల్లో విద్యార్థులు పుస్తకాలతో అనుబంధాన్ని కోల్పోయి, చదవాల్సిన చేతుల్లో గంటల తరబడి సెల్‌ఫోన్‌లే కనిపిస్తున్నాయి. విద్యకు ద్వారంగా మారాల్సిన సాంకేతికత, నేడు విద్యార్థులను విపరీత ధోరణుల వైపు నడిపించే సాధనంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. అవసరం లేని కంటెంట్‌లో విలువైన సమయాన్ని వృథా చేయడం వల్ల చదువుపై ఆసక్తి తగ్గి, రెగ్యులర్‌గా కళాశాలలకు వెళ్లి తరగతులు వినాలన్న ఉత్సాహం క్రమంగా క్షీణిస్తోంది. ఫలితంగా ప్రత్యక్ష అభ్యసనం, అధ్యాపకుల మార్గనిర్దేశం ద్వారా పొందాల్సిన జ్ఞానం విద్యార్థుల జీవితాల నుంచి దూరమవుతోంది. ఈ నిర్లక్ష్యం కొందరిని మత్తు పదార్థాలు, డ్రగ్స్ వైపు నెట్టేస్తూ, చదువుకే కాదు జీవితానికే దారి తప్పే ప్రమాదాన్ని పెంచుతోంది. ఇది వ్యక్తిగత సమస్య కాదు, రాబోయే తరానికి సంబంధించిన సామాజిక సంక్షోభం. విద్యార్థులనే నిందించడం సరికాదు. ((తల్లిదండ్రులు, కళాశాలలు, ప్రభుత్వం, సమాజం కలిసి సెల్‌ఫోన్ వినియోగంపై నియంత్రణతో పాటు ప్రత్యక్ష విద్యకు ప్రాధాన్యం, క్రమశిక్షణతో కూడిన అకడమిక్ వాతావరణాన్ని తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.))
నిబంధనలే ప్రధానం..
స్కాలర్‌షిప్ ద్వారా ఫీజు రీయంబర్స్మెంట్‌ను ప్రభుత్వం ఏళ్ల తరబడి ఆలస్యం చేయడం మరో కీలక సమస్య. దీని వల్ల నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. అదే సమయంలో, ఈ ఆలస్యాలను సాకుగా చూపుతూ కళాశాలలు బోధన నాణ్యతను తగ్గించడం మరింత ఆందోళనకరం. ప్రభుత్వ నిర్లక్ష్యం, కళాశాలల బాధ్యతాహీనత మధ్య విద్యార్థుల భవిష్యత్తే నలిగిపోతోంది. కనీసం 75 శాతం హాజరు లేకుండా వార్షిక పరీక్షలకు మినహాయింపులు ఇవ్వకుండా, నిబంధనలను పరీక్ష ఫీజు, స్కాలర్‌షిప్‌ల కింద మెస్ ఛార్జీలు, ఫీజు రీయంబర్స్మెంట్ విడుదలతో అనుసంధానం చేయాలి. అదే సమయంలో ప్రభుత్వం విద్యార్థి సంక్షేమాన్ని కేంద్రంగా పెట్టుకుని ఆర్థిక ప్రోత్సాహకాలను నిర్దిష్ట కాలపరిమితిలో విడుదల చేయాల్సిన బాధ్యతను వహించాలి. లేకపోతే ఫీజు భారం నేరుగా తల్లిదండ్రులపై పడుతూ, నిరుపేద కుటుంబాలను కఠిన నిర్ణయాలకు నెట్టే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కోణాన్ని విద్యా విధానాల్లో విస్మరించకూడదు.
నంగె శ్రీనివాస్,
ఎడ్యుకేషన్ ఎనలిస్ట్ & ప్రిన్సిపల్
94419 09191






