- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలుపెరుగని జెమీమా రోడ్రిగ్స్.. హీరోచిత పోరాటంతో వీరోచిత విజయం
ఓడిపోయిన జట్టు మైదానంలో కుప్పగూలి ఏడ్వటం, గెలిచిన జట్టు విజయనాదం చేస్తూ సంబరాలు జరుపుకోవడం మాత్రమే తెలిసిన క్రికెట్ మ్యాచ్‌లో గురువారం రాత్రి అందుకు పూర్తిగా భిన్నంగా ఓ అద్భతమే జరిగింది.

ఓడిపోయిన జట్టు మైదానంలో కుప్పగూలి ఏడ్వటం, గెలిచిన జట్టు విజయనాదం చేస్తూ సంబరాలు జరుపుకోవడం మాత్రమే తెలిసిన క్రికెట్ మ్యాచ్‌లో గురువారం రాత్రి అందుకు పూర్తిగా భిన్నంగా ఓ అద్భతమే జరిగింది. గురువారం రాత్రి యధాప్రకారం నా పనిలో మునిగి అప్పుడప్పుడూ ఇండియా, ఆస్ట్రేలియా మహిళా వరల్ట్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూస్తూ ఉన్నాను. ఇప్పటికే 7 సార్లు ప్రపంచకప్ గెలుచుకుపోయిన బలమైన ఆసీస్ జట్టు అంత సులభంగా చేజింగ్ టీమ్‌కు విజయాన్ని కట్టబెడుతుందని ఏ కోశానా నమ్మకం లేని స్తితిలోనే ఆటను చూశాను.
ఎన్నడూ లేనివిధంగా మూడో స్థానంలో ఆడాలని అయిదు నిమిషాలకు ముందు టీమ్ యాజమాన్యం చెబితే మైదానంలోకి వచ్చిన ముంబై ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి గట్టి పునాది వేయడమే కాకుండా కెప్టెన్ అవుట్ అయిన తర్వాత ఆమె చేయవలసిన స్కోర్‌ను కూడా తానే చేస్తానని, చివరి బంతి వరకు నిలిచి పోరాడతానని సంకల్ప బలంతో సాగింది. 127 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టే క్రమంలో ఎన్నిసార్లు ఆమె అలసిపోయిందో.. కొండలా కనబడుతున్న స్కోరు వణికిస్తున్న క్షణాల్లో కూడా ‘నిలబడు, గట్టిగా నిలబడు నీకు దేవుడు సహాయం చేస్తాడు’ అంటూ గట్టిగా అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటూ మహిళా క్రికెట్ చరిత్రలో, వన్ డే ప్రపంచ కప్ చరిత్రలో కనివిని ఎరుగని చిరస్మరణీయ విజయాన్ని ఇండియా జట్టుకు కట్టబెట్టిన క్షణాల్లో సింహనాదమూ, పెనురోదనా కలిస్తే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించిన చరిత్రను కళ్లారా చూశాను.
గెలిచినా, ఓడినా విషాద విలాపమే..
తోటి బ్యాట్స్ ఉమన్ అమన్‌జీత్ విజయానికి అవసరమైన చివరి ఫోర్ సాధించాక స్టేడియంలో జేమీమా రోడ్రిగ్స్ కుప్పకూలి విలపించడం. స్టేడియంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతిమంథానా, సహచర క్రీడాకారిణులు కోచ్‌ను, సహాయక సిబ్బందిని గట్టిగా కౌగలించుకుంటూ రోదించడం. ఒక విన్నింగ్ జట్టు శక్తినంతా కూడదీసుకని అద్భుతాన్ని సృష్టించామన్న భావనతో ఆనంద విషాదాశ్రువులను చిలికించడం.. తమ కళ్ల ముందు ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే ఇండియా మహిళల జట్టు విజయాన్ని ఎగరేసుకోవడం చూసి అంత మేటి క్రీడాకారులున్న ఆసీస్ మహిళా జట్టు బిత్తరపోయి చుట్టూ చూస్తూ కన్నీరు కార్చడం ఎప్పుడైనా చూశామా..? మైదానంలోని ఇరుజట్లూ విజయ పరాజయాలను పక్కనబెట్టి విలపిస్తుంటే స్టేడియంలోని వేలాదిమంది ప్రేక్షకులు ఆనందమో విషాదమో తెలియని స్థితిలో తామూ కన్నీళ్లు పెట్టడం.. ఇటీవలి కాలంలో ఎన్నడైనా చూశామా..
గత వరల్ట్‌కప్‌లో జట్టులో స్థానం కోల్పోయి షాక్‌కు గురైన జేమీమా.. ఈ దఫా వరల్డ్ కప్ జట్టుకు ఎంపికై కూడా చివరి 11 మంది జట్టులో ఉంటానా, ఆడతానా అనే అందోళతోనే గడిపిన జెమీమా భారత జట్టు ఆశలను తనవిగా చేసుకుని హీరోచితమైన అత్యుత్తమ గేమ్‌ను ప్రదర్శించింది. తీవ్రమైన అలసట, శక్తి కోల్పోయిన దశలో కూడా బైబిల్ లోని ‘నువ్వు గట్టిగా నిలబడు జీసస్ నీకు సాయం చేస్తాడు’ అనే మంత్ర వాక్యాన్ని పదే పదే తనలో తాను ఉచ్ఛరిస్తూ.. ఇక ఈ జీవితానికి ఈ ప్రదర్శన చాలు అనేంత మహిమాన్విత ఆటతీరును ప్రదర్శించింది.
