- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నింగికేగిన వైవిధ్య గానం.. ఆశా భోస్లే
భారతీయ సినీ సంగీతానికి ఎనిమిది దశాబ్దాలుగా హృదయస్పందనగా నిలిచిన ఆశా భోస్లే జీవితం, గాన ప్రస్థానం, అద్భుత పాటలు, వ్యక్తిగత పోరాటాలపై కథనం.

ఆశా భోస్లే గాత్రం భారతీయ సంగీతంలో ఒక అద్భుత ప్రయాణం. ఆమె పాడిన ప్రతి పాట ఒక ప్రత్యేక భావ ప్రపంచం. ఆమె పాటలు కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిపోయాయి.. అవి కేవలం హిట్ పాటలు కాదు. భారతీయ సినీ సంగీత చరిత్రలో మైలురాళ్లు.. ఆశా భోస్లే పాటల గొప్పదనం ఏమిటంటే ప్రతి గీతం ఒక కొత్త ఆశాను పరిచయం చేస్తుంది. ఒక పాటలో ఆమె చిలిపి యువతి. మరొకదాంట్లో విరహిణి. ఇంకొక దాంట్లో గజల్ రాణి అందుకే ఆమె పాటలు విన్నప్పుడు మనం కేవలం సినీ సంగీతం కాదు భావాల శతరంగిణిని అనుభవిస్తాం.
ఎనిమిది దశాబ్దాలకు పైగా భారతీయ సినీ సంగీతానికి హృదయ స్పందనగా నిలిచిన స్వరం ఆశాది. 20 భాషల్లో 12 వేల పాటలు పాడారామె..
వ్యక్తిగత కష్టాలను అధిగమించి..
1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సంగ్లీ పట్టణంలో జన్మించిన ఆమె, సంగీత పారంపర్యంతో ప్రసిద్ధి చెందిన మంగేష్కర్ కుటుంబంలో పుట్టి, వ్యక్తిగత కష్టాలు, వృత్తి పోరాటాలను అధిగమించి ప్రపంచ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన గానతారగా ఎదిగింది. పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, రంగస్థల కళాకారుడు. ఆయన మరణంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఆయన కూతుర్లయిన లతా మంగేష్కర్, ఆశా భోస్లేలు ఇద్దరూ తమ చిన్న వయసులోనే సినిమాల్లో పాటలు పాడుతూ కుటుంబ బాధ్యతలను మోయాల్సి వచ్చింది. ఆశా ప్రారంభ గాన ప్రస్థానం అంత సులభంగా ఏమీ సాగలేదు.. మొదట్లో సినిమాల్లో కేవలం చిన్నపాత్రలకి, రెండోస్థాయి చిత్రాలకే పాటలు పాడే అవకాశం ఆమెకు దక్కింది. క్రమంగా తన ప్రతిభతో ఆమె అగ్రగాయనిగా ఎదిగింది.
అన్నింటిలోనూ ఉండేది ఒక్క 'ఆశా'
ఆశా కేవలం ఒకే శైలికి పరిమితమవకుండా అనేక సంగీత ప్రక్రియల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. ప్రేమ గీతాలు, క్యాబరే పాటలు, గజల్స్, శాస్త్రీయ సంగీతాధారిత గీతాలు, జానపద గీతాలు, పాప్, ఫ్యూజన్ ప్రయోగాలు లాంటి అనేక విధాల వైవిధ్యాన్ని ప్రదర్శించింది. ఓ.పి.నయ్యర్, ఆర్.డి.బర్మన్, ఖయ్యాం లాంటి సంగీత దర్శకత్వంలో ఆశా పాడిన పాటలు భారతీయ సినీ సంగీతానికి కొత్త దిశను దర్శింప చేసాయి. పన్నెండు వేలకు పైగా పాటలు పాడిన ఆశా భోస్లే గొప్పదనం ఆమె. ఆమె స్వరంలో దాగి ఉన్న అపార వైవిధ్యం, భావవ్యక్తీకరణ, సంగీతానుభూతిలో ఉంది. సంగీత దర్శకుడు ఏ భావం కోరుకున్నా, గేయ రచయిత ఏ రాత రాసినా ఆ భావానికనుగుణంగా ఆమె స్వరం కొత్త రూపం దాల్చేది. అందుకే ఆమెను గాయని అని పిలవడం కంటే భావాలకు స్వరరూపం ఇచ్చిన కళాకారిణి అనడం సబబు.
నలుపు తెలుపు నుంచి డిజిటల్ యుగం దాకా..
