గెలిచిన సమాఖ్య స్ఫూర్తి.. కొంపముంచిన అతివిశ్వాసం!

by Ravi |   (  Updated:2026-04-21 01:15:58  IST  )

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న రాజకీయ, వ్యూహాత్మక కారణాలు, సమాఖ్య స్ఫూర్తి, ప్రాంతీయ సమతుల్యతపై ప్రభావాలను విశ్లేషించే వ్యాసం.

గెలిచిన సమాఖ్య స్ఫూర్తి.. కొంపముంచిన అతివిశ్వాసం!
X

భారత పార్లమెంట్‌లో మొన్న చోటుచేసుకున్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన పరిణామాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచాయి. లోక్‌సభలో ఈ బిల్లు ఆమోదం పొందడంలో ప్రభుత్వానికి ఎదురైన విఫలం సాధారణ సంఖ్యాబలం లోపం మాత్రమే కాకుండా, లోతైన వ్యూహాత్మక లోపాలను బహిర్గతం చేసింది. మహిళా రిజర్వేషన్ వంటి సున్నితమైన సామాజిక అంశాన్ని నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం, ప్రాంతీయ సమతుల్యతపై ఆందోళనలు రేకెత్తించడం, ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం వంటి పరిణామాలు ఈ ఓటింగ్‌కు విస్తృత రాజకీయ ప్రాధాన్యతను తీసుకువచ్చాయి. ఏదేమైనా ఈ ఘటన సమాఖ్య స్ఫూర్తి, రాజ్యాంగ పరిరక్షణ, రాజకీయ సమన్వయం ఎంత ముఖ్యమో మరోసారి గుర్తు చేసింది.

131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోవడం ఎన్డీయే ప్రభుత్వ వ్యూహాత్మక తప్పిదం. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంలో ప్రభుత్వం విఫలమవ్వడం వెనుక అనేక రాజకీయ పొరపాట్లు ఉన్నాయి.. ఇదే ప్రతిపక్షాలకు ఒక ఆయుధాన్ని అందించింది.

సమాఖ్య సమతుల్యతను కాపాడి..

రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 నిబంధనలు ఇక్కడ అత్యంత కీలకం. రాజ్యాంగ రూపకర్తలు సమాఖ్య స్ఫూర్తిని రక్షించడానికి, ఏ ఒక్క పార్టీ కూడా రాజ్యాంగాన్ని ఏకపక్షంగా మార్చకుండా ఉండటానికి 'ప్రత్యేక మెజారిటీ' (మూడింట రెండు వంతుల మెజారిటీ) నిబంధనను చేర్చారు. ఈ నిబంధన ప్రాముఖ్యత ఈ ఓటింగ్‌లో స్పష్టంగా కనిపించింది. కేవలం సంఖ్యాబలం ఉన్నంత మాత్రాన సమాఖ్య వ్యవస్థ ప్రాతిపదికలను మార్చడం సాధ్యం కాదని ఈ ఫలితం నిరూపించింది. రాజ్యాంగ రూపకర్తలు ఆశించిన సమాఖ్య సమతుల్యతను కాపాడటంలో ఈ మూడింట రెండు వంతుల మెజారిటీ నిబంధన రక్షణ కవచంలా నిలిచింది. నిజానికి ప్రభుత్వం తన సొంత సంఖ్యాబలంపై ఉన్న అతివిశ్వాసంతో ప్రతిపక్షాలను, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలను సంప్రదించకుండా ఏకపక్షంగా ముందుకు సాగింది. ఈ పరిణామం భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల అనివార్యతను మరోసారి చాటిచెప్పింది.

భయాలను పొగొట్టడంలో విఫలమవ్వడంతో..

జాతీయ పార్టీలు రాష్ట్రాల ప్రయోజనాలను విస్మరించినప్పుడు ప్రాంతీయ పార్టీలే సమాఖ్య వ్యవస్థకు కాపలాదారులుగా నిలుస్తాయని ఈ ఓటింగ్ ఫలితం స్పష్టం చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా విపరీతంగా పెరిగింది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేశాయి.. సీట్ల సంఖ్యను కేవలం జనాభా ప్రాతిపదికన పెంచడం దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాముఖ్యతను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ సహేతుకమైన భయాన్ని ప్రాంతీయ పార్టీలు సమర్థవంతంగా సభలో వినిపించాయి. నిజానికి అభివృద్ధి, జనాభా నియంత్రణ మధ్య ఉన్న ఈ వైరుధ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. జనాభా నియంత్రణ సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాల్సింది పోయి వాటి రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ప్రజాస్వామ్య విరుద్ధం. ఉత్తరాది రాష్ట్రాల్లోని జనాభా పెరుగుదల ప్రాతిపదికన లోక్‌సభ స్థానాలను పెంచితే భవిష్యత్తులో దేశ రాజకీయ గమనాన్ని కేవలం కొన్ని రాష్ట్రాలే శాసించే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఈ భయాలను పోగొట్టడంలో విఫలమవ్వడం వల్లే ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చాయి. విప్ జారీ చేసినప్పటికీ అధికార కూటమిలోని కొందరు సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరు కావడం ప్రభుత్వ సమన్వయ లోపాన్ని బహిర్గతం చేస్తోంది.

