- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా ఉద్యమాలకు ప్రజలే చరిత్ర నిర్మాతలు..!!
చరిత్రను నిర్మించేది ప్రజలే.. ఆదివాసీ, కార్మిక ఉద్యమాల నుంచి ప్రజా పోరాటాల వరకు ప్రజల చైతన్యం ఎప్పటికీ ఆగదు..

ప్రజా ఉద్యమాలకు ప్రజలే చరిత్ర నిర్మాతలు.. చరిత్ర సృష్టించాలన్న, చరిత్రను తిరగరాయాలన్న అది ప్రజలకు మాత్రమే సాధ్యం. ప్రకృతితో పోటీపడి మరీ పాత చరిత్ర నుంచి కొత్త చరిత్రను సృష్టిస్తారు. ప్రజలు సంక్షోభంలో ఉన్న ఆ సవాళ్ల నుంచే నాయకుడు తయారైతాడు. నాయకుడిని సృష్టించాలన్న, సమాధి చేయాలన్న అది ప్రజలకే సాధ్యం.
గత కొంతకాలంగా ప్రజా పోరాటాలు లేవని, ప్రజలు చైతన్యంగా లేరని, ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం కావడం లేదని అటు ప్రభుత్వాల నుంచి ఇటు కొన్ని ప్రజా ఉద్యమ సంఘాల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. ప్రజల్లో చైతన్యం లేదనడంలో ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలు దోపిడీ వర్గాలు ప్రయోజనాలు ఉండొచ్చు..
ప్రజలకు పరిపక్వత లేదని మీరే అంటే ఎలా?
ప్రజల కోసం మాట్లాడే, హక్కుల కోసం కొట్లాడే వారు ఎవ్వరూ లేరని, జనాలు పాలకుల బానిసలని చెప్పడానికి అధికార వర్గాలు ప్రచారం చేస్తుండొచ్చు. మరి ప్రజల పక్షాన సుదీర్ఘకాలంగా, దశాబ్దాలపాటు అన్ని త్యాగాలకు సిద్దపడి పని చేసిన వారు.. ప్రజలు చైతన్యం కావడం లేదని, వారిలో పోరాటం చేసే పరిపక్వత ఇంకా రాలేదని, పాలక, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే చైతన్యం రాలేదని ప్రకటించడం బాధాకరం. మారిన పరిస్థితుల్లో ప్రజా పోరాటాలకు ఆస్కారం లేదని చెప్పడం పరిస్థితులను, ప్రజల్లో ఉన్న అసంతృప్తిని అంచనా వేయడంలో విఫలమవ్వడమే కారణం.
దోపిడీ వర్గాలతో గొంతు కలపవద్దు!
ప్రజలు చైతన్యంగా లేరు.. జనాలు ప్రభుత్వాలపై, పాలన విధానాలపై సంతృప్తితో ఉన్నారు. దోపిడీ వర్గాల విధ్వంసకర అభివృద్దిపై అసంతృప్తితో లేరు. ఈ వినాశకర, జన వ్యతిరేకత అభివృద్ధి నమూనాలో భాగస్వామ్యం అవుతున్నారని దోపిడీ పాలక వర్గాలు ప్రచారం చేస్తుంటే, ఆ దోపిడీ వర్గాల ప్రకటనల రొంపిలో ప్రజల కోసం త్యాగాల పోరాటాలు చేసిన వారు కొట్టుకుపోతున్నారు.. పాలక వర్గాల ప్రతీప శక్తుల వ్యూహంలో చిక్కుకుపోతున్నారు. నిజానికి అలా ప్రకటిస్తున్న వాళ్లు సుదీర్ఘకాలం త్యాగాల పోరాటాలను చేసినవారే కావడం శోచనీయం. ప్రజలే చరిత్ర నిర్మాతలు, తమలాంటి వాళ్లను లక్షల మందిని తయారు చేసుకోవడం కొత్తేమికాదని, తాము కూడా అక్కడి నుంచే వచ్చినట్లు ఇవాళా పాలక వర్గాలతో గొంతు కల్పుతున్న ఉద్యమకారులకు స్పష్టంగా తెలుసు.. కానీ పరిస్థితులు వాళ్లలో అలా మాట్లాడించేలా పాలక దోపిడీ వర్గాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి కావచ్చు. అలా అని ప్రజలు చైతన్యం కావడం లేదు. పోరాటాలు చేసే పరిస్థితిలో లేరని ప్రకటించడం వారి అజ్ఞానమే అవుతుంది.
