అంధకారానికి చేరువలో ప్రపంచం..

by Ravi |   (  Updated:2025-06-24 01:15:52  IST  )

025, జూన్ 22.. ఈ తేదీ ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రోజు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని

అంధకారానికి చేరువలో ప్రపంచం..
X

2025, జూన్ 22.. ఈ తేదీ ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రోజు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం, ఇజ్రాయెల్‌తో చేతులు కలిపి, ఇరాన్‌లోని Fordow, Natanz, Isfahan లాంటి కీలక న్యూక్లియర్ సదుపాయాలపై భారీ బాంబు దాడులు జరిపింది. ఈ దాడి ప్రపంచ శాంతికి బలమైన అవరోధంగా భావించవచ్చు. ఇది కేవలం యుద్ధ చర్య కాదు. ఇది అంతర్జాతీయ చట్టాలకు అవమానం, మానవతా విలువల పట్ల నిర్లక్ష్యం, ప్రపంచాన్ని మళ్లీ ఒక అంధకార దశలోకి తోసే అవకాశం కలిగిన నిర్ణయం.

ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం, ఒక దేశంపై మరో దేశం బల ప్రయోగం చేయాలంటే అది న్యాయబద్ధమైన ప్రక్రియలోనే జరగాలి. అయితే ఈ దాడికి సంబంధించి అమెరికా ఇతర దేశాలను గాని, అంతర్జాతీయ సమితిని గాని సంప్రదించకుండా, అనధికారికంగా ముందడుగు వేసింది. ఇది "అగ్రెషన్ క్రైమ్" అనే న్యాయపరమైన నిర్వచనానికి అనువైన చర్య. ఇలాంటి చర్యల వల్ల అంతర్జాతీ య వ్యవస్థ పట్ల విశ్వాసం క్షీణిస్తుంది. పెద్ద దేశాలు శక్తి ప్రదర్శన పేరిట చిన్న దేశాలపై యుద్ధాలు మొదలెడితే, ‘న్యాయం’ అనే పదానికి విలువుందా?

బలప్రయోగమే మార్గమా?

ఇరాన్‌కి చెందిన Fordow, Natanz, Isfahan కేంద్రాలు యురేనియం అభివృద్ధిలో కీలకమైనవి. ఐఏఈఏ నివేదికల ప్రకారం, ఇరాన్ 60% శుద్ధితో యురేనియం తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇది అణు బాంబు నిర్మాణానికి చాలా అనుకూలమైనది. అయితే అమెరికా– ఇజ్రాయెల్ ఈ అభివృద్ధిని భద్రతకు ముప్పుగా పరిగణించాయి. ఇటీవల హమాస్, హిజ్బుల్లా వంటి ఇరాన్ మద్దతుగల సంస్థలు ఇజ్రాయెల్‌పై దాడులు జరిపాయి. ఇరాన్ వీటికి ప్రత్యేక్షంగా మద్దతిస్తోందని అమెరికా, ఇజ్రాయెల్ నమ్ముతున్నాయి. ఈ దాడిని, ఆ మద్దతును అణచివేయడానికి ప్రయత్నంగా భావించాల్సి ఉంది. అణు ఒప్పందం (JCPOA) 2018లో రద్దయిన తరువాత ఇరాన్ – అమెరికా మధ్య మళ్లీ చర్చలు కొనసాగ లేదు. ఈ నేపథ్యంలో శాంతిపూర్వక పరిష్కారం కంటే బలప్రయోగమే సరైన మార్గమని అమెరికా భావించటం ఈ చర్యకు దారితీసింది. అంతేకాకుండా ఈ దాడి ద్వారా అమెరికా ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కి ఎదురుగా ఉన్నామన్న సంకేతాన్ని అంతర్జాతీయంగా ఒక సంకేతం ఇవ్వాలనుకుంది.

