బిహార్ ప్రజల తీర్పులో దాగిన రాజకీయ సందేశం..

by Ravi |   (  Updated:2025-11-19 01:15:52  IST  )

బిహార్ ప్రజల నుండి ఏ తీర్పు రావాలని ఆయా రాజకీయ పార్టీలు శక్తులు స్వీయాత్మకంగా ఆకాంక్షించాయో అలాంటి తీర్పు రాలేదు. దీంతో ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామిక శక్తుల, వ్యక్తుల మానసిక స్థితి తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది.

బిహార్ ప్రజల తీర్పులో దాగిన రాజకీయ సందేశం..
X

బిహార్ ప్రజల నుండి ఏ తీర్పు రావాలని ఆయా రాజకీయ పార్టీలు శక్తులు స్వీయాత్మకంగా ఆకాంక్షించాయో అలాంటి తీర్పు రాలేదు. దీంతో ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామిక శక్తుల, వ్యక్తుల మానసిక స్థితి తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. ‘ఇక ఫాసిస్టులను ఓడించడం చాలా కష్టం’ అనే నిట్టూర్పులు, ‘ఈ ప్రజల మీద నమ్మకం పెట్టుకొని ఫాసిజం మీద విజయం సాధించలేం’ అనేంతవరకు నిరాశ వెళ్తోంది. ఇది చీకట్లో వెలుగును, చెడులో మంచిని, కష్టంలో సుఖాన్ని, ప్రతికూల అంశంలో సానుకూల అంశాన్ని చూడలేని స్థితికి అద్దం పడుతుంది.

మరో భిన్న దృష్టితో పరిశీలిస్తే బిహార్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు పోషించిన పాత్రకి గల ప్రాధాన్యత చాలా స్పష్టంగా అర్ధమౌతుంది. అయితే ప్రగతిశీల, ప్రజాతంత్ర, వామపక్ష, లౌకిక శక్తులు భావించి నమ్ముతున్న వివిధ ఫాసిస్టు కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలు బిహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయనడంలో నేనేమీ విభేదించడం లేదు. కానీ ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల ప్రభుత్వ ఫాసిస్టు పాలనా విధానానికి బిహార్ రాష్ట్ర ప్రజలు ఆమోద ముద్ర వేశారని భావిస్తే పరమ అబద్ధం అవుతుంది.

ఆర్థిక అస్త్రాలే దిక్కు అయ్యాయి..

బిహార్ ఎన్నికల ఫలితాలను లోతుగా పరిశీలిస్తే బిహార్ రాష్ట్ర ప్రజలు ఫాసిస్టు పాలకులకు, వారు చేపట్టే విధానాలకు చాలా గట్టి రాజకీయ గుణపాఠం చెప్పడంతో పాటు తీవ్ర హెచ్చరిక చేశారని కూడా స్పష్టం అవుతుంది. విద్వేషపూరిత రాజకీయ, సాంస్కృతిక, సాంఘిక, ఆధ్యాత్మిక, నైతిక, ధార్మిక అస్త్రశస్త్రాలు అన్నింటిని వెలికితీసి పదునుపెట్టి బిహార్ రాష్ట్ర ప్రజలపై ఫాసిస్టు పాలక వర్గాలు ప్రయోగించడం జరిగింది. ఐనా ప్రజలు ఇవ్వనున్న తీర్పు పట్ల ఫాసిస్టు పాలక శక్తులకు నమ్మకం ఏర్పడటం లేదు. చివరికి ఆర్థిక అస్త్రాలే వారికి దిక్కుగా మారాయి. వారికి గాడ్ ఫాదర్లు ఐన కార్పొరేట్ వర్గ ప్రయోజనాలకు వ్యతిరేక ఎజెండా మీద ఆధారపడే అవసరం ఏర్పడింది. నగదు బదిలీ పథకంతో సహా రకరకాల సంక్షేమ హామీల్ని ఇబ్బడి ముబ్బడిగానే ఆ రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన దిక్కుమాలిన దీన స్థితి ఆర్ఎస్ఎస్, బీజేపీలకు ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ రాజకీయ అంతరాత్మ భంగపడింది. ఇలా బిహార్ ప్రజలు వారికి చెమట పట్టించారు.

సంక్షేమం వద్దన్నవారే నగదు గుమ్మరించారు..

