- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్పొరేట్ కాలేజీల మాయాజాలమే AIR సిరీస్
పదో తరగతి పూర్తయిన విద్యార్థులను, తల్లిదండ్రులను యాడ్స్ ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్ 'ఏఐఆర్' (ఆల్ ఇండియా ర్యాంకర్స్).

ఈటీవీ విన్ వేదికగా విడుదలైన ఎఐఆర్- ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్, నేటి విద్యావ్యవస్థలోని లోపాలను, విద్యార్థులపై ఉండే ఒత్తిడిని కళ్ళకు కట్టినట్లు చూపించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ అంటే అది కేవలం చదువు మాత్రమే కాదు, విద్యార్థుల పాలిట ఒక యుద్ధరంగం. పదో తరగతి పూర్తయిన విద్యార్థులను, తల్లిదండ్రులను యాడ్స్ ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ఈ నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్ 'ఏఐఆర్' (ఆల్ ఇండియా ర్యాంకర్స్). విజయవాడలోని ఒక ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ర్యాంకర్స్ కాలేజీ నేపథ్యంలో సాగే ఈ కథ, ర్యాంకుల పిచ్చిలో పడి విద్యార్థులు, తల్లిదండ్రులు తమ ఇష్టాలను ఎలా పణంగా పెడుతున్నారో అనే విషయాన్ని నేటి తరానికి కళ్లకు కట్టినట్లు చూపించింది.
కథా నేపథ్యం:
అర్జున్ (హర్ష్ రోషన్), రాజు (భాను ప్రకాష్), ఇమ్రాన్ (జయతీర్థ) అనే ముగ్గురు భిన్నమైన నేపథ్యాలు కలిగిన కుర్రాళ్ళు విజయవాడలోని 'ఆల్ ఇండియా ర్యాంకర్స్' కాలేజీలో ఐఐటీ కోచింగ్ కోసం చేరుతారు. అర్జున్ తనకి ఇష్టమైన అమ్మాయి కోసం అక్కడికి వస్తే, ఇమ్రాన్ తన పేదరికం నుండి బయటపడాలని, రాజు తండ్రి బలవంతం మీద అక్కడ చేరతారు. వీరు ముగ్గురూ ఆ కాలేజ్ కఠిన నిబంధనల నుండి ఎలా తప్పించుకోవాలని చూశారు అనేదే ఈ సిరీస్ ప్రధానాంశం. ఏడు ఎపిసోడ్లలో రూపొందిన ఈ సిరీస్ ఓ వైపు ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు మనసుకు హత్తుకుంటుంది.
విద్యార్థుల మనస్తత్వం:
దర్శకుడు జోసెఫ్ క్లింటన్ విద్యార్థుల మనస్తత్వాలను చాలా సహజంగా ఆవిష్కరించారు. చదువు అంటే ఇష్టం లేకపోయినా, తల్లిదండ్రుల ఆశల కోసం హాస్టల్ గదుల్లో బందీలయ్యే విద్యార్థుల వేదనను ఇందులో చూడవచ్చు. ముఖ్యంగా 'ఫ్రీడమ్ కోసం పంజరాన్ని ఎంచుకోవడమే చదువు' అనే డైలాగ్ నేటి విద్యా విధానంపై ఒక బలమైన విమర్శగా నిలుస్తుంది. ప్రధాన పాత్రలు పోషించిన హర్ష్ రోషన్, భాను ప్రకాష్, జయతీర్థలు తమ నటనతో ప్రాణం పోశారు. వారు కేవలం నటుల్లా కాకుండా, మన పక్కింటి అబ్బాయిల్లా, మనతో కలిసి చదువుకున్న స్నేహితుల్లా అనిపిస్తారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో వారి నటన ప్రేక్షకులను కదిలిస్తుంది.
సహాయక పాత్రల బలం:
సునీల్ కాలేజ్ ఓనర్‌గా సాధారణంగానే కనిపించినప్పటికీ, నెగటివ్ ఛాయలున్న పాత్రగానే ప్రేక్షకుడికి అర్థమవుతుంది. చైతన్య రావు ఒక బాధ్యతాయుతమైన టీచర్‌గా మెప్పించారు. వైవా హర్ష తన మార్కు కామెడీతో నవ్వులు పూయించగా, సందీప్ రాజ్ మేనేజ్‌మెంట్ హెడ్‌గా గంభీరమైన పాత్రలో ఆకట్టుకుంటూనే, ఒక కామన్ ప్రేక్షకుడికి కోపం తెచ్చేలా తన నటనలో సహజత్వాన్ని చూపించాడు. ఈ పాత్రలన్నీ కథను ముందుకు నడపడంలో కీలక పాత్ర పోషించాయి.
