- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మనిషిని మనిషిగా తీర్చిదిద్దే పర్వం రమదాన్
ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఈదుల్ ఫిత్ర్ అత్యంత పవిత్రమైనది.

ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఈదుల్ ఫిత్ర్ అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో ముస్లింలు ఎంతో నియమ నిష్టలతో రోజా వ్రతం పాటిస్తారు. భక్తిశ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేస్తారు. వారు దైవ నామ స్మరణలో అనునిత్యం వారి నాలుకలు నర్తిస్తూ ఉంటాయి. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయులవుతుంటారు. దానధర్మాలు చేస్తారు, ఫిత్రాలు చెల్లిస్తారు. రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాస దీక్షలు నెలరోజుల తరువాత షవ్వల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటి తేదీన జరుపుకునే 'ఈదుల్ ఫిత్ర్ 'పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉన్న కారణంగా ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి చెందింది.
ఉపవాస దీక్ష అందుకే..
రమజాన్ ఉపవాస దీక్షలు, పవిత్ర ఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకుపోయి ఉంది. మానవులలో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, మానవీయ విలువల్ని జనింప జేయడానికి సృష్టికర్త ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు. రమజాన్ ఉపవాస వ్రతం మనిషిని ఒక క్రమశిక్షణాయుత జీవన విధానానికి, బాధ్యతాయుతమైన జీవన విధానానికి, దైవభక్తి పరాయణతతో కూడుకున్న జీవన విధానానికి అలవాటు చేస్తుంది. మానవులలో మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే వ్రతాన్ని పరాత్పరుడైన దైవం వారికి అనుగ్రహించినందుకు, వాటిని వారు నెలరోజులూ మనోవాక్కాయ కర్మల ద్వారా త్రికరణ శుద్ధిగా పాటించ గలిగినందుకు సంతోష సంబరాల్లో తేలిపోతూ కృతజ్ఞతా పూర్వకంగా భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు.
ఈద్ ముబారక్ అంటే...
ఈవిధంగా రమజాన్ నెల ఆరంభం నుండి అంతం వరకు ఒక క్రమపద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవ ప్రసన్నత, పుణ్య ఫలాపేక్షతో ఈ నెలను గడిపినవారు ధన్యులు. నిజానికి ఇలాంటివారే పండుగ శుభకామనలకు అర్హులు. అందుకే 'ఈద్ '(పండుగ)ను శ్రామికుని వేతనం(ప్రతిఫలం) లభించే రోజు అని చెప్పడం జరిగింది. ఆరోజు ముస్లింలందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన సేమియా/షీర్ ఖుర్మా పాయసాన్ని కులమతాలకు అతీతంగా తమ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్ఖు సోదరులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు.
రమజాన్ పరమార్ధం
రమజాన్ మనిషిని ఒక ఉన్నత మానవీయ విలువలు కలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమా నత్వం, సామరస్యం, సోదరభావాలకు పునాది వేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోది చేస్తుంది. నెలరోజుల బృహత్తర శిక్షణ అనంతరం మిగతా జీవితకాలమంతా ఇదే విధమైన సత్కార్యాలు విలువలు వికసించాలన్నది అసలు ఉద్దేశ్యం. తొలకరి జల్లుతో బీడువారిన పుడమి పులకించినట్లు, రమజాన్ వసంతాగమనంతో నైతిక వర్తనంలో, ఆథ్యాత్మిక ప్రగతిలో గణనీయమైన వృద్ధి వికాసాలు జరిగాయి. అనూహ్యమైన మానవీయ పరివర్తనకు బీజం పడింది. ఇప్పుడది నిలబడాలి, నిరంతరం కొనసాగాలి. ఈ శుభాలు, వృద్ధి వికాసాలు ఒక్క నెలకే పరిమితం కాకూడదు. మనిషిని మనిషిగా మార్చడానికే ఈ శిక్షణకు ఏర్పాటు చేసింది ఇస్లాం. ఇదీ ఈదుల్ ఫిత్ర్ / రమజాన్ పర్వదిన పరమార్ధం. పరాత్పరుడైన దైవం సమస్త మానవాళికీ సన్మార్గం ప్రసాదించాలని, ఇహ పర లోకాల్లో సాఫల్యాన్ని అనుగ్రహించాలని మనసారా కోరుకుందాం.
- యండి. ఉస్మాన్ ఖాన్
99125 80645
- Tags
- Ramadan