నలుపు-తెలుపు సినిమాల కాలం నుంచి డిజిటల్ సంగీత యుగం వరకూ ఆమె స్వరం తన ప్రాసంగికత కోల్పోలేదు. అదే నిజమైన మహత్తు. భారతీయ సినీ సంగీత చరిత్రలో మైలురాళ్లు అనదగ్గవి నాకిష్టమయిన కొన్ని ఆశా పాటల్ని చెప్పుకుంటే ‘కారవాన్’ లోని “పియా తూ అబ్ తో ఆజా”, ‘హరే రామ హరే కృష్ణ’ లోని “దమ్ మారో దమ్”, ‘యాదొంకి బారాత్’ లోని “చురా లియా హై తుమ్నే జో దిల్ కో” లాంటివి ఎన్నో. ఇక ఘజల్ శైలిలో ఆశా భోస్లే శిఖరాగ్ర ప్రదర్శనగా చెప్పబడే పాట “దిల్ చీజ్ క్యా హై” ఖయ్యాం సంగీతంలో వచ్చిన ఉమ్రావ్ జాన్ లోని పాట ఇది, దానిలోదే “ఇన్ ఆంఖోం కి మస్తీ”లో వేదన, సౌందర్యం, ఆత్మగౌరవం లాంటి మూడు భావాలు ఒకేసారి వినిపించే అరుదైన గానం. ‘ఇజాజత్’లోని “మేరా కుచ్ సామాన్” సాధారణ పాట కాదు, ఒక అంతర్ముఖ కవిత. ఈ పాటకు ఆశా జాతీయ పురస్కారం అందుకుంది. ఆమె స్వరం ఇక్కడ నిశ్శబ్దంలో దాగిన బాధలా వినిపిస్తుంది. ‘లగాన్‌లోని ‘రాధా కైసే నా జలే’ పాటతో రెహ్మాన్ సంగీతంతో ఆశా తన స్వరాన్ని కొత్త తరానికి మళ్లీ పరిచయం చేసింది. ఇట్లా చెప్పుంటూ పోతే అనేక పాటలు అనేక రాగాలు..
ఒకటి ప్రార్థన.. మరొకటి పండుగ
ఇక లతా మంగేష్కర్, ఆశా భోస్లేల గాత్ర ప్రపంచాలు రెండు వేర్వేరు నదుల్లా ప్రవహించాయి. లత పవిత్ర గంగలా ప్రశాంతంగా, ఆశ చలాకీ యమునలా ఉల్లాసంగా ప్రవహిం చారు.. ఒకే ఇంటి చూరు నుంచి బయలుదేరిన ఆ రెండు స్వరాలు ఒకటి ప్రార్థనగా మారింది, మరొకటి పండుగగా మారిందని చెప్పొచ్చు. ఆశా తన వ్యక్తిగత జీవితంలో ఆమె విభిన్న అనుభవాల్ని ఎదుర్కొంది. కుటుంబానికి వ్యతి రేకంగా కేవలం 16 ఏళ్ల వయసులో గణపత్రావ్ భోస్లేను ప్రేమ వివాహం చేసుకుంది. కానీ ఆ బంధం సుఖమయంగా సాగలేదు. 1960లో ఆ వివాహం విరిగిపోయింది. అప్పటికే ఇద్దరు పిల్లలతో, మూడో బిడ్డకు గర్భిణిగా ఆమె తన తల్లి ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. ఆ క్షణం ఆమె జీవితంలో అతి కఠినమైన మలుపు. సంగీతం ఆమెకు మరో జీవితాన్ని ఇచ్చింది. సంగీత దర్శకుడు ఆర్.డి.బర్మన్‌తో ఉన్న దీర్ఘకాల స్నేహం ప్రేమగా మారి, 1980లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు.. అది ఆమె జీవితంలో ప్రేమ, పరస్పర గౌరవం, సంగీత సఖ్యత కలిసిన అందమైన అధ్యాయం.
గాయని కాకపోయి ఉంటే..?
ఆశా భోస్లేకు వంట అంటే అపారమైన ఇష్టం. “ గాయని కాకుండా వుండి వుంటే వంటమనిషిని అయ్యేదాన్ని” అని ఆమె చెప్పేది. ఈ ఆసక్తితో “ఆశాస్ ” అనే రెస్టారెంట్ లను కూడా ప్రారంభించింది. ఆశా భోస్లే జీవితాన్ని చూస్తే పైకి అది ఒక రాగమాలికలా కనిపిస్తుంది, ఆమె గానం మనం వింటాం. కానీ ఆ గానం వెనుక నిలిచిన మహిళ ఒక అగ్నిపరీక్షల గాథ. ఇవ్వాళ ఆమె మరణం సినీ సంగీత ప్రపంచానికి తీవ్రమయిన లోటు.
-వారాల ఆనంద్
94405 01281