బీజేపీ వ్యూహనికి గండికొట్టిన ప్రతిపక్షాలు..

ఈ వైఫల్యం భవిష్యత్తులో ఎన్డీయే ప్రభుత్వానికి అనేక సవాళ్లను విసురుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, పునర్విభజన బిల్లులు ఇప్పుడు ఉపసంహరణకు గురవ్వడం వల్ల ప్రభుత్వం మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధితో లేదనే ప్రచారం పెరిగే అవకాశం ఉంది. రాజకీయ వర్గాల విశ్లేషణ ప్రకారం బీజేపీ ఈ మహిళా బిల్లును 2028 ఎన్నికలలో ఒక ప్రధాన రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే ప్రస్తుత ఓటమి ఆ వ్యూహానికి గండికొట్టింది. 2026 తర్వాత జరగాల్సిన పునర్విభజన ప్రక్రియ ఇప్పుడు అనిశ్చితిలో పడింది. ఇది ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య రాజకీయ విభజనను మరింత పెంచవచ్చు. రాజ్యాంగ సవరణలు చేయడానికి అవసరమైన నైతిక బలం, సంఖ్యాబలం ప్రభుత్వం వద్ద లేదనే సందేశం దేశవ్యాప్తంగా వెళ్తుంది. ఇది రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. మున్ముందు ఇలాంటి పరాభవాలు ఎదురుకాకుండా ఉండాలంటే ఎన్డీయే ప్రభుత్వం తన పనితీరులో మౌలిక మార్పులు చేసుకోవాలి.

రాజకీయ ప్రయోజనాలకు వాడొద్దు!

ముందుగా ఏకపక్ష నిర్ణయాల సంస్కృతిని వీడి సహకార సమాఖ్య స్ఫూర్తిని అలవరచుకోవాలి. నియోజకవర్గాల పునర్విభజనపై తలెత్తిన చిక్కుముడులను విప్పడానికి ఒక ‘ఉన్నత స్థాయి స్వతంత్ర కమిషన్’ ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ కేవలం జనాభానే కాకుండా ఆర్థికాభివృద్ధి, విద్య, జనాభా నియంత్రణ, సామాజిక సూచికలను పరిగణనలోకి తీసుకొని సీట్ల కేటాయింపుపై సిఫార్సులు చేయాలి. ఏదైనా కీలక బిల్లును ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి ప్రాంతీయ పార్టీల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలి. దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో అన్యాయం జరగదనే రాజ్యాంగపరమైన హామీని ఇవ్వాలి. అలాగే మహిళా రిజర్వేషన్ అంశాన్ని పునర్విభజన నుండి వేరు చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సవరణలను వాడుకోవడం మానేసి జాతీయ ప్రయోజనాల కోసం ఏకాభిప్రాయ సాధన వైపు అడుగులు వేయాలి. పార్లమెంటరీ కమిటీల ద్వారా బిల్లులను నిశితంగా పరిశీలింపజేసి లోపాలను ముందే సరిదిద్దుకోవాలి. కేవలం అంకెలను చూసి మురిసిపోకుండా ప్రజాస్వామ్యబద్ధమైన ఆమోదం కోసం ప్రయత్నించాలి. అప్పుడే ప్రభుత్వం తన కోల్పోయిన ప్రతిష్టను తిరిగి సంపాదించుకోగలదు. రాజ్యాంగ సవరణ అనేది కేవలం చట్టం చేయడం కాదు. అది దేశ భవిష్యత్తును నిర్దేశించే పవిత్ర ప్రక్రియ అని పాలకులు గుర్తించాలి.

-డా. కట్కూరి

సైబర్ నిపుణులు పాలసీ విశ్లేషకుడు

[email protected]

Next Story