- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆకలి కేక నుంచే మధ్యాహ్న భోజనం
మధ్యాహ్న భోజన పథకంతో పిల్లలను శోభనానికి సిద్ధపరుస్తున్నట్లుంది అంటూ అవదానులు, ప్రవచనకర్తలు గరికపాటి పెద్ద సంచలనం రేకెత్తించారు.

దిశ, వెబ్ డెస్క్: మధ్యాహ్న భోజన పథకంతో పిల్లలను శోభనానికి సిద్ధపరుస్తున్నట్లుంది అంటూ అవదానులు, ప్రవచనకర్తలు గరికపాటి పెద్ద సంచలనం రేకెత్తించారు. తన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విభిన్నంగా వైరల్ అవుతున్నాయి. గరికపాటి వ్యాఖ్యలు తీవ్రంగా ట్రోల్ అవుతున్నాయి. ఆయన సమర్థకులు కూడా మద్దతివ్వడానికి సాహసించలేని తీవ్ర వ్యాఖ్యలవి. ఈ నేపథ్యంలో భారత దేశం చరిత్రలో పేద పిల్లల ఆకలి కేకనుంచి మధ్యాహ్న భోజన పథకం ఎలా పుట్టుకొచ్చింది, దానికి ఆద్యులెవరు, సుప్రీంకోర్టు తీర్పుతో ఈ పథకం దేశ వ్యాప్తంగా ఎలా అమలవుతోంది వంటి విశేషాలను ఈ కథనంలో చూడవచ్చు.
"నేను తింటేనే కదా చదువుకోగలను అయ్యా!" – ఒక నిరుపేద బాలుడి నోట వెలువడిన ఈ ఆర్తనాదం, అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి, భారత రత్న కామరాజ్ గుండెలను కలిచివేసింది. ఆ ఆకలి కేక నుంచే 1956లో అక్షరాలకు ఆయువు పోసే 'మధ్యాహ్న భోజన పథకం' పురుడుపోసుకుంది. అది కేవలం ఒక అన్నం ముద్ద కాదు, కోట్లాది మంది చిన్నారుల భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది.
భోజన పంపిణీ ఓ అనివార్య హక్కు
కాలక్రమంలో ఎం.జి. రామచంద్రన్ హయాంలో ఇది పోషకాహార శక్తిగా రూపాంతరం చెందింది. 1995లో కేంద్ర ప్రభుత్వం దీనిని జాతీయ పథకంగా స్వీకరించగా, 2001లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పుతో దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ వండిన భోజనం అందించడం ఒక అనివార్య హక్కుగా మారింది.
విద్యా విప్లవానికి సాక్ష్యాలు
మన ఆంధ్రప్రదేశ్ పురోగతిలోనూ ఈ పథకానిది చెరగని ముద్ర. కోట్ల భాస్కరరెడ్డి కాలంలో ఇది అంకురార్పణ చేసుకోగా, ఎన్టీఆర్ హయాంలో పాలు, రొట్టెలతో విస్తరించింది. ఆ రోజుల్లో పది పైసల విస్తరాకును బడి సంచిలో జాగ్రత్తగా దాచుకుని వెళ్లిన జ్ఞాపకాలు, తోటి పిల్లలతో కలిసి తిన్న అన్నంతో చిక్కటి పప్పుచారు రుచి ఇప్పటికీ మనసు పొరల్లో పచ్చిగానే ఉన్నాయి. బడి గంట వినబడగానే ఆకలితో పరుగెత్తిన ఆ రోజులు ఒక తరం విద్యా విప్లవానికి సాక్ష్యాలు.
భోజన సమానత్వం
నిజానికి, ఈ దేశంలో ప్రతి చిన్నారి రేపటి భారతానికి ఒక సజీవ పెట్టుబడి. ఆ ఎదుగుదలను ఆకలితోనో, వివక్షతోనో చిదిమేయడం సభ్య సమాజానికి సబబు కాదు. మన విద్యా వ్యవస్థలో మధ్యాహ్న భోజనం అనేది కేవలం ఆహార పంపిణీ కార్యక్రమం మాత్రమే కాదు; అది సామాజిక సమరసతకు, సమానత్వానికి ప్రతీక. ప్రస్తుత మారుతున్న కాలానికి అనుగుణంగా, బెంగాల్, అండమాన్, ఈశాన్య రాష్ట్రాలు, అభివృద్ధి చెందిన దేశాల తరహాలో, మన చిన్నారుల మెనూలో కేవలం గుడ్డుకే పరిమితం కాకుండా మాంసం, రొయ్యలు, చేపల వంటి సమృద్ధియైన ప్రోటీన్లను అందించాలి. బలమైన ఆహారమే బలమైన మేధస్సుకు మూలం.. ఆ దిశగా అడుగులు పడటమే ఆ పసివాడి ఆకలికి మనం ఇచ్చే అసలైన గౌరవం.
(సోషల్ మీడియా సేకరణ)
జి. శ్రీనివాస్
జర్నలిస్టు






