- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటి పేదరికమే నేటి ఫ్యాషన్!
కొన్ని సంవత్సరాలకు ముందు రెండు పూటలు రొట్టె తిని ఓ పూట అన్నం తినడమే కష్టంగా ఉండేది. రొట్టె అంటేనే పేదరికమని అనిపించేది.

కొన్ని సంవత్సరాలకు ముందు రెండు పూటలు రొట్టె తిని ఓ పూట అన్నం తినడమే కష్టంగా ఉండేది. రొట్టె అంటేనే పేదరికమని అనిపించేది. పేదలు ఒంటినిండా కప్పుకోవడానికి బట్టలు కూడా సరిగ్గా ఉండేవి కావు.. చిరిగిన బట్టలను ఎన్నాళ్లని ఎన్నిసార్లని కుట్టుకుని తొడగాలమ్మా? అని ప్రశ్నించేవాళ్లం. నాడు పేదవాడు ఆచరించిన ప్రతీది నేడు డబ్బున్న వ్యక్తులు పాటించడం చూస్తే నాటి పేదరికమే నేడు ఫ్యాషన్‌గా మారిందని తెలుస్తోంది.
అప్పట్లో చినిగిన బట్టలు వేసుకోవాలంటే మన స్నేహితులు ఎక్కడ వెక్కిరిస్తారో అని బిక్కుబిక్కుమంటూ బతికేవాళ్లం. చిరిగిన చోట అమ్మ కుట్టిందన్న విషయం ఎవరికీ తెలియకుండా దానిని పలకతోనో లేక పుస్తకం అడ్డుపెట్టో దాచేవాళ్లం. అటువంటిది నేడు చిరిగిన జీన్స్‌లను, కుర్తాలను వేలకు వేలు పెట్టి కొంటున్నారు. అదే నేటి ఫ్యాషన్ కూడా.. గోనె సంచిని నాటి కాలంలో వర్షం కురుస్తున్నప్పుడు కప్పుకోవడానికో లేక పూరిగూడిసెపై కప్పడానికో వాడేవారు.. ఆ తర్వాత గుమ్మం దగ్గర మ్యాట్‌లా వాడేవారం. కానీ అటువంటి గోనె సంచులతో నేడు అందమైన బ్యాగ్‌లు కుట్టి అమ్ముతున్నారు. అదే గోనె సంచి ప్యాంట్‌లను కూడా వేలల్లో కొనడం వింత అనే చెప్పాలి.
నాటి ఆహారం..
నాడు ఉన్నోడు మూడు పూటల అన్నం తింటుంటే పేదవాడు రెండు పూటలు జొన్నరొట్టే, రాగి జావలతో కడుపు నింపుకుని ఓ పూట అన్నం తినేవాడు. ఇప్పుడు అదే పెద్ద ఆరోగ్య రహస్యం అని డబ్బున్న వాళ్లందరూ రాగి జావాను, పెరుగన్నంను మార్నింగ్ టిఫిన్‌గా చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాడానికి తింటున్నాడు. కానీ పేదవాడు గొప్పవాడిలా ఫ్యాషన్‌గా దోసె, ఇడ్లి తింటున్నాడు. కరోనా తర్వాత ఈ పెరుగన్నమే అందరికీ మందులా ఉపయోగపడింది. దీనిని ఆసరగా చేసుకుని ప్రస్తుతం వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. నాడు పేదవారిని అస్పృశ్యులని ఊరికి చివరన దూరంగా గుడిసెల్లో ఉంచేవారు. నేడు డబ్బున్న వారు వెకేషన్ల పేరుతో ఆడవుల్లోకి వెళుతూ డేర గుడిసెలను వేసుకుని చక్కగా ఉండి వస్తున్నారు. పైగా డబ్బున్న వారు ఊరి బయట జాగా కొని పెద్ద పెద్ద విల్లాలు కట్టుకొని వీకెండ్ ఎంజాయ్ కోసం వస్తున్నారు.
సున్నిపిండి, వేప పుల్ల..
నాడు సబ్బు కొనలేని వారు ఇంట్లో ఉండే అన్ని రకాల పప్పులను లేదా జొన్న పిండి, బియ్యం పిండి, శెనగ పిండి లను ఒంటికి రుద్దుకుని స్నానాలు చేసేవారు. కొందరైతే చెరువుల్లో, పంట పొలాల్లో ఉండే నల్లటి బంక మట్టితో ఒళ్లు శుభ్రం చేసుకునే వారు. బట్టలు ఉతుక్కునే వారు. అలాంటిది నేడు డబ్బున్న వారు ఒకప్పుడు పేదలు వాడిన సున్నిపిండికై పరుగులు పెడుతున్నారు.. అలాగే వేప పుల్లలతో పళ్లు తోమడం నాడు గ్రామీణ పద్ధతి నేడు అదే ఆధునిక పద్ధతి అయింది. ఇలా చేయడం వల్ల.. పళ్లు పుచ్చుపోకుండా.. పళ్లల్లో పురుగులు పడకుండా ఆరో గ్యంగా ఉండడమే కారణం.
నాటి పేదరికమే ఆరోగ్యకరమని..
అప్పట్లో పల్లెటూర్లలో కుండలల్లో అన్నం కూరలు చేసేవారు. అది వారి పేదరికమే.. ఆ సమయంలో ధనవంతులు స్టీల్‌లాంటి పాత్రల్లో వండుకుని తినేవారు. రాను రానూ మనిషిలో ఆరోగ్యం క్షిణించి రోగాలు పెరుగుతున్న తరుణంలో మళ్లీ కుండల్లో వంటకాలకు స్వాగతాలు పలుకుతున్నారు పెద్దవాళ్లు. అప్పట్లో ఏదైనా పండగలు, ఫంక్షన్లు వస్తే చాలు.. వచ్చిన అతిథులకు విస్తరి లేదా అరిటాకు వేసి అందులో అందంగా వడ్డించేవారు. నేడు ధనవంతులు దానినే టేబుల్ సిస్టమని చెప్పి విస్తర్లను ప్లాస్టిక్ ప్లేట్లుగా మార్చి అన్నం వడ్డించడం మొదలు పెట్టారు.. ఇది కాస్త అంతటా పాకేసరికి మళ్లీ విస్తర్లే ఆరోగ్యమని తెలిసి విస్తర్ల ప్లేట్లను తయారు చేయడం ప్రారంభించారు. నాటి పేదరికమే నేటి ఆరోగ్యమని తెలుసుకునే సరికి ఎన్నో ఏళ్లు నష్టపోయాము. ఏది ఏమైనా చివరికి నాటి పేదరికమే నేడు రాజరికమైంది.
- అమీనా కలందర్
77994 26260