మావోయిస్టు పార్టీ త్యాగాలు అపారం!
మావోయిస్టు పార్టీ దగ్గరకే వద్దాం.. పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల కోసం ఆ పార్టీ ఎన్నో త్యాగాలు చేసింది. దశాబ్దాల కాలం ప్రజలను చైతన్యం చేయడంతో పాటు ప్రజలతో కలిసి ప్రజా పోరాటాలు చేసింది. పాలక వర్గాల దోపిడీ ఎండగట్టుతూ ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మించి చూపించింది. దేశ రాజకీయాలను, ప్రజల ఆలోచనల విధానాలను ప్రభావితం చేసింది. అలాంటి త్యాగాల చరిత్ర ఉన్న పార్టీలో నాయకత్వ స్థానంలో ఉన్న వాళ్లు (లొంగిపోయిన తర్వాత) కూడా ప్రస్తుతం ప్రజా పోరాటాలు నిర్మించడం సాధ్యం కాదని, ప్రజలను సంఘటితం చేసే అవకాశం లేదంటూ ప్రజలు చైతన్యం కావడం లేదంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఇవి పాలక వర్గాల ప్రకటనలకు కొనసాగింపుగానే ఉంటున్నాయి.
పోరాటం ఆదివాసీల జన్మ హక్కు!
నిజానికి మావోయిస్టు పార్టీ దండకారణ్యంలోకి ముందు నుంచే శతాబ్దాల తరబడి ఆదివాసులు, గిరిజనులు తమ హక్కుల కోసం పాలక వర్గాలు, ప్రభుత్వ వర్గాలతో పోరాటం చేస్తున్నారు. అస్తిత్వం, జల్-జంగిల్-జమీన్ కోసం ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. మైదాన ప్రాంతం నుంచి షెల్టర్ కోసం వెళ్లిన అన్నలు ఆదివాసుల పోరాటాలకు దిశ నిర్దేశం చేశారు తప్ప వాళ్ల పోరాటాలకు నాయకత్వం వహించలేదు.. ఏ విధంగానైతే ప్రజా ఉద్యమాల నిర్మాణం కోసం అన్నలు షెల్టర్ కోసం అడవికి వెళ్లారో.. ఇప్పుడు మళ్లీ మైదాన ప్రాంతానికి వచ్చారు.
ప్రజలు చైతన్యంతో ఉన్నారు.. డౌటే లేదు!
అయితే అటు పాలక దోపిడీ వర్గం, ఇటు రహస్య జీవితాలు గడిపి, ఇప్పుడు బహిరంగ జీవితంలోకి వచ్చినవారు చెపు తున్నదంతా పచ్చి అబద్దమని చరిత్ర, వర్తమానం ప్రజలు తమ పోరాటాలతో నిరూపిస్తున్నారు. ప్రజలు చైతన్యంతో ఉన్నారని. దండకారణ్యంలో ఆదివాసి పోరాటాలు అనేకం కనిపిస్తున్నాయి. చత్తీస్‌గడ్, రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పలు చోట్ల ఆదివాసీలు తమ హక్కుల రక్షణ కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. దేశ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న హర్యానాలో కార్మికులు తమ హక్కులకై పోరాటం చేస్తున్నారు.
మాజీలకు కనువిప్పు కలిగిస్తున్న పోరాటాలు..
దేశ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ప్రజలు పోరాటాలు చేసేందుకు సంసిద్దంగా లేరని, మావోయిస్ట్ పార్టీ సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటుందని చెబుతున్న ఈ సందర్భంలోనే గతంలో కంటే ఎక్కువ ప్రజలు చైతన్యమై తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.. ప్రజలు చైతన్యంగా లేరు. పోరాటాలు చేసేందుకు సిద్దంగా లేరని చెప్పే వారికి హర్యానా మొదలు మధ్య భారత్ మీదుగా పాడేరు వరకూ ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకూ ఆది వాసులు, కార్మికులు చేస్తున్న ప్రత్యక్ష పోరాటాలు అటు పాలక వర్గాలకు ఇటు బహిరంగంగా జీవితంలోకి వచ్చిన మాజీ మావోయిస్టులకు కనువిప్పు కలిగించాలి. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపొచ్చేమోగానీ, ప్రజా చైతన్యాన్ని, ప్రజా పోరాటాలను ఆపడం సాధ్యం కాదు. చైతన్య రూపాలు, పోరాట రూపాలు మారుతాయి కానీ పోరాటాలు మాత్రం ఆగిపోవు..!!
- తోటకూర రమేష్
98661 68676






