జలమండలి బిల్లు వసూలుదార్ల వ్యథ..!

by Bhoopathi Nagaiah |

దశాబ్దన్నర పాటు జలమండలి కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన సిబ్బందికి నేటికీ సంస్థ నుండి సరైన ఉద్యోగ భద్రత లభించడం లేదు.

జలమండలి బిల్లు వసూలుదార్ల వ్యథ..!
X

హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) లో గత 15 సంవత్సరాలుగా తమ సేవలను అందిస్తున్న 673 మంది బిల్లు వసూలుదార్లు, మీటరు రీడర్ల భవిష్యత్తు నేడు తీవ్ర సంక్షోభంలో పడింది. దశాబ్దన్నర పాటు జలమండలి కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించిన ఈ సిబ్బందికి నేటికీ సంస్థ నుండి సరైన ఉద్యోగ భద్రత లభించడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వు (జీవో 60) ప్రకారం వీరంతా నెలకు రూ. 15,600 కనీస వేతనాన్ని పొందుతున్నారు. జలమండలిలో వివిధ విభాగాలలో మొత్తం 5,347 మంది ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ, ఈ 673 మంది బిల్లు వసూలుదార్లను మాత్రం ఆర్థిక విభాగం, పట్టణాభివృద్ధి శాఖ అధికారిక పత్రాలలో చూపకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు.

అధికారిక నమోదుకు నిరాకరణ

ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను నమోదు చేసి, నిర్ధారించడానికి ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్ అనే సరికొత్త ఆన్‌లైన్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్ ద్వారా సిబ్బంది వివరాలను నమోదు చేసుకుంటే ఉద్యోగ భద్రత లభిస్తుందనే ఆశతో, ఈ బిల్లు వసూలుదార్లు తమను కూడా పోర్టల్‌లో నమోదు చేయాలని జలమండలి అధికారులను పదేపదే కోరారు. అయితే, అధికారులు అందుకు నిరాకరిస్తూ, "మీ పోస్టులకు అధికారికంగా మంజూరైన స్థానాలు లేవు" అని మొక్కుబడి సమాధానం చెప్తున్నారు. 04/08/2023 నాటికి జలమండలి మొత్తం 3,991 మంది ఉద్యోగులకు మంజూరైన స్థానాలను తెచ్చుకున్నప్పటికీ, ఈ ప్రక్రియలో తమ బిల్లు వసూలుదార్ల పోస్టులను మాత్రం కావాలనే పట్టించుకోలేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు.

లెక్కల్లో వ్యత్యాసం..

తాజాగా ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో మొత్తం 4,674 మంది ఉద్యోగులను నమోదు చేసినట్లు లెక్కలు చూపుతున్నాయి. అంటే, గతంలో మంజూరైన 3,991 మంది కంటే అదనంగా మరో 683 మంది సిబ్బందిని పోర్టల్‌లో చేర్చారు. తమకు మంజూరైన స్థానాలు రానప్పుడు, ఈ అదనంగా చేర్చిన 683 మందికి మంజూరైన స్థానాలు ఎలా వచ్చాయి, వారు ఎప్పుడు విధుల్లో చేరారు, ఏ విధంగా వారిని ఎంపిక చేశారు అనే అంశాలపై జలమండలి అధికారులు పూర్తి పారదర్శకతతో కూడిన వివరణ ఇవ్వాలని 673 మంది ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీని వెనుక నియామకాల్లో ఏదైనా అవకతవకలు జరిగాయేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పేరు మీద సంస్థ తరఫున చెల్లిస్తున్న బిల్లులు, ఇతర ఆర్థిక లావాదేవీల లెక్కలు వేరుగా ఉండటం, ఆ లెక్కలు బయటకు వస్తాయనే భయంతోనే తమను ఆర్థిక, పట్టణాభివృద్ధి శాఖల నమోదులో చూపించడం లేదని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆందోళన ఫలితం

తమను ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలని 06/11/2025 నుండి బిల్లు వసూలుదార్లు నిరంతరంగా పోరాటం చేస్తున్నారు. ఈ నిరసనలకు ప్రతిస్పందనగా, జలమండలి పాలకవర్గం అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వు (జీవో 60) ప్రకారం అమలు చేస్తున్న కనీస వేతనం పద్ధతి నుండి వీరిని తొలగించి, కేవలం 'కమిషన్ ఆధారితం' లేదా సేవల ఆధారంగా రుసుము చెల్లించే పద్ధతి కిందకు తీసుకువస్తున్నారు. ఈ మేరకు 03/12/2025న జలమండలి టెండర్లు కూడా పిలవడం జరిగింది. 15 సంవత్సరాల స్థిరమైన సేవ తర్వాత, హఠాత్తుగా కనీస వేతనాన్ని తొలగించి, వారిని కేవలం కమిషన్ పద్ధతికి మార్చడం వారి ఆర్థిక భద్రతను పూర్తిగా దెబ్బతీస్తుంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అన్యాయమైన కమిషన్ పద్ధతికి మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి.

వెంకగారి భూమయ్య

98485 59863

Next Story