గురువు వెనుతిరుగుడంటే.. వ్యవస్థ పతనానికి సంకేతం!

by Ravi |   (  Updated:2025-10-24 01:16:06  IST  )

ఒకప్పుడు విద్య అనేది ఆత్మీయత, విలువలు, గౌరవం అనే త్రివేణి స్రవంతిలా ప్రవహించింది. ఇప్పుడు అది గణాంకాలు, ఫలితాలు, రికార్డుల గజదొంగల వలలో చిక్కుకుంది. బోధనకు అంకితమై ఉన్న గురువు

గురువు వెనుతిరుగుడంటే.. వ్యవస్థ పతనానికి సంకేతం!
X

ఒకప్పుడు విద్య అనేది ఆత్మీయత, విలువలు, గౌరవం అనే త్రివేణి స్రవంతిలా ప్రవహించింది. ఇప్పుడు అది గణాంకాలు, ఫలితాలు, రికార్డుల గజదొంగల వలలో చిక్కుకుంది. బోధనకు అంకితమై ఉన్న గురువు, క్రమంగా పరిపాలనా బంధనాల బానిసగా మారుతున్నాడు. ఇది వ్యక్తిగత వైఫల్యం కాదు.. విద్యా వ్యవస్థ పతనానికి సంకేతం.

‘గురువు వెనుతిరుగుతుండు’ అనే మాట మనకు ఒక హెచ్చరిక. దాన్ని వినగలిగితేనే మన భవిష్యత్తు నిలుస్తుంది. గురువుకు గౌరవం, స్వేచ్ఛ, భద్రత ఇవ్వగలిగితేనే విద్యార్థికి సృజనాత్మకత, జ్ఞానం, ఆనందం వస్తాయి.ఉపాధ్యాయుడికి బోధన వృత్తి పట్ల నిరాశ పెరగడం, విద్యార్థి-గురువు సంబంధం బలహీనపడడం దేశ భవిష్యత్తుకు ప్రమాదం.

గణాంకాల బందీగా గురువు

భారతదేశంలో గురువును ‘ఆచార్య దేవోభవ’ అని పూజిం చిన కాలం ఉంది. కానీ నేటి విద్యా వ్యవస్థలో గురువు ఒక అధి కార యంత్రంలో భాగంగా మారిపోయారు. ప్రైవేట్ పాఠశాలలలో ‘ఫలితాలు’ అన్న పదం గురువును గణాంకాల బందీగా మార్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో ‘రికార్డు పనులు‘ గురువును బోధన నుంచి దూరం చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు రోజంతా బోధనలో కంటే డేటా ఎంట్రీ, రిజిస్టర్ రాయడం, వివిధ పథకాల పర్యవేక్షణలో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాడు.

కుదించుకుపోతున్న బోధనా స్వేచ్ఛ

పాఠశాలల్లో బోధనా స్వేచ్ఛ క్రమంగా తగ్గిపోతోంది. ప్రతి పాఠం ‘మైక్రో ప్లాన్‘లో బంధించబడింది. ‘ఇంత సమయానికి ఇంత చదువు‘ అనే గణాంకం గురువుపై ఒత్తిడిగా మా రింది. ఒక మంచి సైన్స్ టీచర్ తన సృజనాత్మక పద్ధతులను వినియోగించాలంటే కూడా అనుమతి అవసరం అవుతోంది. పరీక్షల కేంద్రీకరణ, సిలబస్ భారం, మార్కుల ఆధారిత ఫలితాలు.. ఇవన్నీ బోధనను యాంత్రికంగా మార్చాయి.

గురువులు కాదు... రిపోర్టింగ్ యూనిట్స్!

ప్రైవేట్ పాఠశాలలలో గురువులు ‘రిపోర్టింగ్ యూనిట్స్ ‘గా మారిపోయారు. విద్యార్థుల అభ్యాసం కంటే తల్లిదండ్రుల సంతృప్తి, ఫీజు వసూళ్లు, మార్కుల రేటింగ్‌లు ప్రాధాన్యం పొందుతున్నాయి. ఒక ఉపాధ్యాయుడు ఒకే రోజులో ఐదు నుండి తొమ్మిది పీరియడ్స్ బోధించి, దాని తర్వాత ‘పెర్ఫార్మెన్స్ రిపోర్ట్‘ సిద్ధం చేయాలి, తరువాత ఫోన్‌లో తల్లిదండ్రులతో మాట్లాడాలి.. దీనికి విరామం లేదు. వారికి చెల్లించబడే వేతనం కూడా కనీస జీవన ప్రమాణాలకు సరిపోకపోవడం పరిస్థితిని మరింత దయనీయంగా చేస్తోంది.