ఇది మహిళల వన్డే ప్రపంచ కప్ రికార్డు ఛేజింగ్ స్కోర్‌ను బద్దలు గొట్టిన ఘటన కావచ్చు. అంతకు మించి 338 పరుగుల భారీ స్కోరును చూసి ఓటమి తప్పదనుకుంటున్న అభిమానులు, ప్రేక్షకుల హృదయాలు ఉప్పొంగేలా మన మహిళా జట్టు సాగించిన విజయనాదం. కీలక మ్యాచ్‌లలో వెనుకంజ వేస్తూ తలదించుకుంటున్న క్షణాలను పక్కనబెట్టి ఇది నేను సాధించిన ఫిప్టీ, హండ్రెడ్ కాదు, నా ఘనత కానే కాదు ఇది జట్టు విజయం కోసం ఆడుతున్న ఆట, జట్టును గెలిపించాలని ఆడుతున్న ఆట అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుని జెమిమా ఆడిన ఆట ఇది.
ఏ క్రీడలో అయినా ఆనంద విషాదాల సంగమస్థితిని ఈ స్థాయిలో ప్రపంచం ఎన్నడూ చూసి ఉండదు. గెలిచిన జట్టు, ఓడిన జట్టు కూడా విలపించడం ఎన్నడూ చూసి ఉండం. 20 సంవత్సరాల పాటు భారత జట్టుకు ఆడి 2017 మహిళా వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై ఓటమి చవిచూసి చేష్ట్యలుడిగిన స్థితిలోనూ నిబ్బరంగా తేరుకుని నిలిచి ప్రెస్‌మీట్‌లో విషాదపు క్షణంలోనూ హుందాగా మాట్లాడిన మిథాలీరాజ్ గుండె నిబ్బరాన్ని ప్రపంచమంతా చూసిందప్పుడు. కంటి చుక్క బయటకు రాకుండా విషాదాన్ని కళ్లలో దాచుకుని నిబ్బరానికి నిర్వచనంగా నిలిచిన మిథాలీని ఆనాడు చూశాం. అది ఆమెకే చెల్లు అనుకున్నాం.
కానీ, ఈ 2025 అక్టోబర్ 30న ఒక రివర్స్ అద్భుతం క్రీడా ప్రపంచాన్ని కమ్మేసింది. గెలుపు ఓటములను సమాన స్థితిలో చూడాలని బయటకు అందరం చెప్పవచ్చు కానీ, మైదానంలో అతి పెద్ద స్కోరును చేశాక దాన్ని నిలబెట్టుకోవాలని చూసిన జట్టుకు, ప్రాణాలొడ్డి మరీ ఛేదించిన జట్టుకు అలాంటి సమాన స్థితిని ప్రదర్శించాలని చెప్పగలమా.. స్వప్న నగరం అని పేరొందిన ముంబై మహానగరంలో ఒక చారిత్రక స్వప్నం భారత్‌కు అనుకూలంగా ఫలించిన క్షణాలను ప్రేక్షకులు, క్రీడాకారులు, కోచ్‌తో సహా సహాయక సిబ్బంది మాత్రమే కాకుండా కామెంటేటర్లు కూడా వివశులై అరచిన క్షణాలను ఎంతమంది చూశారు గత రాత్రి.
ఆసీస్ నిర్దేశించిన 339 పరుగల టార్గెట్‌ను 9 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి ఫైనల్ దూసుకెళ్లిన భారత మహిళా జట్టు తనకు మాత్రమే ఈ అర్హత చెందుతుందని నిరూపించింది. గత పాతికేళ్లుగా మహిళా జట్టును ఊరిస్తున్న వన్డే ఫైనల్ మ్యాచ్‌లోనూ గెలిచి తొలిసారిగా ప్రపంచకప్ గెల్చుకుంటుందని, గెల్చుకోవాలని ఆశించడంలో ఏమాత్ర తప్పు లేదు.