ఐరాస చార్టర్ ఉల్లంఘన

ఇరాన్‌పై ట్రంప్ దాడిని సమర్ధించే వారి అభిప్రాయాలు పరిశీలిస్తే ఇరాన్ అణు బాంబు అభివృద్ధికి ప్రమాదకరం. అణు ఆయుధాల వ్యాప్తి నివారించాలంటే, ముందస్తుగా చర్య తీసుకోవడం ఒక భద్రతా వ్యూహంగా సమర్థించవచ్చు. మరొక కారణం హమాస్, హిజ్బుల్లా వంటి ఇరాన్ మద్దతు గల సంస్థలు ఇజ్రాయెల్‌పై దాడులు చేసిన వేళ, దాని వెనుక ఉన్న వారిని లక్ష్యంగా చేసుకోవడం రణనీతి ప్రకారం సమంజసంగా ఉంటుంది. మరొక దృష్టితో చూస్తే అమెరికా బలంగా ఉన్నదన్న సంకేతాన్ని ఇరాన్‌తో పాటు ఇతర "శత్రు దేశాలకూ" చూపించాలన్న ఉద్దేశం ఉండ వచ్చు. అమెరికా బాంబు దాడులపై నిరసన వ్యక్తం చేసేవారి ఉద్దేశాలను పరిశీలిస్తే ఇది అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన కిందికి వచ్చే అవినీతికర చర్య. ట్రంప్ చర్య సైనిక దృష్టికోణంలో సరైనదిగా అనిపించవచ్చు, కానీ అంతర్జాతీయ నైతికత, చట్టబద్ధత, మానవతా విలువల పరంగా దౌర్భాగ్య కరమైన నిర్ణయంగా నిలుస్తుంది. ఈ చర్య ద్వారా ప్రపంచంలో శాంతిని చిగురిందనేది సుస్పష్టం.

ఇది గొప్ప విజయమేనా?

ప్రతి బాంబు దాడి, మరొక ప్రతీకారం సందిగ్ధతను పుట్టిస్తుంది. ఇరాన్ తమ బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించడం, మిడిల్ ఈస్ట్ అంతటా ఉద్రిక్తత పెరగడం, Strait of Hormuz మూసివేత హెచ్చరికలు ఇవన్నీ పక్కన పెట్టలేం. న్యూక్లియర్ స్థావరాలపై దాడి అనే పేరు వినగానే అది “అణు ప్రమాదం” అనే భయాన్ని కలిగిస్తుంది. ఇలాంటి దాడుల వల్ల సామాన్య ప్రజలు, పేద ప్రజలు, దారుణంగా ప్రభావితమవుతారు. అయితే దీనిని అగ్ర దేశాలు “గొప్ప విజయం”గా ప్రచారం చేసుకోవడం కేవలం నైతిక విలువల హననానికి నిదర్శనం. మానవ జీవితం విలువైనదిగా మారాల్సిన ఈ యుగంలో, అణుదాడులను మహోన్నత విజయంగా కీర్తించడం అంటే, అది మానవత్వం క్షీణిస్తున్నదనడానికి సంకేతం కాదని ఎలా అనగలం? ఇతర అగ్రరాజ్యాలు కూడా తమకు నచ్చని దేశాలపై దాడులు చేయడానికి ప్రేరేపించడానికి అనుసరించే చర్యగా కూడా ఇది మారవచ్చు.

పొంచి ఉన్న అణుయుద్ధ భూతం

అంతిమంగా...ఇది ప్రపంచాన్ని అణు యుద్ధ భూతాన్ని ఎదుర్కొనే దశకు చేర్చవచ్చు. శాంతికి బాంబులు, దాడులు మార్గం కాదు, ఇరుదేశాల మధ్య చర్చలు, సంభాషణలే కీలకం. అమెరికా చేసిన ఈ దాడి తప్పనిసరిగా శాంతికి హాని కలిగించే చర్యగా భావించాలి. బల ప్రయోగం ఏ సమస్యకు పరిష్కారం కాదు. పరస్పర గౌరవం మాత్రమే శాంతికి మార్గంగా ఉండగలవు. ఈ సంఘటన యావత్ ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరికగా మిగలాలి. ఇంకా ఆలస్యం కాకముందే ప్రపంచం కళ్లు తెరవాలి. హింసకు తావులేని విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని అనుసరించాలి.

-డాక్టర్ మామిడాల శైలజ

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్

99850 19167

Next Story