దేశ చరిత్రను మార్చనున్న.. పశ్చిమ బెంగాల్ ఫలితాలు

by Ravi |   (  Updated:2026-05-05 00:45:48  IST  )

2026 ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతంగా మారాయి. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం, తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే సంచలనం, కేరళలో ఫలితాల మార్పు వంటి పరిణామాలపై విశ్లేషణ.

దేశ చరిత్రను మార్చనున్న.. పశ్చిమ బెంగాల్ ఫలితాలు
X

కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలు, కేంద్ర పరి పాలన ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి దేశ ప్రజలు ఉత్కంఠతతో ఎదురు చూశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తమిళనాడు విషయంలో తలకిందులు అయినాయి. కేరళం, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ సీట్లు రావడం ఆశ్చర్యకరం. ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, మోడీని నిరంతరం వ్యతిరేకించే డీఎంకే, తృణమూల్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు బలహీన పడినట్లు ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.

బేస్ లేని రాష్ట్రంలో హిందుత్వ గెలుపు!

ఇక పశ్చిమ బెంగాల్ విషయంలో మాత్రం పోల్ సర్వేలు ప్రజలలో గందరగోళాన్ని సృష్టించాయి. బెంగాల్లో హిందు ఓటు పోలరైజ్ అయిందనే విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే! ఒకప్పుడు కాంగ్రెస్, సీపీఎం వైపు ఉన్న హిందూ ఓటరు బీజేపీ వైపు మళ్లాడు. ఇందుకు కారణం లేకపోలేదు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అనేక సందర్భాల్లో హిందువులకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంది. శ్రీరామనవమి, దుర్గా పూజ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూడడం వంటి చర్యలు హిందూ ఓటరును ఆలోచింపజేసింది.

బీజేపీ విజయ రహస్యం ఇదే!

ఆర్.జీ. కర్ ఆసుపత్రిలో రేప్ విషయంలో దోషులకు ప్రత్యక్ష, పరోక్ష సహకారాన్ని టీఎంసీ ప్రభుత్వం అందించింది. సందేశ్ కాలీ లైంగిక వేధింపులు, అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కులు కల్పించాలని, సర్‌ను అడ్డుకోవాలని చూడడం వంటి విషయాల్లో రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు స్పష్టమైంది. ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించరాదని మమతా బెనర్జీ చేసిన న్యూసెన్సును సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఆర్.జీ. కర్ ఆసుపత్రి రేప్ బాధితు‌రాలి తల్లి రత్నాకర్ దేబ్ నాథ్ పానీహట్ నియోజకవర్గంలో తృణమూల్ అభ్యర్థిని ఓడించడమే గొప్ప విజయం. వాస్తవంగా హిందుత్వ బేస్ లేని రాష్ట్రంలో బిజెపి అనూహ్య విజయం సాధించడం ఆషామాషీ విషయం కాదు. ఒక్క లక్ష 25 వేల హిందుత్వ కార్యకర్తలు వీధి సమావేశాలను నిర్వహించారు. బెంగాల్లో బిజెపి విజయం వెనక దాగి ఉన్న రహస్యం ఇదే!

ఇది మోడీ చరిష్మా కాదు...

చాలామంది మోడీ చరిష్మా పనిచేసిందని చెప్పుకుంటారు. ఇందులో పూర్తి వాస్తవం లేదు. ఈ క్రెడిట్ అంతా గ్రౌండ్ లెవెల్ లో పనిచేసిన హిందూత్వ కార్యకర్తలదే. 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక మంది హిందుత్వ కార్యకర్తల పై టీఎంసీ గూండాలు దాడులకు తెగబడ్డారు. అనేక‌మంది కార్యకర్తలు ప్రాణ భయంతో ఊర్లు వదిలి పారిపోయారు. ఈ పరిస్థితి అర్థం చేసుకున్న ఎలక్షన్ కమిషన్ ఆ రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి రెండు లక్షల 50 వేల మంది పోలీసు బలగాలను వినియోగించడం ఒక విశేషం. గతంలో బోగస్ ఓట్లతో అధికారాన్ని కైవసం చేసుకున్న టీఎంసీ బోగస్ ఓట్ల తొలగింపుతో అధికారానికి దూరమైంది. మొత్తం మీద జాతీయవాదులు ఆ రాష్ట్రంలో పరిపాలన పగ్గాలు చేతబట్టడం దేశ చరిత్రలో పేను మార్పుకు సంకేతం.

అధికారాన్ని లాగేసుకున్న విజయ్!

సినిమా హీరోల వెంట తమిళ ఓటరు పరుగెడతాడు అనే విషయం మరోసారి తేటతెల్లమైంది. కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత తదితరులు సినీ రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చారు. వారిని తమిళ ప్రజలు ఆదరించారు. తమిళ రాజకీయాల్లో తమిళగ వెట్రి కజగం అనూహ్య విజయాన్ని ఏ పోల్ సర్వే ఊహించలేదు. విశ్లేషణ రాసే సమయానికి 106 సీట్లలో ఆ పార్టీ లీడింగ్‌లో ఉంది. నిమ్న వర్గాల ఓట్లను డీఎంకే నుండి టీవీకె అధినేత 'విజయ్' లాగేసుకున్నట్లు ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి. తమిళ ఓటరు సైలెంట్‌గా తన పని తాను చేసినట్లు తెలుస్తుంది. ప్రాంతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టాలని చూసినా స్టాలిన్‌కు తమిళ ఓటరు సరైన బుద్ధి చెప్పినట్లు అర్థమైంది. మోడీని నిరంతరం వ్యతిరేకించే డీఎంకే, తృణమూల్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు బలహీన పడినట్లు ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయి.

- ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు,

94417 37877

Next Story