ఓటు హక్కుపై ఎస్ఐఆర్ నీడ

by Ravi |   (  Updated:2026-05-01 01:14:44  IST  )

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడులో ఎస్ఐఆర్ పేరుతో జరిగిన ఓటర్ల జాబితా ప్రక్షాళన లక్షల మందికి ఓటు హక్కు కోల్పోయే పరిస్థితిని తీసుకువచ్చిందనే విమర్శలు. ఏఐ ఆధారిత నిర్ణయాలు, ట్రిబ్యునల్ అప్పీళ్లు, ప్రజాస్వామ్యంపై ప్రభావం

ఓటు హక్కుపై ఎస్ఐఆర్ నీడ
X

ప్రజాస్వామ్యం అనే భవనానికి ఓటు హక్కు పునాది. మరి అలాంటి పునాదిని కదిలిస్తే మొత్తం వ్యవస్థే కుప్పకూలుతుంది. పశ్చిమ బెంగాల్‌‌లో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)’ పేరుతో జరిగిన ఓటర్ల జాబితా ప్రక్షాళన ఇప్పుడు అచ్చం అటువంటి ఆందోళననే కలిగిస్తున్నది.

ఇది కేవలం ఒక సాంకేతిక సవరణగా మొదలై, లక్షలమంది పౌరుల ప్రాథమిక హక్కులను హరించే ఒక ‘రక్తం చిందని మారణకాండ’గా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

గణాంకాలు చెబుతున్న సత్యం!

బెంగాల్‌లో జరిగిన ఈ ప్రక్రియలో సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో మరణించిన 24 లక్షల మందిని పక్కన పెడితే, మిగిలిన 66 లక్షల మంది పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ‘తార్కిక అస్థిరత’ (Logical Inconsistency) అనే అస్పష్టమైన కారణంతో లక్షలాది మంది బతికున్న ఓటర్లను జాబితా నుండి తొలగించారు. ఉదాహరణకు కోల్‌కతాలోని ఒక నియోజకవర్గంలో 87,000 మందిని తొలగిస్తే, అందులో 74,000 మందికి పైగా ఓటర్లు తాము బతికే ఉన్నామని, అదే చిరునామాలో ఉంటున్నామని ఆధారాలతో సహా ముందుకు వచ్చారు.. పేరులో, చిరునామాలో ఒక చిన్న అక్షర దోషం ఉన్నా, లేదా తండ్రి - కూతుళ్ల వయస్సు మధ్య తక్కువ వ్యత్యాసం ఉందనే సాంకేతిక కారణాలతో నోటీసులు ఇవ్వకుండానే ఓట్లు తీసేయడం ఏ రకమైన న్యాయం? అని వారు ప్రశ్నిస్తున్నారు.

ఏఐ.. ఓటు హక్కుపై వేటు వేస్తే..

ఒక నిర్దిష్ట కేసులో.. తండ్రి, కూతురి వయస్సు మధ్య కేవలం 15 ఏళ్ల వ్యత్యాసం ఉందని ఏఐ గుర్తించింది. దీని ఆధారంగా వారిద్దరి ఓట్లను తొలగించారు. వయస్సు నమోదు విషయంలో పొరపాటు వల్ల కూడా ఆ తప్పు జరిగి ఉండవచ్చు.. లేదా సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు కావడంతో చిన్న వయసులోనే వివాహాలు జరగడం వంటి సామాజిక అంశమైనా అయి ఉండవచ్చు.. ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ఓటు హక్కు తొలగించారు. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అల్గారి‌థంలపై ఆధారపడి మనుషుల హక్కులను నిర్ణ యించడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమనే చెప్పాలి.

ఎన్నికల అధికారులకే తప్పని తిప్పలు..

ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన 65 మంది ప్రభుత్వ అధికారులు తమ ఓటు హక్కును కోల్పోయారు.. వారు కోర్టులో తమ అభ్యంతరాలను తెలిపారు. రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రతి పౌరుడికి ఓటు హక్కును గ్యారెంటీగా ఇస్తుంటే, ఎన్నికల విధుల్లో ఉండి దేశానికి సేవ చేస్తున్న వారికే ఆ హక్కు లేకుండా పోవడం వ్యవస్థాగత వైఫల్యానికి పరాకాష్ట. వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు, కోర్టు కూడా వారి వాదనలోని నిజాయితీని కాదనలేదు. కానీ, ట్రిబ్యునళ్లను ఆశ్రయించడమే సరైన మార్గమని సూచించింది.

