- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధి.. ఉద్యోగాల భర్తీలో చరిత్ర!
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదలైన నాటి నుండి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదలైన నాటి నుండి ప్రభుత్వ ఉద్యోగాల కల్పన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. అందుకు ఉదాహరణే 60 వేల ఉద్యోగాల నియామక పత్రాల అందజేత. గత ప్రభుత్వ ఏలుబడిలో ఉప ఎన్నికలు వస్తే గానీ ఉద్యోగాలు గుర్తుకు రావు. ఒక వేళ నోటిఫికేషన్ ఇచ్చినా, దాంట్లో ఎన్నో కొర్రీలను సాకుగా చూపించి వ్యవహారం అంతా అప్పటి టీఎస్‌పీఎస్సీ, కోర్టుల మధ్యనే నలిగేటట్లు చేశారు. న్యాయ, సాంకేతిక పరమైన చిక్కులను పట్టించుకోకపోగా జిరాక్స్, జాబ్ కన్సల్టేషన్ సెంటర్లలో ప్రశ్న పత్రాలను అమ్ముకున్న దౌర్భాగ్య పరిస్థితులను చూశాం.
విద్యార్థుల జీవితాలను ఆగం చేసి వారిని సామాజికంగా, ఆర్థికంగా కుంగుబాటుకు గురిచేసి ఈరోజు కొంతమంది రాజకీయ నిరుద్యోగులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ విద్యార్థి, నిరుద్యోగుల మీద రాజకీయం చేస్తోంది. దశాబ్దకాల పరిపాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క డీఎస్సీని నిర్వహించకుండా తండా, గూడాలు, మారుమూల పల్లెల్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల మూసివేతకు కారణమయ్యారు. దీంతో ఇంగ్లీష్ విద్యతోనే భవిష్యతు ఉందని భావించి పేదవాళ్లు వారి పిల్లలను ప్రైవేటు బడులలో చదివించసాగారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఆర్థిక భారాన్ని వాళ్లు అలవాటు చేసుకోవాల్సి వచ్చింది.
60 వేల నియామక పత్రాలు అందించి..
ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 11,062 పోస్టుల నోటిఫి కేషన్ జారీ చేసి పరీక్షలను నిర్వహించిన 3 నెలలలోపే నియామక పత్రాలను అభ్యర్థులకు అందజేసి ప్రభుత్వ పాఠశాలల పునరుత్తేజానికి దోహదపడి చరిత్ర సృష్టించింది. కేజీ టూ పీజీ నాణ్యమైన ఉచిత విద్య అని మోసం చేసిన వారికి ఈ విషయం జీర్ణం కాకపోవచ్చు. కానీ పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగిందనేది వాస్తవం. ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టాఫ్ నర్స్, జేఎల్, డీఎల్, పోలీస్, టీచర్స్, ఏఈఈ, గ్రూప్-4, ఏఈ, ఏఈఓ(అగ్రికల్చర్), రెవిన్యూ(జీపీఓ)... ఇలా 60 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలను అందించి తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగుల్లో ఒక బలమైన విశ్వాసాన్ని నెలకొల్పారు. ఈ అన్ని ఉద్యోగాలు ఏదో ఒక కారణంగా కోర్టుల చుట్టూ తిరిగుతుంటే టీజీపీఎస్సీకి దిశానిర్దేశం చేయించి న్యాయపరమైన చిక్కులు వాటిపైన లేకుండా సీఎం చొరవ తీసుకున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి తెలంగాణకు ఒక పెద్ద భావోద్వేగ అంశం. కానీ దాన్ని కేవలం వారి కుటుంబానికి సంబంధించిన అంశంగా మార్చుకున్న గత పాలకులు ఈ రోజు వారి మధ్య జరగాల్సిన నియామకాల కోసం కుటుంబంలో వారికి వారే కొట్టుకుంటున్నారు.