సగటు ప్రేక్షకుడికి హాస్టల్ లైఫ్ గుర్తొచ్చేలా:
హాస్టల్ జీవితం గడిపిన ప్రతి ఒక్కరికీ ఈ సిరీస్ తమదే అన్నట్లుగా అనిపిస్తుంది. అందులో చూపిస్తున్న ఏదో ఒక పాత్ర వారి జీవితాలకు, తమ చుట్టు ఉన్న జీవితాలను ప్రతిబింబించినట్లే ఉంటుంది. హాస్టల్స్ లో మెస్ ఫుడ్, వార్డెన్ల కఠినత్వం, రాత్రిపూట దొంగతనంగా చేసే అల్లరి, స్నేహితుల మధ్య వచ్చే గొడవలు, ఇలా ప్రతి సన్నివేశం ప్రేక్షకులను తమ కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్తుంది. దర్శకుడు చిన్న చిన్న డీటెయిల్స్‌పై కూడా దృష్టి పెట్టడం విశేషం. సినిజిత్ అందించిన నేపథ్య సంగీతం కథలోని ఎమోషన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. మనోజ్ సినిమాటోగ్రఫీ విజయవాడ కాలేజీ వాతావరణాన్ని సహజంగా చూపించింది. మధ్యలో కొన్ని ఎపిసోడ్లు సాగదీసినట్లు అనిపించినా, చివరి రెండు ఎపిసోడ్లు కథను మళ్ళీ గాడిలో పెట్టి హృదయానికి హత్తుకునేలా ముగించాయి.
సామాజిక అంశాలు:
కేవలం చదువే కాకుండా, కాలేజీల్లో ఉండే కుల రాజకీయాలు, ప్రాంతీయ భేదాలను కూడా ఈ సిరీస్‌లో స్పృశించారు. ఒకానొక సన్నివేశం వివాదాస్పదమైనప్పటికీ, విద్యాసంస్థల్లో ఇలాంటి ధోరణులు ఎలా ఉంటాయో చూపించే ప్రయత్నం చేశారు. ఈ ఏఐఆర్ కాలేజీలో చదివే ఒక లారీ డ్రైవర్ కొడుకు ఒక చిన్న తప్పు చేస్తే వాళ్ల తండ్రిముందే కాలేజీ మేనేజ్మెంట్ హెడ్ నువు ఇంకా 10 వేలు ఫీజు కట్టాలి కదా అంటూ తండ్రిని, కొడుకుని అవమానపరిచే సీన్ ప్రేక్షకుడికి చాలా కోపం తెప్పిస్తుంది. సగటు పేదవాడు సైతం కార్పోరేట్ మాయలో పడి ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొంటారు అనే విషయాన్ని ఈ సన్నివేశం ద్వారా దర్శకుడు చాలా సహజంగా చిత్రీకరించాడు.
తల్లిదండ్రులకు సందేశం:
ఈ సిరీస్ కేవలం విద్యార్థుల కోసం మాత్రమే కాదు, తల్లిదండ్రుల కోసం కూడా. పిల్లల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, వారిపై ర్యాంకుల భారాన్ని మోపడం వల్ల కలిగే నష్టాలను ఇందులో అర్థవంతంగా చూపించారు. 'ఫీజు తగ్గితే ర్యాంక్ తగ్గుతుంది' అనే కార్పొరేట్ విద్యా సంస్థల వ్యాపార ధోరణిని కూడా ఇది ఎండగట్టింది. మొత్తంగా చెప్పాలంటే, 'ఏఐఆర్ - ఆల్ ఇండియా ర్యాంకర్స్ ' అనేది ఒక నిజాయితీ గల ప్రయత్నం. కొన్ని సినిమాటిక్ లిబర్టీలు తీసుకున్నప్పటికీ, విద్యార్థుల జీవితాల్లోని అసలైన సంఘర్షణను ఆవిష్కరించడంలో ఈ సిరీస్ విజయం సాధించింది. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సిరీస్ ఇది.
'ఆల్ ఇండియా ర్యాంకర్స్' (AIR)
తెలుగు వెబ్ సీరీస్
నటీనటులు: హర్ష్ రోషన్, భాను ప్రకాష్, జైతీర్థ
దర్శకుడు: జోసెఫ్ క్లింటన్
లభ్యం: ETV Win, Netflix
స్వర్ణ
96664 58088






