మండల విద్యావ్యవస్థ భేష్.. కానీ

by Ravi |   (  Updated:2025-06-18 00:45:20  IST  )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల పదోన్నతులను గత ఏడాది

మండల విద్యావ్యవస్థ భేష్.. కానీ
X

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల, ప్రధానోపాధ్యాయుల పదోన్నతులను గత ఏడాది ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దీంతో పాఠశాలల నిర్వహణ, పనితీరు మెరుగుపడింది. ఆ సమయంలోనే రాష్ట్రంలో ఉన్న 612 మండలాల్లో కొత్తగా మండల విద్యాధికారులను నియమించారు. అయితే 90 శాతానికి పైగా ఉన్నత పాఠశాలలకు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులే కేటాయించబడ్డారు. అయితే మండల విద్యాధికారులుగా బాధ్యత లు అప్పజెప్పేటప్పుడు చాలా మండలాల్లో సీనియారిటీని పరిగణలోకి తీసుకోకుండా...ఉన్నత పాఠశాల నిర్వహణలోకి అప్పుడప్పుడే వచ్చిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు అప్పగించడంతో అనుభవ లేమి కారణంగా మండల విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతున్నది. ఒక్కో మండలం సగటున పదిమందికి పైగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఉండగా..ఎంఎన్‌వోలు గా ఉన్నవారినే మండల విద్యాధికారులుగా నియమించారు..

అధికార కేంద్రీకరణతో కీడు..

ఒకే హెడ్‌మాస్టర్‌‌కు అనేక బాధ్యతలు అప్పగించడంతో అధికార కేంద్రీకరణ జరుగుతోంది. దీంతో విద్యారంగానికి మేలు కన్నా కీడే ఎక్కువగా పెరుగుతుంది. ప్రతీ మండ లంలో పదిమందికి పైగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఉండగా.. ఒకే ప్రధానోపాధ్యాయుడు తన బడికి హెడ్‌ మాస్టర్‌గా, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిగా, మండల విద్యాధికారిగా, మండల నోడల్ అధికారిగా, పీఎం‌శ్రీ నోడల్ అధికారిగా పంచావధానం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా బహుళ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుల సొంత పాఠశాల పర్యవేక్షణ గాలిలో దీపమే కదా.!

విద్యాధికారుల పనితీరు ఇలా ఉంటే..?

అనుభవం, సీనియారిటీ లేని ఇంచార్జి మండల విద్యాధికారుల పనితీరును ఒకసారి పరిశీలిద్దాం.. ఒక మండలంలో ఓ విద్యాధికారి గత విద్యా సంవత్సరంలో ఒక పాఠశాలను సందర్శించారు.. ఆ ఏకోపాధ్యాయ పాఠశాలలో అంతకుముందు విద్యార్థుల సంఖ్య చాలా తక్కువ. అక్కడి ఉపాధ్యాయుడు తపనతో విద్యార్థులను రెండంకెల స్థాయికి తీసుకువచ్చారు. అవేవీ పరిశీలించకుండా సదరు టీచర్‌కి రకరకాల రికార్డులు సరిగ్గా లేవని మెమో ఇచ్చారు.. ఇక ఎఫ్ఎల్ఎన్ పర్యవేక్షణలో కూడా సూచనలు మాత్రమే ఇవ్వాలి. మార్గదర్శకం చేయాల్సి ఉండగా ఎఫ్ఎల్ ఎన్‌కి సంబంధించి కూడా మెమోలు ఇచ్చారు.. కొత్త డీఎస్సీ ద్వారా వచ్చిన ఉపాధ్యాయులకు తగు సలహాలు ఇవ్వాల్సి ఉండగా నేరుగా మెమోలు ఇస్తున్నారు.. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.. ఇదే కాకుండా అధికార బాధ్యతలన్నీ ఒకే వ్యక్తికి అప్పగించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ లోపించి ఏకస్వామ్య ధోరణికి కారణమవుతుంది. ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తున్న సదరు ప్రధానోపాధ్యాయుల పాఠశాలలో మరొక సబ్జెక్టు ఉపాధ్యాయుడు ఇంచార్జి బాధ్యతల్లో ఉండడంతో విద్యార్థులకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. దీంతో ఎంతో నిబద్దతతో ప్రభుత్వం విద్యారంగ పటిష్టతకు తీసుకున్న నిర్ణయాలు ఇలాంటి వాటితో నీరు గారే ప్రమాదం ఉన్నది.

మరేం చేయాలి..?

ప్రతీ మండలంలో పదిమందికి పైగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఉన్నందున వివిధ ఇంచార్జీ బాధ్యతలను సీనియారిటీ మేరకు మాత్రమే అప్పగించాలి. అదే ప్రాతిపదికగా మండల విద్యాధికారి, ఎంఎన్‌వో, పీఎంశ్రీ నోడల్ అధికారుల బాధ్యతలను మండలంలోని ఒక్కో గెజిటెడ్ ప్రధానోపా ధ్యాయునికి ఒక్కో బాధ్యతను అప్పగించాలి. మండల విద్యాధికారిగా ఇంచార్జి బాధ్యతల్లో ఉన్న ప్రధానోపాధ్యాయుల పాఠశాల సక్రమ నిర్వహణ కోసం ఎఫ్ఏసీ ప్రధానోపాధ్యాయులను నియమించాలి.. సీనియారిటీ లేకుండా ఇచ్చిన వివిధ ఇంచార్జీలను తొలగించి సీనియర్లకు అవకాశం ఇవ్వాలి‌. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ తగు చర్యలు తీసుకోవాలని విద్యాభిమానులు కోరుకుంటున్నారు..

వెన్నెల సత్యం

94400 32210

Next Story