రాజకీయ నిరుద్యోగులను ఉసిగొల్పి..
ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభ్యర్థులకు ఇచ్చి ప్రజా పాలనలో వారిని భాగస్వాములను చేద్దామని ప్రయత్నిస్తుంటే పదేళ్లు నిరుద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ ఒకవైపు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాల పేరిట పంగనామాలు పెట్టిన బీజేపీ మరోవైపు.. సోషల్ మీడియా ద్వారా కొంతమంది రాజకీయ నిరుద్యోగులను ఉసిగొల్పి, వారికి అన్ని రకాల సహాయ సౌకర్యాలను అందిస్తూ నిజమైన అభ్యర్థులను భీతిల్లేలా చేస్తున్నాయి. అందులో భాగంగా గ్రూప్-1 ఉద్యోగాలు 3 కోట్లకు అమ్ముకున్నారని గత ఏలుబడిలో పేపర్లు అమ్ముకున్న కీలక మాజీ మంత్రి విమర్శించారు. 563 పోస్టులకు గాను లెక్కగట్టి 17 వందల కోట్ల లావాదేవీలు జరిగాయని గుడ్డిగా విమర్శించారు. ఇదే విషయాన్ని గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రులు ప్రెస్ క్లబ్ వేదిక నుంచి, ఆధారాలు ఉంటే చూపియండని గట్టిగా అడిగే సరికి మాజీ ఐటీ మంత్రి తోకముడుచుకున్నారు.
అక్రమాలపై ఆధారాలేవి..?
నిరుద్యోగుల భుజాలపై తుపాకీ పెట్టి ప్రజా ప్రభుత్వాన్ని కాల్చాలనుకునే వారి కుటిల నీతిని తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. గ్రూప్-1 ఉద్యోగాల విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జిమెంటును డివిజన్ బెంచ్ జడ్జిలు సస్పెండ్ చేసిన తరుణంలో కోర్టు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే ఆధారాలను ప్రధాన అంశంగా చూడకుండా కేవలం పిటిషనర్ చెప్పిన నోటి వ్యాఖ్యలనే అంశాలుగా పరిగణలోకి తీసుకొని జడ్జిమెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదని, ఈ జడ్జిమెంట్‌లో శాస్త్రీయత లోపించిందని కోర్ట్ తేల్చి చెప్పేసింది. అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఎలా చెబుతున్నారు? వాటికి ఆధారం ఏమిటి? పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయా? మాస్ కాపింగ్, లికేజ్ జరిగిందా? పక్షపాతంతో వ్యవహరించారా? తదితర అంశాలపై ఆధారాలతో స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది.
రాజకీయ నిరుద్యోగుల వలలో చిక్కుకోవద్దు!
రాష్ట్ర ముఖ్యమంత్రి టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసిన తరువాత బోర్డులో ఎటువంటి తప్పిదాలు జరిగినా ఉపేక్షించమని అధికారులను దిశానిర్దేశం చేసి, ఒక నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ అయిన బుర్రా వెంకటేశంని చైర్మన్‌గా నియమించారు. గ్రూప్-1,2,3 నియామకాలు త్వరితగతిన జరిగిపోతే కొత్త నోటిఫికేషన్‌ని జాబ్ క్యాలెండర్ ద్వారా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్న సందర్భంలో ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ఓర్వలేక లక్షలు ఫండింగ్ చేసి ఒక వర్గ నిరుద్యోగులను రెచ్చగొట్టి నిజమైన అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేయడం తెలంగాణ సమాజాన్ని మోసం చేయడమే.. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థి లోకం కూడా ఈ రాజకీయ నిరుద్యోగుల వలలో చిక్కు కోకుండా జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాలతో అర్హతను పొంది ప్రజా పాలనలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం.
-వెంకట్ నాయక్ తేజావత్,
NSUI మాజీ రాష్ట్ర కార్యదర్శి,
90140 12381






