- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జ్ఞానకాంతుల దీపావళి...!
“ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టుగానే, మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి.” అన్న బుద్ధుని బోధనకు విరుద్ధంగా భారతదేశంలో సంబరాలు జరుగుతున్నాయి. అయితే, ఈ పండుగల వెనుక శాస్త్రీయ విరుద్ధమైన కథనాలు ఉన్నాయి. వాటి చుట్టూ ఎన్నో పౌరాణిక గాథలను అల్లుకున్నారు. దసరా తర్వాత వచ్చే దీపావళికి రామాయణాన్ని ముడిపెట్టారు. ఈ రెండు పండుగలనూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. శ్రీరాముడు పదితలల రావణుడిని చంపడంతో దసరా జరుపుకుంటున్నామని, రావణుడు చనిపోయిన తరువాత రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా దీపాలు వెలిగించి సంబురంగా దీపావళి చేసుకుంటున్నామంటున్నారు. సత్యభామ నరకాసురుడిని వధించినందుకు దీపాలు వెలిగించుకుంటున్నామని మరొక కథ చెబుతారు. కాళికాదేవి రాక్షసులను చంపినందుకు దేవీ నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి బౌద్ధ మత సంప్రదాయమైన దీపావళిని హిందూ సంప్రదాయ పండుగగా చరిత్ర క్రమంలో మార్చివేశారనడానికి అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి.
అయితే పురాణాల్లో ఉన్న పాత్రలు చనిపోతే పండుగ జరుపుకునే ఆచారం ఇక్కడ తప్ప ఏ దేశంలో కనిపించదని డాక్టర్ దేవరాజు మహారాజు వంటి సాహితీవేత్త, జీవశాస్త్రవేత్తలు మరో కోణం వెల్లడిస్తున్నారు. బయటి దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన ఆర్యులు ఇక్కడి మూలవాసులైన ద్రావిడులను అణచివేసిన సంఘటనలను పురాణాలుగా రాసుకున్నారని, వాటి నుంచే ఆచారాలు పుట్టాయని పెరియార్ వివరించారు. కానీ ఈ వాస్తవాలను చెవికెక్కనీయకుండా టపాకాయల మోత పెడుతున్నారు. ఆర్యులు భారతదేశ మూలవాసులను కోతులుగా, గుడ్డెలుగులుగా, రాక్షసులుగా చిత్రీకరించారని చెప్పిన సత్యాన్నీ స్వీకరించనీయడం లేదు.
సిద్ధార్థుడు బుద్ధుడై వెలిగి..
బుద్ధుని కాలంలో ప్రారంభమైన ఈ దీపాల పండుగకు అశోక చక్రవర్తి వైభవాన్ని తెచ్చారు. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలోనే బౌద్ధంలో దీపాల పండుగ మొదలైంది. సిద్ధార్థుడు బుద్ధుడైన తర్వాత పదిహేడేండ్లుగా కపిలవస్తుపురానికి రాలేదు. దీంతో తన తండ్రి శుద్ధోధనుడు బుద్ధుడిని నగరానికి తీసుకురావాలని కొంతమందిని పంపాడు. వారు బుద్ధుడిని కొన్నినెలలుగా అన్వేషిస్తూ ఆయన వద్దకు చేరారు. అయితే వారు బుద్ధుడిని నగరానికి తీసుకురావడంలో విఫలమయ్యారు. బుద్ధుడి బోధనలు, జీవిత సత్యాలను వినడంతో వారు ఆయనతోనే ఉండిపోయారు. బుద్ధుడి తండ్రి మళ్లీ మరికొందరిని పంపించాడు. వారు కూడా బుద్ధుడి ప్రభావానికి గురై ఆయనతోపాటే ఉన్నారు. ఎన్నో ఏండ్లుగా శుద్ధోధనుడు బుద్ధుడి కోసం మనుషుల్ని పంపడం, వారు తిరిగి రాలేక బౌద్ధ భిక్కులుగా మారిపోవడం జరుగుతోంది. చివరకు పదిహేనేండ్ల తర్వాత బుద్ధుడు తన నగరానికి బయలుదేరాడు. ఆయన వస్తున్నాడని తెలిసి ప్రజలు చాలా సంతోషపడ్డారు. ఆయనకు స్వాగతం తెలిపేందుకు నగరవీధులన్నీ శుభ్రం చేయించారు. ఇండ్లను శుభ్రపరిచి పూలమాలలతో సుందరంగా అలంకరించుకున్నారు.
బుద్ధుడు వచ్చే రోజు అమావాస్య కావడంతో నగరమంతా దీపాలు వెలిగించారు. ప్రతి ఇంట్లో దీపాలు పెట్టించారు. ఏ ఇల్లు కూడా చీకట్లో ఉండకూడదని ప్రజలు దీపాలను దానం చేసి వెలుగులు నింపారు. దీంతో నగరమంతా దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. ప్రజలు దీపాలు దానం చేయడంతో దీపదానోత్సవంగా మారిపోయింది. బుద్ధుడు కపిలవస్తు నగరానికి తిరిగి రావడానికి సంకేతంగా దీపాలవెల్లి పండుగ బౌద్ధ సంప్రదాయంగా నిలిచిపోయింది. ప్రతి ఆషాఢ మాసంలో బౌద్ధ భిక్షువులకు వర్షావాసం మొదలవుతుంది. ఆ కాలంలో మూడు నెలల పాటు భిక్షువులు అడవులు, గుహల్లో ఉంటారు. దొరికింది తింటూ ధ్యానం చేసుకుంటారు. విద్యలో ప్రత్యేక స్వయం శిక్షణ పొందుతారు. మూడు నెలలు వర్షావాసం పూర్తి చేసి, తిరిగి గ్రామాలకు బయలుదేరుతారు. వారు వచ్చే దారి పొడవునా ప్రజలు దీపాలతో స్వాగతం పలుకుతారు. అదే దీపావళిగా, బౌద్ధుల ధర్మ దీపావళిగా ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి బౌద్ధ స్తూపాల వద్ద, బౌద్ధ ఆరామాల్లో వందలాది దీపాలు వెలిగించేవారు. బౌద్ధ ధర్మోపన్యాసాలు, బౌద్ధ భిక్షువులు సమావేశాలు నిర్వహించుకునే ప్రదేశాల్లో, బౌద్ధ స్తూపాలమీద దీపాలను ఉంచేవారు.
