- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త జిల్లాలు కారాదు... పాత తప్పుల శాశ్వత గుర్తులు
పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలన్న నినాదంతో చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు అనేక అనుకోని పరిణామాలకు దారి తీసింది. జిల్లాలు పెరిగినా సేవలు సులభంగా చేరుతున్నాయా అన్న సందేహం మిగిలే ఉంది.

పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలన్న నినాదంతో చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు అనేక అనుకోని పరిణామాలకు దారి తీసింది. జిల్లాలు పెరిగినా సేవలు సులభంగా చేరుతున్నాయా అన్న సందేహం మిగిలే ఉంది. జనాభా, భౌగోళిక సౌలభ్యం, మౌలిక వసతులను విస్మరించడం వల్ల అనేక జిల్లాలు అసంపూర్ణంగా మారి, సిబ్బంది కొరత, సమన్వయ లోపాలు పెరిగాయి. కోట్ల ప్రజాధనం ఖర్చవుతున్నా సేవల నాణ్యత మెరుగుపడడం లేదు.
గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అదికార పక్షం ప్రయోజనాలు నెరవేరటం, కలెక్టర్ల సంఖ్య పెంపుదల, దిగుపస్థాయి అధికారులకు తామెన్నడూ ఊహించని ప్రమోషన్లు వచ్చి అందలమెక్కడం తప్ప ప్రజా ప్రయోజనం సిద్దించలేదని అసంఖ్యాక విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు కలెక్టర్ ఆఫీసుల్లో పనులు లేక గోళ్లు గిల్లుకుంటున్నారనే జోకులు కూడా మొదలైపోయాయి.
అందుబాటులో పరిపాలన ఏది?
గత కేసీఆర్ ప్రభుత్వం “అందుబాటులో పరిపాలన” నినాదాన్ని ముందుకు తెచ్చినా, అమలులో అది శాస్త్రీయ ప్రణాళికకు బదులు స్థానిక నాయకుల స్వార్థ రాజకీయాలకు అనుగుణమైన నిర్ణయాలుగా మారింది. జిల్లా సమీకృత కార్యాలయాల నిర్మాణాలు ప్రజల సౌకర్యాన్ని విస్మరించి, ఇష్టారీతిన తమ నాయకులకు అనువైన ప్రాంతాల్లో చేపట్టడం వల్ల తీవ్ర అసౌకర్యాలు ఏర్పడ్డాయి. పట్టణాల్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నప్పటికీ, నాయకుల భూముల విలువ పెంపుకోసం రవాణా సౌకర్యాలు లేని దూర ప్రాంతాల్లో నిర్మాణాలు జరగడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. కోట్ల ప్రజాధనం వెచ్చించినా సిబ్బంది నియామకాలు లేక కార్యాలయాలు నిర్వీర్యమయ్యాయి. సేవల కోసం ప్రజలు, విధుల కోసం ఉద్యోగులు ప్రతిరోజూ ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చి ఆర్థిక భారం పెరిగింది. పరిపాలన చేరువ కావాల్సిన చోట, అది దూరం, ఖర్చు, నిరాశగా మారింది.
పేరుకు మాత్రమే కొత్త జిల్లాలు
తెలంగాణలో నూతన జిల్లాల ఏర్పాటులో జరిగిన గత తప్పులను సరిదిద్దే అవకాశం, అవసరం రెండూ ఉన్నాయి. ‘పునర్విభజన’ ద్వారా జిల్లాల నిర్మాణాన్ని శాస్త్రీయంగా, ప్రజాహితాన్ని కేంద్రంగా పెట్టుకుని పునఃపరిశీలించి క్రమబద్ధీకరించాలి. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు, జిల్లా పరిపాలన మధ్య సమన్వయం తీసుకురావాలి. ప్రజలకు నిజంగా ఉపయోగపడే పాలననే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోకపోతే, ‘కొత్త జిల్లాలు’ అనే పేరు మాత్రమే మిగిలి, అవి పాత తప్పుల శాశ్వత గుర్తులుగా నిలిచిపోతాయి.
జిల్లాల పునర్విభజన.. రాజకీయ ప్రయోగమేనా?
ప్రజలకు పాలన సులభంగా, సమర్థవంతంగా అందించడమే రాష్ట్ర పరిపాలన లక్ష్యం. అందుబాటులో పాలన అంటే ఆదేశాలు కాదు, సేవలు సులభంగా లభించే, సమస్యలు వేగంగా పరిష్కరించే, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ. ఇందుకు భౌగోళిక సౌకర్యం, కార్యాలయాల సమగ్రత, సిబ్బంది లభ్యత, సమాచార ప్రవాహం, ప్రజాభిప్రాయం కీలకం. అప్పుడు అవినీతి తగ్గి, సేవల నాణ్యత పెరిగి, అభివృద్ధి సమతుల్యంగా చేరుతుంది. ఇదే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. పేదరికం, నిరుద్యోగం, విద్య, ఆరోగ్య అసమానతలు వంటి మౌలిక సమస్యలకు నినాదాలు కాదు, వాస్తవాలు, గణాంకాలు, కారణ ఫలిత విశ్లేషణే పరిష్కారం చూపాలి.
గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళం..
శాస్త్రీయ ప్రణాళిక, సమన్వయం, నిరంతర పరిశీలన లేకుండా చేపట్టిన పాలన ప్రజల ఆశలను నిరాశగా మారుస్తోంది. సమాజ సమస్యలకు తాత్కాలిక రాజకీయ లాభాల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు పరిష్కారాలు ఇవ్వక, కొత్త గందరగోళాలనే సృష్టిస్తున్నాయి. పరిపాలనను చేరువ చేయాలన్న నినాదంతో శాస్త్రీయ అధ్యయనం లేకుండా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు అనేక అనుకోని పరిణామాలకు దారి తీసింది. జిల్లాలు పెరిగినా సేవలు సులభంగా చేరుతున్నాయా అన్న సందేహం మిగిలే ఉంది. జనాభా, భౌగోళిక సౌలభ్యం, మౌలిక వసతులను విస్మరించడం వల్ల అనేక జిల్లాలు అసంపూర్ణంగా మారి, సిబ్బంది కొరత, సమన్వయ లోపాలు పెరిగాయి. కోట్ల ప్రజాధనం ఖర్చవుతున్నా సేవల నాణ్యత మెరుగుపడడం లేదు.
నియోజకవర్గాలకు‘విభజన’ శాపం..
కొత్త జిల్లాల ఏర్పాటులో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సరిహద్దులు కేవలం పరిపాలనా అంశం కాదు. ఇది ప్రజాస్వామ్య ప్రతినిధిత్వాన్ని ప్రభావితం చేసే కీలక ప్రక్రియ. జనాభా సమతుల్యత, భౌగోళిక సౌలభ్యం, పరిపాలనా సమగ్రత, ప్రజాభిప్రాయం ఆధారంగా శాస్త్రీయంగా జరగాల్సి ఉంది. నియోజకవర్గాల పరిధులను విస్మరించడం వల్ల ఒకే నియోజకవర్గం అనేక జిల్లాలుగా చీలి, ప్రజలు సమస్యల పరిష్కారానికి ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధి నిధులు, సంక్షేమ అమలు, అధికారుల సమన్వయం గందరగోళమై, ప్రజాప్రతినిధుల బాధ్యత స్పష్టత కోల్పోయింది. జిల్లా పరిపాలన, నియోజకవర్గాల మధ్య సమన్వయ లోపం పనుల ఆలస్యానికి దారి తీస్తోంది. శాస్త్రీయ అధ్యయనం లేని ఈ విభజనలు అభివృద్ధిని అసమానంగా మార్చి, కొత్త జిల్లాలను సౌలభ్యంగా కాక భారంగా మారుస్తున్నాయన్న నిజం స్పష్టమవుతోంది.
పాలన కోసం కొత్త పరిష్కారాలు..
ప్రజలకు పాలనను చేరువ చేయాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన సరైనదే. అయితే దాని అమలు శాస్త్రీయ ప్రణాళిక లేకుండా జరగడంతో నేటికీ పాలనా గందరగోళం కొనసాగుతోంది. భౌగోళిక అనుకూలత, పరిపాలనా సామర్థ్యం, ప్రజల జీవన వాస్తవాలను విస్మరించి అప్పటి రాజకీయ అవసరాలకే ప్రాధాన్యం ఇచ్చిన ఫలితంగా, అభివృద్ధి పేరుతోనే ప్రజలు అసౌకర్యాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాహితాన్ని కేంద్రంగా పెట్టుకుని జిల్లాల వ్యవస్థను సమగ్ర సమీక్షతో ‘పునర్విభజన’ చేసి కుదించి, క్రమబద్దీకరించి, అవసరమైతే నూతన జిల్లాలు ఏర్పాటు చేసే బాధ్యత ఉంది. రాజకీయ కోణాన్ని పక్కనబెట్టి, దీర్ఘకాలిక ప్రజాహితం, వాస్తవ అవసరాలు, శాస్త్రీయ మదింపు ఆధారంగా కొత్త జిల్లాలపై పునఃపరిశీలన తప్పనిసరి.
-నంగె శ్రీనివాస్,
ఎడ్యుకేషన్& సోషల్ ఎనలిస్ట్,
94419 09191