ఆసక్తి, ఉత్సాహం రెండు పోతున్నాయ్!

గ్రామీణ ప్రాంతాల్లో ఒక పాఠశాలలో ముగ్గురు గురువులు ఉంటే, విద్యార్థులు 150 మంది ఉంటారు. మరోవైపు ఏకోపాధ్యాయ పాఠశాలలు. వీటిలో తరగతుల బోధనతో పాటు మధ్యాహ్న భోజన పథకం, సర్కార్ ఆదేశాలు, వివిధ సర్వేలు, ఎన్నికల పనులు... ఇవన్నీ గురువుల భుజాలపై పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో బోధన నాణ్యతను కాపాడటం కష్టం. విద్యార్థులు ఆసక్తి కోల్పోతున్నారు, గురువులు ఉత్సాహం కోల్పోతున్నారు. అధిక పరిపాలనా ఒత్తిడి, తగిన గౌరవం లేకపోవడం, బోధన స్వేచ్ఛ కోల్పోవడం వంటి కారణాల వల్ల ఉపాధ్యాయులు మానసికంగా అలసిపోతున్నారని ఈ మధ్య పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి. కొంతమంది ఉపాధ్యాయులు డిప్రెషన్, ఆందోళన, అసహనం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇది విద్యార్థుల అభ్యాస వాతావరణాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది.

పరీక్షకు తయారీగా విద్య

విద్య అంటే మార్కులు సంపాదించడం కాదు. మానవత్వం, విలువలను పెంపొందించటం. కానీ నేటి విధానం ఫలితాలను మాత్రమే కొలుస్తోంది. మనం విద్యను ‘జీవితానికి తయారీ‘గా చూడకుండా, ‘పరీక్షకు తయారీ‘గా మార్చేశాం. దీని ఫలితంగా సృజనాత్మకత, స్వతంత్ర ఆలోచన, సమాజం పట్ల బాధ్యత అనే విలువలు తగ్గిపోతున్నాయి. గురువులకు స్వేచ్ఛ ఇవ్వాలి, బోధన పద్ధతులలో స్వతంత్రత ఉండాలి. ప్రతి గురువు తన సృజనాత్మకతను ప్రదర్శించగల వాతావరణం అవసరం. పరిపాలనా పనులు తగ్గించాలి, విద్యా శాఖ గురువులను రికార్డు పనుల బంధనాల నుంచి విముక్తం చేయాలి. ఒక ప్రత్యేక పరిపాలనా విభాగం ఈ పనులను నిర్వర్తించాలి. ఉపాధ్యాయుల మానసిక ఆరోగ్యానికి మద్దతు, సలహా కేంద్రాలు, శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి, గురువుల మానసిక శ్రేయస్సును కాపాడాలి. వేతనాలు, గౌరవం పెంచాలి, ‘గురువు అంటే గౌరవం‘ అన్న భావనను తిరిగి తెచ్చుకోవాలి. సరైన వేతనం, స్థిర ఉద్యోగ భద్రత అవసరం. విద్యార్థి, గురువు సంబంధం పునరుద్ధరణ జరగాలి. సాంకేతికత మధ్యలో మానవ సంబంధం కనుమరుగవుతోంది. ఈ అనుబంధాన్ని తిరిగి బలపరచాలి.

గురువు వెళ్తున్నారు అంటే..

గురువు వెళ్తున్నారు అంటే అది కేవలం ఉద్యోగం వదిలి పెట్టడం కాదు.. ఒక విలువ వదిలి పెడుతున్నట్లు అర్థం. బోధన వృత్తి పట్ల నిరాశ పెరగడం, విద్యార్థి–గురువు సంబం ధం బలహీనపడడం దేశ భవిష్యత్తుకు ప్రమాదం. అందుకే ఇప్పుడు అత్యవసరమైన పని.. విద్యను తిరిగి మానవతా విలువల దిశగా తిప్పడం. గురువుకు గౌరవం, స్వేచ్ఛ, భద్రత ఇవ్వగలిగితేనే విద్యార్థికి సృజనాత్మకత, జ్ఞానం, ఆనందం వస్తాయి. గురువు నిలబడితేనే దేశం ఎదుగుతుంది. ‘గురువు వెనుతిరుగుతుండు‘ అనేది ఒక హెచ్చరిక. దాన్ని వినగలిగితేనే మన విద్యా వ్యవస్థ నిలబడగలదు.

-మహేశ్వరం భాగ్యలక్ష్మి

అసిస్టెంట్ ప్రొఫెసర్

95056 18252

Next Story