భావోద్వేగమా.. నీ పేరు జెమీమా రోడ్రిగ్స్
జట్టును గెలిపించిన క్షణాల్లో, సహచరులను గట్టిగా కౌగలించుకున్న క్షణాల్లో, తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంటున్న క్షణాల్లో విలపించడమే తన జెస్టర్‌గా చేసుకున్న షాక్ తెప్పించిన జెమీమా ఎన్ని ఎదురుదెబ్బలను, ఎన్ని అవమానాలను గత నెలరోజులుగా ఎదుర్కొందో మాటల్లో చెప్పలేం. గత నెల అంతా చాలా కష్టంగా గడించిందని కానీ, ఇప్పుడిది కలలా ఉందని నమ్మలేకపోతున్నానని కన్నీళ్ల మధ్యే జెమీమా తెలిపింది. ఆ కన్నీళ్లకు వెనుక తీవ్ర విషాదం దాగుంది. మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ గత ప్రపంచకప్‌లో తనకు చోటు దక్కలేదు. ఈ ప్రపంచ కప్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లలో రెండు సార్లు డకౌట్ అయిన జెమీమా మరో రెండు మ్యాచుల్లో పెద్దగా స్కోర్ చేయలేదు. దీంతో ఇంగ్లండ్ జట్టుతో జరిగిన ఐదో వన్డేలో జట్టు కూర్పులో భాగంగా ఏకంగా తనకు పక్కన పెట్టేశారు.
అయితే, న్యూజిలాండ్‌లో కీలక పోరులో మళ్లీ జట్టులోకి వచ్చిన రోడ్రిగ్స్ 55 బంతుల్లో 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇక సెమీస్‌లో భారీ శతకంతో తన సత్తాను చాటుకోవడం కాదు.. భారత మహిళా జట్టు ఆశలను పునరుజ్జీవింప చేసింది. తగిన స్కోరు చేయలేక ఈ టోర్నీలో తాను ఏడ్వని రోజు లేదని, మానసికంగా తీవ్రమైన ఆందోళనతో ఉన్నానని, జట్టు కోసం నిలబడాలని మాత్రమే అనుకుంటే మిగిలిందంతా జీసస్ చూసుకున్నాడని, బంతి బంతికి దీప్తి ఇచ్చిన ప్రోత్సాహం కానీ, తాను ఏడుస్తున్నప్పుడల్లా ఓదార్చిన అరుంధతిని కానీ మరవలేనని, సొంత మైదానంలో అభిమానుల ప్రోత్సాహం ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదని జెమీమా నమ్రతతో చెప్పింది.
0, 32, 0, 33 ఇవీ తొలి నాలుగు మ్యాచుల్లో జేమీమా సాధించిన స్కోరు. నీ ఆట సరిపోదు, పక్కన బెట్టేస్తున్నాం అని, ప్రపంచ కప్ లో ఇంగ్లాడుతో మ్యాచ్‌కి ముందు టీమ్ యాజమాన్యం చెప్పిన మాటలు ఆమెను కుంగదీసినా కుప్పగూలిపోలేదు. జట్టులోకి తిరిగిరావడం, రావడంతోనే కివీస్‌పై హాఫ్ సెంచరీతో విరుచుకుపడటం,. సెమీస్‌లో అజేయ శతకంతో ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సెమీస్‌లోనే చితకబాది ఇంటి దారి చూపించడం మామూలు విషయాలు కావు. భారత మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త చరిత్రను లిఖించడంలో జెమీమాదే కీలకపాత్ర కావడం మరీ విశేషం.
జట్టులో స్థానం లేదన్న కసి, భారత మహిళా జట్టులో స్థానం ఉండదేమో అన్న ఆవేదన, ఒక్క చాన్సుతో తనను తాను నిరూపించుకోవాలన్న తపన.. ఇలా ఎన్ని కలిసి జెమీమా చేత రికార్డు ఛేజింగ్ స్కోర్ కొట్టేలా చేసి ఉంటాయి? క్రికెట్‌కి ముందు హాకీ జాతీయ స్థాయి ప్లేయర్, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ ప్లేయర్ కూడా అయిన జెమీమా నాలుగేళ్ల వయసు నుంచే క్రికెట్‌తో పాటు ఈ అన్ని ఆటల్లో ప్రావీణ్యం పొంది, చివరకు క్రికెట్‌ను వృత్తిగా మల్చుకుంది. తల్లి తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ 'పొట్టి పిల్ల' ఇవాళ భారత మహిళా జట్టు ఆశలు నిలబెట్టి సగర్వంగా నిలబడింది. అవమానం, జట్టులో చోటు కోల్పోవడం, కుంగుదల ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా లక్ష్యాన్ని వదలకుండా అవకాశం దొరికినప్పుడు తనను తాను నిరూపించుకున్న ఈ చిన్నారి... యావత్ దేశ యువతులకు చిరకాలం స్ఫూర్తి నిచ్చే ధ్రువతార అవుతుందని అంటే అతిశయోక్తి కాదు.
వందేళ్లకు ముందు లేచి నిలబడిన భారతీయ మహిళ, ఈ ఆధిపత్య ప్రపంచంలో తన స్థానం కోసం పరుగు తీసిన మన మహిళ... తన విజయాలను ఇవాళ క్రికెటర్ జేమీమాలోనూ చూసుకుంటోంది. అవకాశాలను ఒడిసిపట్టుకోవడం తెలిస్తే, అవమానాలను దిగమింగి స్థిర సంకల్పంతో ముందుకు సాగితే దాని పేరు జెమీమా రోడ్రిగ్స్..
- రాజశేఖర