వలస కార్మికులను సాపేక్షికంగా అభివృద్ధి చెందిన కొన్ని రాష్ట్రాలకు ఎగుమతి చేసే ఓ ప్రధాన రాష్ట్రంగా బిహార్ పేరొందింది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలు గానీ, మహారాష్ట్ర, గుజరాత్ వంటి పడమర రాష్ట్రాల్లో గానీ నగదు బదిలీ వంటి సంక్షేమ పథకాలు చాలా బలంగా అమలు జరిగే స్థితి ఉంది. కానీ, సంక్షేమ వ్యవస్థ మీద ఫాసిస్టులు దాడికి దిగే పరిస్థితి ఏర్పడింది. ఆ సంక్షేమ సంస్కృతి ఒక బలమైన సాంప్రదాయ శక్తిగా మారిన చోట్ల దాని నియంత్రణ కోసం నేడు ఫాసిస్టు రాజకీయ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నియంత్రణ నిజానికి మొదటి దశలో చేపట్టేది మాత్రమే. అంతిమంగా వాటిని నిర్మూలన చేసే దారిలో ఆర్ఎస్ఎస్ నడుస్తోంది. ఆ ఫాసిస్టు మార్గంలో అదో మజిలీ మాత్రమే. సంక్షేమ సంస్కృతి నేడు బలహీనంగా గల బిహార్ రాష్ట్రంలో ఫాసిస్టు పాలకులు స్వయంగా తమ చేతులతో సంక్షేమ పథకాల్ని బలోపేతం చేసి తీరాల్సిన తీవ్ర చర్యల్ని చేపట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది ఎవరికి విజయం? ఎవరికి అపజయం?

నగదు బదిలీ స్కీంకి దిగజారారు..

సంక్షేమ పధకాలలో పోస్ట్ పెయిడ్ స్కీమ్స్ కంటే ప్రీపెయిడ్ స్కీమ్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గతంలో ఇచ్చిన పోస్ట్ పెయిడ్ హామీలు అమలు జరగని చేదు అనుభవాలు వారికి ఎదురయ్యాయి. ఆ చేదు అనుభవాల వెలుగులో బిహార్ ప్రజలు ఫాసిస్టుల ఎరలకు చాలా దూరంగా ఉన్నారు. అది పసిగట్టిన ఫాసిస్టు పాలకులు చివరికి ప్రీపెయిడ్ స్కీమ్స్ అమలుకి దిగారు. గతం వలే హామీలిచ్చి ఓట్లు పొందలేని దుస్థితి వల్ల నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాల్సిన దుస్థితికి గురయ్యారు. ఒక నగదు బదిలీ స్కీం చూపించి మిగిలిన అన్ని సంక్షేమ హామీల పట్ల ప్రజల్లో ఆశ కలిగించే ప్రయత్నం చేశారు. ఒక ప్రీపెయిడ్ స్కీం అమలుని చూపించి అనేక పోస్ట్ పెయిడ్ స్కీమ్స్‌పై ఆశ పెట్టారు. ఈ ఎన్నికల్లో అనేక సంక్షేమ హామీల్ని ఇచ్చిన పాలకులు రేపు ఐదేండ్లు ముళ్లబాటలో నడవాల్సిందే. వాటిని అలా నడిపించే విలక్షణ తీర్పు ఇచ్చిన ప్రజలుగా చూడాలి. పైగా ఇప్పుటికే సంక్షేమ సంస్కృతి చాలా బలంగా వున్న ఏపీ వంటి రాష్ట్రాల ప్రజల చేతికి పదునైన ఆయుధాన్ని అందించే సాధనంగా దీన్ని చూడాలి.

తమ కాళ్లు తామే నరుక్కుంటే..

బిహార్ రాష్ట్ర ప్రజల తీర్పు అక్కడి ప్రజలు జీవించే భౌతిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. బిహార్ ప్రజలు జీవిస్తున్న స్థల, కాలాదులపై ఆధారపడి ఆ రాష్ట్ర ప్రజలిచ్చే తీర్పు ఉంటుందని భావించి దాని గూర్చి విశ్లేషణ చేయడం సరైన పద్ధతి. తమ తమ మనస్సుల్లో కోరుకున్న ఆకాంక్షల్ని ప్రామాణికం లేదా ప్రాతిపదిక చేసుకొని ఆయా రాజకీయ పార్టీలు బిహార్ ప్రజల తీర్పును విశ్లేషించడం అశాస్త్రీయం అవుతుంది. ఔను, కాళ్ల సైజును బట్టి చెప్పులు నరుక్కొనే పాదచారులకు నడక ఎట్టి అసౌకర్యం కలిగించబోదు. కానీ చెప్పుల సైజులను బట్టి తమ కాళ్లు నరుక్కునే వారికి నడక నిజంగానే ఇబ్బందిగా ఉంటుంది. వర్తమాన బిహార్ రాష్ట్ర భౌతిక స్థితిగతులపై ఆధారపడి, ఆ పరిస్థితుల్లో జీవిస్తున్న ప్రజలలో మానసిక, రాజకీయ చలనాలపై ఆధారపడి తీర్పును సమీక్ష చేద్దాం. ప్రజలే చరిత్ర నిర్మాతలనే సూత్రం ఆధారంగా ప్రజలపై నమ్మకాన్ని ప్రదర్శిద్దాం.

-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

రాజకీయ విశ్లేషకులు

Next Story