- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమా ఆలోచనను తయారు చేసిన మనిషి.. జగత్ మురారి
పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్ అనగానే అక్కడ శిక్షణ పొందిన నసీరుద్దీన్ షా, ఓం పూరి, షబానా అజ్మి, స్మితా పాటిల్ లాంటి అనేక మంది ప్రతిభావంతులయిన కళాకారులు గుర్తొస్తారు.. పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్ భారతీయ సినిమాను వ్యాపారం నుంచి ఆలోచనకు ప్రగతివాదం వైపు, కళాత్మకత వైపు మలుపు తిప్పిన సంస్థ. అది కేవలం సినిమా నిర్మాణాన్ని నేర్పిన చోటు కాదు.. అది సినిమాకు ఆలోచించడం నేర్పిన చోటు..

పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్ అనగానే అక్కడ శిక్షణ పొందిన నసీరుద్దీన్ షా, ఓం పూరి, షబానా అజ్మి, స్మితా పాటిల్ లాంటి అనేక మంది ప్రతిభావంతులయిన కళాకారులు గుర్తొస్తారు.. పూనా ఫిలిం ఇన్‌స్టిట్యూట్ భారతీయ సినిమాను వ్యాపారం నుంచి ఆలోచనకు ప్రగతివాదం వైపు, కళాత్మకత వైపు మలుపు తిప్పిన సంస్థ. అది కేవలం సినిమా నిర్మాణాన్ని నేర్పిన చోటు కాదు.. అది సినిమాకు ఆలోచించడం నేర్పిన చోటు. ఇవ్వాల్టికీ భారతీయ సినిమాల్లో కనిపించే నిజాయితీ, మౌనం, సామాజిక స్పృహ అన్నిటి వెనక ఎక్కడో ఒకచోట పుణే క్యాంపస్ నీడ తప్పకుండా ఉండే ఉంటుంది.
భారతీయ సినిమాకు ఒకప్పుడు రాజధాని బొంబాయి. కానీ సినిమాను చదవడం అనే కొత్త ఆలోచన మాత్రం బొంబాయిలో పుట్టలేదు. అది పుట్టింది నిశ్శబ్దంగా పుణె (పూనా)లో.. దృశ్య మాధ్యమం విషయంలో 1947 తర్వాత భారతదేశం ఎదుర్కొన్న ప్రధాన ప్రశ్న ఒక్కటే మన దేశానికి కావలసిన సినిమా ఏది? వట్టి వినోదం సరిపోదు, ప్రచారం సరిపోదు.. సినిమా ఒక సాంస్కృతిక భాష కావాలి. ఈ ఆలోచన నుంచే ప్రభుత్వ స్థాయిలో సినిమా విద్య అవసరం అనే చర్చ మొదలైంది. దానికి మరి పుణె ఎందుకు ఎంపికయింది అంటే దానికి కారణం ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ.
ఈ ఇన్‌స్టిట్యూట్ ఆలోచనా ప్రయోగశాల..
1930–40 దశకాల్లో ప్రభాత్ స్టూడియోస్ భారతీయ సినిమాకు ఒక సృజనాత్మక కేంద్రం. కాలక్రమంలో ప్రభాత్ స్టూడియోస్ మూతపడినా, ఆ ఊరు మాత్రం సినిమా జ్ఞాపకంతో నిండిపోయింది. అదే ఊరు భారతీయ సినిమా విద్యకు వేదికగా మారింది. 1960లో భారత ప్రభుత్వం ఫిలిం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను పుణెలో స్థాపిం చింది. ఆ తరువాత అది ఫిల్మ్ & టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)గా మారింది. అప్పటి ప్రభుత్వం దీనిని ప్రారంభిస్తూ సృజనాత్మక వేదిక అని స్పష్టంగా చెప్పింది. ఈ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో సినిమా ఎలా తీయాలో కాదు నేర్పలేదు.. ఇది ఒక ఆలోచనా ప్రయోగశాల. ఈ సంస్థకు ఆత్మ ఇచ్చిన వ్యక్తి జగత్ మురారి. ఆయన 1962లో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ను కేవలం శిక్షణ కేంద్రంగా కాకుండా ఒక బౌద్ధిక వేదికగా మార్చాడు. సినిమా ఒక కళ మాత్రమే కాదు, ఒక సామాజిక బాధ్యత అన్నది ఆయన నమ్మకం. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులు ఇటాలియన్ నియో-రియలిజం, ఫ్రెంచ్ న్యూ వేవ్, సోవియట్ సినిమా ఇవన్నీ చదువుకున్నారు. కానీ అనుకరణ కోసం కాదు. ఆయన బోధనలో హీరో ఎవరు? అనే ప్రశ్న ఉండేది కాదు.. ‘ఈ కథ ఎవరిది?’ అనే ప్రశ్నే ఉండేది.