ఒక్క బెంగాల్‌లోనే ఎందుకు?

ఎస్ఐఆర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా 6.56 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయి. అయితే అప్పీళ్ల విషయంలో బెంగాల్ టాప్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 2.04 కోట్ల ఓట్లను తొలగించారు. ఇది దేశంలోనే అత్యధికం.. అయినా, ఇక్కడ అప్పీళ్ల కంటే రాజకీయ విమర్శలే ఎక్కువ వచ్చాయి. అయితే, అప్పీళ్ల అంశంపై రాజకీయ పార్టీలు ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యాయి. పైగా రాజకీయంగా కూడా పార్టీలు ఈ విషయాన్ని విమర్శలకే పరిమితం చేశాయి.. కానీ, న్యాయ పోరాటం చేయలేదు. తమిళనాడులోనూ దాదాపు 20 లక్షల నుంచి 30 లక్షల ఓట్లను తొలగించారు. అయితే, ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వెళ్లే వరకూ చాలామందికి ఈ విషయమే తెలియదు.. డీఎంకే, ఏఐఏడీఎంకేలు వార్డు స్థాయిలో బలమైన పార్టీలే అయినా, న్యాయపోరాటం చేయడంలో, ఓటు హక్కు విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో పూర్తిగా విఫలమ‌య్యాయి. బెంగాల్‌లో మాత్రం పార్టీలు ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. 90.66 లక్షల ఓట్లు రద్దయితే.. 34 లక్షల మందికి‌పైగా అప్పీల్ చేసు కున్నారు. పైగా అక్కడ వారి ఓటు హక్కు పౌరసత్వానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువగా అప్పీల్ చేసుకున్నారు. ఇది దేశంలోనే రికార్డు. తమిళనాడులో ఆ పరిస్థితి లేదు. ఇక బెంగాల్‌లో సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకుని 19 ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించడం వల్ల.. ప్రజలకు ఒక ‘లీగల్ బ్యాకప్’ దొరికింది. కోర్టు అండ ఉందని తెలి యగానే అప్పీళ్ల సంఖ్య విపరీతంగా పెరిగింది.

న్యాయస్థానం స్పందన.. సామాన్యుడికి భారం

సుప్రీంకోర్టు.. ‘ట్రిబ్యునళ్లకు వెళ్ళండి’ అని చెప్పడం చట్ట పరంగా సరైనదే కావచ్చు. కానీ, ఒక రోజు కూలీ చేసుకునే వ్యక్తి లేదా మారుమూల గ్రామంలో ఉండే వృద్ధుడు తన ఓటు కోసం పట్టణాల్లోని ట్రిబ్యునళ్ల చుట్టూ తిరగడం ఆచరణలో ఎంతవరకు సాధ్యం? 12 లక్షల మంది అప్పీల్ చేసుకుంటే అందులో 1474 మంది దరఖాస్తులు పరిశీలించగా.. 1468 మంది సరైన ఓటర్లేనని ట్రిబ్యునలే తేల్చింది. ఇక మిగతా వారి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టింది. ఫలితంగా వారంతా ఓటు హక్కుకు దూరమయ్యారు. అంటే, వ్యవస్థ చేసిన తప్పు వల్ల సామాన్యుడు శిక్ష అనుభవించడం కాదా?

పారదర్శకంగా సంస్కరణలు లేకపోతే..

ఎన్నికల సంఘం ఈ విషయంలో తనను తాను ‘నిష్పాక్షిక సంస్థ’గా నిరూపించుకోవాల్సిన సమయం ఇది. ఎస్ఐఆర్ ప్రక్రియలో జరిగిన లోపాలను సరిదిద్దడం, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కును పునరుద్ధరించడం తక్షణ అవసరం. పారదర్శకత లేని సంస్కరణలు ప్రజా స్వామ్యానికి శాపాలుగా మారుతాయి. ఓటు అనేది కేవలం ఒక కాగితం మీద పేరు కాదు, అది ఒక పౌరుడి ఆత్మ గౌరవం. ఆ ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రతి ప్రభుత్వం, రాజ్యాంగ సంస్థ ప్రాథమిక బాధ్యత అని మరిచిపోకూడదు. ఈ విషయంలో ఎన్నికల సంఘం, కేంద్రం, సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచిచూడాలి.

-హరీశ్ ఎస్పీ

[email protected]

Next Story