- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రం అప్పులపాలు.. ప్రభుత్వానికి సలహలివ్వండి!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఒక సభలో మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితిని దాపరికం లేకుండా బహిరంగపర్చారు. ముఖ్యంగా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఒక సభలో మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితిని దాపరికం లేకుండా బహిరంగపర్చారు. ముఖ్యంగా 'నేను రాష్ట్ర ఆదాయం 3 లక్షల కోట్లు అనుకున్నాను కానీ అది రెండు లక్షల కోట్లు మాత్రమే అని ఇప్పుడు తెలు స్తోంది. దీంతో ప్రభుత్వ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంద'ని చెప్పారు.
ఈ నేపథ్యంలో మన ప్రభుత్వాన్ని ఎలా నడుపుకోవాలో, తెలంగాణాను అప్పులు లేని తెలంగాణాగా ఎలా మలుచుకోవాలో, మనం ఏ ఏ త్యాగాలకు సిద్ధపడాలో ప్రభుత్వానికి సూచిస్తూ మేధావులు సమాజానికి మంచి మార్గం చూపిం చాలి. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వాగ్దానాల్లో అప్పుడున్న పరిస్థితుల్లో వారి అవగాహన మేరకు పలు హామీలను ఇచ్చింది. కానీ అవి ప్రాక్టికల్‌గా అనుభవంలోకి వచ్చేట ప్పటికి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయితే ఏ ప్రభుత్వమైనా తన పూర్తి హామీలను కేవలం 15 నెలల్లో పూర్తి చేయలేదు. కానీ ప్రతిపక్ష నాయకులు వాగ్దానాలు ఇంకా నెరవేరలేదు అంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. అది వారి పని.. ఎందుకంటే ప్రభుత్వ పాలనా లోపాలు బహిర్గతం చేయడమే ప్రతిపక్షాల నైజం. ప్రభుత్వాన్ని అనేక కోణాల్లో వారు విమర్శిస్తూ ఉంటారు. ప్రభుత్వం కూడా తగిన సమాధానం చెప్పుకుంటూ ముందుకు పోతూ ఉంటుంది. అది సహజం.
రాష్ట్రాన్ని అధోగతికి తెచ్చిందెవరు?
తన ప్రభుత్వం గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలంగాణ సీఎం చాలా విపులంగా అన్ని వర్గాల వారికి వివరించడం జరిగింది. దీంతో ఎలా ముందుకు పోదాం అనేది అందరి ముందూ ప్రశ్నగా నిలిచింది. ఈ రాష్ట్రాన్ని ఎన్నో కలలతో ఎన్నో త్యాగాల ఫలితంతో మనం తెచ్చుకున్నాం. అహంకారి అయిన ఓ రాజకీయ నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకొని గతంలో ఎంతో తప్పు చేశాం. వందేళ్లపాటు చక్కగా ఉండే సెక్రటేరియట్‌ను కూలగొట్టి దాదాపు 1700 కోట్ల రూపాయలు అప్పుచేసి వెచ్చించి కట్టాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది ఎవరు?
అవినీతికి అడ్డుకట్ట వేయాలి
పాలనలో అవినీతి చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆఫీసుల్లో గానీ, ప్రజా జీవితంలో గాని మోసాలు ఘోరాలు ఇవన్నీ అరికట్టాలి. ప్రభుత్వ ఉద్యోగుల మీద నిఘా పెట్టడం, అవినీతి అధికారులను కట్టడి చేయడం అత్యవసరం. గత పదేళ్లుగా కేసీఆర్ ఎన్ని అయితే కేసులు పట్టుకున్నారో వాటికి రెండు రెట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏసీబీ కేసులు పట్టడం జరిగింది. అవినీతిని నాలుగు పాదాలు మీద నడిపించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని మేధావి వర్గాలు చెబుతున్నాయి. కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ ధనాన్ని కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచుకున్నారని ఆరోపణలు.. ఆయన తాబేదారులతో సహా వారి ఆదాయం వాళ్ళ ఆస్తులు ఎలా పెరిగినయో.. వాళ్ళు ఎలాంటి దుర్మా ర్గాలు చేశారో ఒక్కొక్క విషయం మీద ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలకు పూర్తి అవగాహన వస్తుంది.
అందుకే ఇంత భారం!
కాంగ్రెస్ పార్టీలో కూడా నాయకులందరూ ఏకతాటి మీదకు వచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ త్యాగాలు చేస్తేనే తెలంగాణ మరోసారి నిలబడుతుంది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పుడు తెలంగాణలోని ప్రతి ఒక్కరి మీద కేవలం 1,13,000 రూపాయల భారం ఉండేది. అటువంటిది ఈనాడు ఒక్కొక్కరి మీద దాదాపు 2.3 లక్షల రూపాయలు అప్పుగా ఉందంటే అప్పుచేసి పప్పుకూడు అన్న చందాన కేసీఆర్ కుటుంబ సభ్యులు దోచిన ఆస్తులే ప్రజలపై ఇంత భారం మోపాయని అర్థమవుతుంది. ఆర్థిక సంస్కరణలు ఏవి చేపడితే ప్రభుత్వానికి వనరులు ఏర్పడతాయి అనే విషయంపై ప్రతి చిన్న అంశాన్ని రీసెర్చ్ కోణంలో చూసి చక్కటి మార్గాన్ని ఈ ప్రభుత్వానికి ప్రతిపాదించాలి. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను విప్పి చెబుతున్న ముఖ్యమంత్రి నిజాయితీ మీద నమ్మకం ఉంచి, ఆయనకు చేయూతనిచ్చి తెలంగాణాని భారత దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మార్చుకుందాం.
ఆళ్ల రామకృష్ణ
విశ్రాంత చీఫ్ ఇంజనీర్,
99669 44244






