విద్యార్థి టీచర్ రేషియో సవరించాలి..!

by Ravi |   (  Updated:2026-02-12 00:31:04  IST  )

విద్య హక్కు చట్టం–2009 ప్రకారం, ప్రాథమిక పాఠశాలలో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలని, ఉన్నత ప్రాథమిక స్థాయిలో ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయులు ఉండాలి..

విద్యార్థి టీచర్ రేషియో సవరించాలి..!
X

విద్య హక్కు చట్టం–2009 ప్రకారం, ప్రాథమిక పాఠశాలలో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలని, ఉన్నత ప్రాథమిక స్థాయిలో ప్రతి 35 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని పేర్కొన్నారు. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు వారీగా ఉపాధ్యాయులు ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రాలవారీగా ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి భిన్నంగా ఉంది. విద్యార్థుల సంఖ్యను అనుసరించి ఈ నిష్పత్తి మారుతుంది. విద్య హక్కు చట్టం ప్రకారం, 30 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని మాత్రమే పేర్కొన్నారు గాని, 30 మందికి ఒకరే ఉండాలని ఎక్కడా చెప్పలేదు.. 30 మందిలోపు విద్యార్థులు ఉన్నా అవసరాన్ని బట్టి ఎక్కువమంది ఉపాధ్యాయులను నియమించవచ్చు. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో ఉపాధ్యాయ–విద్యార్థి నిష్పత్తి మెరుగ్గా ఉందని, సుమారు ప్రతి 17 మందికి ఒక ఉపాధ్యాయుడు అందుబాటులో ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇది రాష్ట్ర స్థాయి సగటు మాత్రమే. వాస్తవ పరిస్థితి పాఠశాల వారీగా భిన్నంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు మారుతూ ఉండటంతో ఉపాధ్యాయ అవసరాల్లో కూడా తేడాలు వస్తుంటాయి. ప్రస్తుతం తెలంగాణలో 24,224 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 16 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. పనిచేస్తున్న ఉపాధ్యాయులు 1.06 లక్షల మంది కాగా, మంజూరైన పోస్టులు 1.25 లక్షలు. అంటే సుమారు 19 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హేతుబద్ధీకరణ ద్వారా కొన్ని పోస్టులను మిగులు చూపించినప్పటికీ దాదాపు పది వేల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మళ్లీ హేతుబద్ధీకరణ జరుగుతుందనే వార్తల నేపథ్యంలో ఖాళీలు తగ్గిపోతాయని చెప్పబడుతున్నా, వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. ప్రైవేట్ పాఠశాలలతో పోటీని తట్టుకుని నిలబడాలంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. పదిమందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు, ఇరవై మందికి పైగా ఉన్న పాఠశాలలకు ముగ్గురు, ముప్పై మందికి పైగా ఉన్న పాఠశాలలకు నలుగురు ఉపాధ్యాయులను కేటాయిస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరగడంతో పాటు డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలపై నిరంతర పర్యవేక్షణతో పాటు సముచిత ఉపాధ్యాయ నియామకాలు అత్యవసరం.

- రావుల రామ్మోహన్ రెడ్డి,

63054 58920

Next Story