సీమ జీవనాడి... హంద్రీనీవా!

by Ravi |   (  Updated:2025-10-08 01:00:05  IST  )

ఎన్ని సిరులున్నా అసలు సిరి జలసిరి అని నిరూపించిన జననేత ఏపీ సీఎం చంద్రబాబు. హంద్రీనీవా ద్వారా కృష్ణమ్మను రాయలసీమకు తరలించి

సీమ జీవనాడి... హంద్రీనీవా!
X

ఎన్ని సిరులున్నా అసలు సిరి జలసిరి అని నిరూపించిన జననేత ఏపీ సీఎం చంద్రబాబు. హంద్రీనీవా ద్వారా కృష్ణమ్మను రాయలసీమకు తరలించి నీటి జాడలేని ప్రాంతాల్లో జలసిరులు కురిపించి సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న జల ప్రదాతగా నిలుస్తున్నారు.

హంద్రీనీవా సుజల స్రవంతి పథకాన్ని 3850 క్యూసె క్కుల సామర్థ్యంతో 40 టీఎంసీల కృష్ణా నదీ వరద జలాలను వినియోగించుకోవటం ద్వారా ఉమ్మడి క‌ర్నూ లు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 414 గ్రామాలలోని 33 లక్షల జనాభాకు తాగునీరు అందించాలని సంకల్పించారు.

జగన్ పూర్తి చేయకపోవడంతో..

ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తికి తెలుగుదేశం ప్రభుత్వం రూ.4,182 కోట్లు ఖర్చు చేయగా జగన్ ప్రభుత్వం అయిదేళ్లలో కేవలం రూ.515 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. తెలుగుదేశం హయాంలో మొదటి ఫేజ్‌ 84శాతం పూర్తయింది. మిగిలిన పనులు 2020 జూన్‌ నాటికే పూర్తి చేస్తామన్నగత ప్రభుత్వం పూర్తి చేయలేదు. 2.5లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న గాలేరు-నగరి మొదటి ఫేజ్‌ పనులు కూడా ప్రభుత్వం 84 శాతం పూర్తి చేసింది. మిగిలిన పనులు జగన్ పూర్తి చేసి 2020లో ప్రారంభిస్తామన్నారు. అదీ చేయలేదు. 42వేల ఎకరాల ఆయకట్టు ఉన్న పెన్నా అహోబిలం బ్యాలెన్స్‌ రిజర్వాయరు రెండో ఫేజ్‌పై తెలుగుదేశం ప్రభుత్వం రూ.411కోట్లు ఖర్చు చేస్తే, జగన్ ప్రభుత్వం రూ.42 కోట్లు ఖర్చు చేసింది. 2020 నాటికి పనులు పూర్తి చేస్తామన్న హామీనీ నిలబెట్టుకోలేదు.

వరుస సమీక్షలతో పరుగులు పెట్టించి..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటికే ఉన్న మోటర్లను పూర్తి సామర్ధ్యంతో వినియోగించడం ద్వారా హంద్రీనీవా మెయిన్ కెనాల్‌ లో పూర్తి సామర్ధ్యంతో నీటిని విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు చేసి పనులు పరుగులు పెట్టించారు. మెయిన్ కెనాల్ పుంగనూరు బ్రాంచ్, కుప్పం బ్రాంచ్ కెనాల్స్‌లో మిగిలిన పనులు విస్తరణ, లైనింగ్ చేపట్టడానికి రూ 2,629 కోట్లకు డిసెంబర్ 2024 పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. ఆ పనులను 2025 ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభించి నాలుగు నెలల్లో రికార్డు సమయంలో పూర్తి చేశారు. కాలువ సామర్థ్యం పెరిగి మల్యాల నుంచి 738 కి.మీ దూరంలో ఉన్న పరమ సముద్రం ట్యాంకుకు నీటిని తరలించారు. 24 గంటల్లో 3,000 మంది కార్మికులు, అత్యాధునిక యంత్ర సామాగ్రి ఉపయోగించి 79,438 చదరపు మీటర్ల కాంక్రీట్ లైనింగ్ 4.5 కి,మీ పొడవు పూర్తి చేసి రికార్డు సృష్టించింది ప్రభుత్వం.

నిబద్ధత అంటే ఇదీ...

2025-26 బడ్జెట్‌లో అత్యధికంగా రూ 3,243.59 కోట్లు హంద్రీనీవాకి కేటాయించడం ద్వారా సీమ అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను నిరూపించారు చంద్రబాబు. ఫేజ్ 1 హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు చేయడం ద్వారా కాలువ సామర్ద్యాన్ని 2,200 క్యూసెక్కుల నుండి 3,850 క్యూసెక్కులకు పెంచడం ద్వారా నెలకు సుమారు 10 టీఎంసీల నీటిని తీసుకొనే సౌలభ్యం ఏర్పడింది. అట్లాగే పేజ్ 2 హంద్రీనీవా ప్రధాన కాలువను లైనింగ్ చేయడం ద్వారా కాలువ సామర్థ్యాన్ని 1,200 క్యూసెక్కుల నుండి 2,200 క్యూసెక్కులకు పెంచుతున్నారు. కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా నెలకు సుమారు 5.70 టీఎంసీల నీటిని తీసుకోవచ్చు. ప్రస్తుతం నెలకు 3.11 టీఎంసీలు, అదనంగా 2,59 టీఎంసీలు. చంద్రబాబు 2025 జూలై 17న మల్యాల వద్ద ప్రధాన కాలువలో నీటిని విడుదల చేశారు.

నెరవేరిన దశాబ్దాల కల..

2025 ఆగస్టు 30న కుప్పం బ్రాంచ్ కెనాల్ చివరి భాగాన పరమ సముద్రం ట్యాంక్ వద్ద జలహారతి ఇచ్చారు. హెచ్.ఎన్.ఎస్.ఎస్ కాలువ కింద మొత్తం 15,261 MCFT నేటి సామర్థ్యం కలిగిన 498 MI ట్యాంకులను నింపాలని ప్రతిపాదించారు. ఇందులో 61 ట్యాంకులను పూర్తిగా నింపడం జరిగింది. 138 ట్యాంకులు పాక్షికంగా నిండాయి. 16 నెలల కూటమి పాలనలో, హంద్రీనీవా ద్వారా కుప్పం ప్రాంత రైతులకు నీరు అందించడం ద్వారా దశాబ్దాల నాటి కుప్పం రైతుల కల నెరవేరింది. హంద్రీనీవా పథకానికి ఎన్టీ‌‌ఆర్ శంకుస్థాపన చేస్తే దాన్ని పూర్తి చేసే అదృష్టం చంద్రబాబుకే దక్కిందని చెప్పాలి.

-నీరుకొండ ప్రసాద్

98496 25610

Next Story