అశోకుడు తెచ్చిన వైభవం..
బౌద్ధ చరిత్ర ప్రకారం బుద్ధుడి మహాపరినిర్వాణం తరువాత ఆయన అవశేషాలు ఎనిమిది రాజ్యా లకు పంపిణీ చేశారు. మగధ రాజ్యానికి చెందిన అజాతశత్రువు, వైశాలికి చెందిన లిచ్చవిలు, కపిలవస్తు శాక్యులు, అల్లకప్పకు చెందిన బులిస్, రామ్‌గ్రామ్‌లోని కోలియాలకు పంచారు. భారతదేశ మూలవాసి అయిన అశోకుడు ఈ అవశేషాలను పాటలీపుత్రానికి తీసుకువచ్చాడు. భారతదేశంలో బౌద్ధ మతాన్ని పునరుజ్జీవింపజేయడానికి ఆయన దీపదానోత్సవాన్ని తిరిగి ప్రారంభించారు. 64,000 నగరాల్లో 84,000 బౌద్ధ చైత్యాలు, విహారాలు, స్తూపాలు, ఆసుపత్రులను నిర్మించారు. దీనిని డాక్టర్ వాల్మీకి ప్రసాద్ తన ‘దీప్ వంశ్’ పుస్తకంలో వివరించారు. కళింగ యుద్ధంలో విజయం సాధించినా అశోకుడు వేడుకలు చేసుకోలేదు. యుద్ధంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగడంతో పాటు లక్షలాది మంది నిరాశ్రయులు కావడంతో పశ్చాత్తాపం చెంది దు:ఖంతో కుమిలిపోయాడు. విజయ గర్వంతో ఆయన వేడుకలు చేసుకోలేదు. ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఆయుధాలు త్యజించారు. ప్రపంచ చరిత్రలో యుద్ధాలను మానేసి శాంతియుత మార్గాన్ని అవలంభించిన ఒకే ఒక్క మహనీయుడు అశోక చక్రవర్తి. మానసిక పరివర్తన వల్ల తను చేసిన రక్తపాతానికి పరితపిస్తూ మానవతకు రూపమైన బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అంధకారాన్ని పార దోలే దీపాలను వెలిగించాడు. ప్రజల జీవితాల్లో శాంతి, అహింస, సత్యం, నిజాయితీ, నిబద్ధత, నైతికతలు వెలిగిపోయేలా పరిపాలించాడు. దీనికి సంకేతంగా బుద్ధుని కాలంలో జరుపుకున్న దీపదానోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దీపావళి ఇలా ఈ దేశంలోని ప్రజాజీవితంలోకి వచ్చింది.
బౌద్ధాన్ని మంటల్లో వేసేందుకే..
ప్రపంచానికి జ్ఞానాన్ని పంచిన బుద్ధుడి రాకకు సంకేతంగా దీపదానోత్సవాన్ని నిర్వహించారనేది కాదనలేని వాస్తవం. దీనికి చారిత్రక ఆధారాలున్నాయి. ఇందులో భ్రమలు, కల్పితాలూ లేవు. బుద్ధుడు వాస్తవంగా ఈ నేలమీద తిరిగినవాడు. బుద్ధుడి కరుణను, దయాగుణాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులు ఈ రోజు వరకూ ఆ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. దీనిని తోసిపుచ్చేందుకు పురాణ గాథలను సృష్టిం చారు. శ్రీకృష్ణుడు, నరకాసురుడు, సత్యభామ, లక్ష్మి, గణేశుడు పురాణాల్లో కల్పించిన పాత్రలు. వాస్త వంగా ఈ దేశంలో పుట్టి పెరిగిన వారు కాదు. బుద్ధుడు కపిలవస్తుకు తిరిగి రావడాన్ని రాముడు అయోధ్యకు తిరిగి రావడంగా మార్చి రాసుకున్నారు. సాంకృత్యాయన్, భదంత్ కౌసల్యాయన్, విన్సెంట్ స్మిత్, గెయిల్ ఓంవేద్ తదితరుల రచనల్లో వీటి మర్మం విప్పి చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన ‘ది ట్రయంఫ్ ఆఫ్ బ్రాహ్మణిజం’లో కూడా భారతదేశ మూలవాసుల పండుగల గురించి వివరించారు. మనుషులు చీకటి నుంచి వెలుగులోకి నడవాలి. వెలుగు నుంచి వెలుగులోకి నడవడం అంటే విజ్ఞానం నుంచి శీలం వైపు పయనించాలని దీపదానోత్సవం తెలుపుతుంది. ‘చెడును దూరం పెట్టండి, మంచిని పెంచండి. మనసును శుద్ధి చేసుకోండి.’ అన్న బుద్ధుడి మాటలను ఆచరణలో పెడితే తప్ప జ్ఞానకాంతులను కమ్మేస్తున్న ఆధిపత్య దీపాలను ఆర్పలేము.
- మేకల ఎల్లయ్య
99121 78129