ఈ క్యాంపస్ భావ ప్రపంచం..
సినిమా ఒక భాష అయితే ఫిలిం ఇన్‌స్టిట్యూట్ దానికి వ్యాకరణం నేర్పింది. సమాంతర కళాత్మక ప్రాంతీయ సినిమాలు ఆ వ్యాకరణంతో రాసిన మన కథలు. సంస్థలు నిలబడతాయి.. కాని కొన్ని పేర్లు తెర మీద కనిపించవు. కానీ ఆ తెర ఎలా ఊపిరి పీల్చుకోవాలో, ఏ దృశ్యం ఎంత మౌనంగా మాట్లాడాలో ఆ పేర్లే నేర్పిస్తాయి. జగత్ మురారి అలా కనిపించకుండా కనిపించిన మనిషి. భారతీయ సినిమా గురించి మాట్లాడేటప్పుడు మనం దర్శకులను గుర్తు పెట్టుకుంటాం, నటులను గుర్తు పెట్టుకుంటాం. కానీ సినిమా ఆలోచనగా మారిన క్షణం ఎవరి దగ్గర మొదలైంది అని అడిగితే జవాబు తరచూ మౌనంగానే ఉంటుంది. ఆ మౌనంలోనే జగత్ మురారి ఉన్నాడు. సినిమా ఒక కళ కాదు.. ఒక బాధ్యత అన్నట్టుగా జగత్ మురారి సినిమాను ప్రేమించాడు.. కెమెరా చేతిలో ఉన్నప్పుడు అది ఒక ఆయుధం కాదు, ఒక అద్దం కావాలని నమ్మాడు. నిజానికి పుణె ఇన్‌స్టిట్యూట్ ఒక క్యాంపస్ కాదు, ఒక భావప్రపంచం. ఆయన చేతుల్లో ఆ సంస్థ ఆలోచించే మనిషిగా ఎదిగింది. ‘షాట్ ఎందుకు ఇక్కడ ముగిసింది?’ ‘ఈ మౌనం ఎందుకు ఇంత పొడవుగా ఉంది?’ ‘ఈ ముఖం మనకు ఏం చెప్పడం లేదు?’ ఇవి అక్కడ వినిపించిన ప్రశ్నలు..
భారతీయ సినిమా చరిత్రకు పునాది..
1924లో జన్మించిన జగత్ మురారి సినిమా స్టార్ కావాలనే కలతో కాదు, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని సినిమా వైపు నడిచాడు. చిన్ననాటి నుంచే సమాజంలోని అనేక విషయాలు అతని దృష్టిని ఆకర్షించేవి. అదే తరువాత డాక్యుమెంటరీ చూపుగా మారింది. డాక్యుమెంటరీ అంటే వాస్తవాన్ని అలంకరించడం కాదు, వాస్తవానికి దగ్గరగా మనల్ని నిలబెట్టడం అనే నమ్మకం ఆయనది. అందుకే ఆయన సినిమాల్లో వాయిస్ ఓవర్ కంటే మౌనం ఎక్కువ. సంగీతం కంటే జీవిత శబ్దం ఎక్కువ. ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా, ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పటికీ తన సినిమాలకంటే ఇతరుల సినిమాల కోసం అంకితమైంది. మురారి గొప్పతనం వ్యక్తిగత ప్రతిభలో కాదు. వ్యవస్థ నిర్మాణంలో, ఫిలిం ఇన్‌స్టిట్యూట్ పాఠ్యక్రమంలో అన్నింటిలో ఆయన ముద్ర ఉంది. 2007లో జగత్ మురారి కన్నుమూశాడు.. కానీ ఆయన పేరు మీద విగ్రహాలు లేవు.. పండుగలు లేవు.. అయినా భారతీయ సినిమా తెరపై నిజాయితీగా కనిపించే ప్రతి అంశంలో అతని ఉనికి ఉంది. ఈయన సినిమా చేసినవాడు కాదు.. సినిమా ఆలోచనను తయారు చేసినవాడు. అందుకే భారతీయ సినిమా చరిత్రలో అతను ఒక అధ్యాయం కాదు. ఒక పునాది. ఆయన శిక్షణలో అదూర్ గోపాలక్రిష్ణన్, జయాబాధురి లాంటి అనేక మంది ప్రతిభావంతులు భారతీయ సినిమాకు లభించారు.
- వారాల ఆనంద్
94405 01281






